వివిధ పంటలలో రైతులు చేపట్టవలసిన సస్యరక్షణ
పత్తి పంటలో జాగ్రత్తలు:
ఈ సంవత్సరం పత్తి పంటలో తుపాను ప్రభావం వల్ల పత్తి తీయడం ఆలస్యం అయింది. ప్రస్తుతం పత్తి అన్ని ప్రాంతాలలో చివరిదశలో ఉంది. సాధారణంగా చివరిలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా వుండొచ్చు. తేమగా వున్న పత్తిని తీయకూడదు. పత్తి తీసిన తరువాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టినట్లైతే రంగుమారి నాణ్యత తగ్గుతుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా కొద్ది కాలం నిల్వ ఉంచుకొని అమ్ముకుంటే మంచి ధర వస్తుంది.
వరి
ఈ మధ్య తెలంగాణా జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయింది. దీని ప్రభావం నారు దిగుబడులపై ఉంటుంది. చలి నుండి నారు మడిని రక్షించడానికి రాత్రిళ్ళు పాలిథీన్ షీట్లతో నారుమడిని కప్పి, ఉదయం తీసివేయాలి.
నీటి యాజమాన్యం:
- నారు మడిలో నేల ఉష్ణోగ్రతను క్రమ పరచడానికి ప్రతి రోజు రాత్రి నీరు పెట్టి ఉదయం నీటిని తీసివేయాలి.
- నారును నాటేముందు బీజామృతంలో శుద్ధి చేసుకోవాలి.
- గోదావరి జిల్లాలలో వరి పిలక దశ నుండి అంకురం దశలో ఉంది. పాముపొడ తెగులు నివారణకు పశువుల పేడ + పశువుల మూత్రం + ఇంగువ కషాయాన్ని పిచికారీ చేస్తే సమర్ధవంతంగా ఈ తెగులును అరికట్టవచ్చు.
కంది:
ప్రస్తుత సమయంలో పూత- కాయ దశలో ఉంది. శనగపచ్చ పురుగు రాత్రి పూట పూ మొగ్గలమీద, కాయల మీద విడివిడిగా ఒక్కొక్క గుడ్డు పెడుతుంది. గుడ్డు నుండి వచ్చిన పిల్ల పురుగులు ఆకుపచ్చ రంగులో ఉండి పూతను గోకి తినేస్తాయి. తరువాత కాయలను కూడా ఆశిస్తాయి. ఒకే పురుగు చాలా కాయలకు నష్టం కలిగిస్తుంది.
నివారణ:
- ఈ పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి ఎకరానికి 10 నుండి 15 పక్షిస్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి.
- పురుగు గుడ్లను తొలి దశలో నివారించడానికి 5 శాతం వేపకషాయం పిచికారీ చేయాలి.
- శనగపచ్చ పురుగుల ఉనికిని గమనించుటకు ఎకరానికి 5 ఫిరమోన్ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి.
- కాయ తొలిచే మచ్చల పురుగు, పిల్ల పురుగు, ఆకు, పూత, కాయలను గుచ్చుగా మార్చి లోపల గూడు చేస్తుంది. కాయలను ఆశించి నష్టపరుస్తుంది.
- పొలంలో ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చుకొని పురుగు ఉధృతిని గమనించవచ్చు.
- పురుగు మందుల పిచికారీ ఆపేయడం వల్ల పొలంలో రైతు మిత్ర పురుగులు పెరుగుతాయి. వీటిని మరింత ఎక్కువ చేయడానికి ట్రైకోగ్రామా పరాన్న జీవులను ఎకరానికి 60,000 చొప్పున (3 కార్డులు) పొలంలో పురుగు ఉధృతిని బట్టి 3-4 సార్లు వదలాలి.
- లార్వా చిన్నదశలో నివారించడానికి పచ్చి మిర్చి వెల్లుల్లి కషాయాన్ని పిచికారీ చేయాలి.
- ఎరపంటగా బంతి, బెండ గట్లపై నాటుకుని దానిపై ఆశించిన లార్వాలను, పురుగు గుడ్లను నాశనం చేయాలి.
మిరప:
ప్రస్తుతం ఆకుముడత ఆశించడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. తామర పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకు అంచులు పైకి ముడుచు కుంటాయి. ఆకులు, పిందె రాగి రంగులోకి మారి పూత పిందె ఎదుగుదల నిలిచిపోతుంది.
నివారణ
- ఈ పురుగు నివారణకు పొలంలో ఆముదం / గ్రీజు పూసిన తెల్లని డబ్బాలను, ఎకరాకు 10 వరకూ అమర్చాలి.
- 1 శాతం వేపనూనె లేదా వావిలాకు కషాయం (5 శాతం) పైరుపై 7 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
- పొలంలోనూ, పొలం గట్లపై ఉన్న వయ్యారి భామ, నానబాలు వంటి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలించాలి. ఈ మొక్కల పుష్పగుచ్ఛాలలో తామర పురుగులు దాగి ఉంటాయి.
- మిరపలో కొమ్మకుళ్ళు తెగులు, ఎండు తెగులు మరియు బూడిద తెగులు నివారణకు పశువులపేడ + మూత్రం + ఇంగువ కషాయం పిచికారీ చేయాలి.
- 5 శాతం వేప కషాయం లేదా 5 శాతం పశువుల పేడ కషాయాన్ని పిచికారీ చేసినచో ఈగ కాయలపై వాలకుండా నివారించవచ్చు.
కాకర, బీర, మరియు పొట్లలో పండు ఈగ నియంత్రణ కొరకు
కాకర, బీర, పొట్ల కాయలను ”ఈగ” నష్టపరుస్తుంది. ఈగ ఆశించిన కాయలు వంకర తిరిగి, ఈగ ఆశించిన చోట నొక్కు ఏర్పడి తరువాత కాయలు కుళ్ళిపోతాయి. ఈగ తాకిడి వలన నష్టం వాటిల్లిన కూరగాయలను తెంపక అలాగేఉంచడం వల్ల పండు ఈగ సమస్య ఇంకా జటిలం అవుతుంది. ఈగ నివారణ కొరకు లింగాకర్షణ ఎరను ఉపయోగించవచ్చు.
ఉపయోగించే విధానం:
- పండ్లు ఏర్పడే ప్రారంభ దశలో ‘ఫెరమోను’ బోనును ఉపయోగించాలి.
- భూమి నుండి 3-5 అడుగుల ఎత్తులో, నీడ ఉండే ప్రాంతంలో ఫెరమోను బోనును బిగించండి.
- సూచించిన విషపదార్థాన్ని ఫెరమోను బోనులో ఉన్న ప్రలోభపెట్టే చెక్కముక్కపై డిడివిపి (సువాన్) ఒక్కొక్క ముక్కపై ప్రతి 10 రోజులకు 2-3 చుక్కలను ఒకసారి వేయాలి.
- ఒక నెల తర్వాత ప్రలోభపెట్టే మరొక చెక్కముక్కను ఉంచాలి. ఇంకను పంట కొనసాగిన ఎడల మరొక ప్రలోభపెట్టే చెక్కను ఉంచాలి.
- ఫెరమోను బోను ఈగలచే నిండిన వెంటనే తీసి శుభ్రపరచాలి.
- ఒక ఎకరానికి 6 నుండి 8 వరకు ఫెరమోను బోనులను ఉపయోగించాలి.