వరిలో పురుగుల నియంత్రణ – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వరిపంటకు చీడ పురుగుల వల్ల చాలా నష్టం జరుగుతుంటుంది. పురుగుల వల్ల, పురుగుల ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల పంటలో సగ భాగం నష్టమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. రైతులు ప్రతి పంటకాలంలో పురుగుల నుంచి పంటను కాపాడుకోవడానికి పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది. పురుగుల గురించి, వాటి జీవిత చక్రాల గురించి రైతులకు తెలిసి ఉంటే, వారు పంటకు ముప్పు వాటిల్లక ముందే పురుగులను అరికట్టగల్గుతారు. ఈ రైతు పరిజ్ఞానానికి ఇప్పటికే రుజువైన కొన్ని సేంద్రియ పద్ధతులను జోడించినట్లయితే పురుగుల బెడదను బాగా తగ్గించవచ్చు.
చీడ పురుగుల నివారణకు ముందు జాగ్రత్తగా తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని పనులు
- లోతైన వేసవి దుక్కులు తప్పనిసరిగా చేపట్టాలి.
- వరి నాట్లు వేసేటప్పుడు ప్రతి 3 మీటర్లకు ఒక అడుగు వెడల్పులో కాలి బాటలు తూర్పు, పడమర దిశగా ఏర్పరచాలి.
- వరి నాటిన 20 రోజుల తరువాత జిగురు పూసిన పసుపు మరియు తెలుపు రంగు డబ్బాలు ఎకరానికి 15 నుండి 20 అమర్చుకోవాలి. పచ్చదోమ మరియు తామర పురుగులు డబ్బాలకు అతుక్కుంటాయి.
- డబ్బాలకు తప్పనిసరిగా జిగురు పూయాలి. జిగురు లేనట్లయితే పురుగులు వరిని నష్టపరుస్తాయి.
- వరి నాటిన వెంటనే ఎకరానికి 10 నుండి 15 పక్షి స్థావరాలను అమర్చాలి. వరి పొట్ట దశకు (60 రోజులు) రాగానే పక్షి స్థావరాలను తొలగించాలి.
సూక్ష్మపోషక లోపాల నివారణకు…
వరి నారుమడి మరియు ప్రధాన పొలంలో పోషకలోపాల నివారణకు (ఇనుము, జింకు, పొటాష్) పశువుల పేడ, మూత్రం మరియు ఇంగువ ద్రావణం తయారు చేసి పిచికారీ చేసుకోవాలి.
పురుగుల నివారణ:
రసం పీల్చు పురుగుల (పచ్చదోమ, తామర పురుగు, ఉల్లికోడు, వరినల్లి) నివారణ కొరకు నీమాస్త్రం లేదా ఎకరానికి 5% వేప కషాయం (5 కిలోల కాయ, పొడి, ఆకు 100 లీటర్ల నీటిలో) 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
కాండంతొలుచు పురుగు (తెల్లకంకి) నివారణకు ముందు జాగ్రత్త చర్యగా 5% వేప కషాయం లేదా అగ్నిఅస్త్రం 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పురుగు ఆశించిన తరువాత అగ్నిఅస్త్రం వుపయోగించాలి. కొడిస ఆకు ఎకరానికి 2 క్వింటాళ్ళు ముక్కలుగా చేసి ఆఖరి దుక్కిలో లేదా ప్రధాన పొలంలో వేసుకోవాలి.
ఆకుముడత పురుగు నివారణకు చిల్లకంపతో ముడిచిన ఆకులను విడదీసి 5% వేప కషాయం లేదా నీమాస్త్రం 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
సుడిదోమ నివారణకు వేపనూనె (ఎకరానికి 1-2 లీటర్లు) లేదా 5% వేప కషాయం లేదా నీమాస్త్రం 20 కిలోల ఇసుకలో కలిపి ప్రధాన పొలంలో ఉదయం (ఎండకాసే రోజులలో) చల్లుకోవాలి. ప్రధాన పొలంలో నీటిని పలుచగా (1/2 అంగుళం) ఉంచాలి.
కంపు నల్లి నివారణకు కంపునల్లినే ఉపయోగించాలి. ఉదయం పూట కంపునల్లులను సేకరించాలి. సుమారు 200-300 పురుగులను బాగా నూరి వడకట్టి 100 లీటర్ల నీటిలో (6 పంపులు) కలిపి పిచికారీ చేసుకోవాలి.
రెల్లరాల్చు పురుగుల నివారణకు పచ్చిమిర్చి-వెల్లుల్లి కషాయం లేదా ఎకరానికి 3 లీటర్లు బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటిలో కలిపి ఉపయోగించాలి.
నూలుకండె వరి ఈగ ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు చేస్తుంది. ఫలితంగా ఆకులు విరిగిపోతాయి. నివారణకు 5 శాతం వేపకషాయం లేదా నీమాస్త్రం వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
వరిని ఆశించే పురుగులు – యాజమాన్యం
కాండం తొలుచు పురుగు
దీని తల్లి పురుగులు పసుపు వర్ణం గల రెక్కలను కలిగి, వాటిపైన మధ్యలో నల్లని మచ్చను కలిగి ఉంటాయి. అవి ఆకుల చివరి భాగంలో 20-70 గుడ్లను సముదాయాలుగా పెట్టి వెంట్రుకలతో కప్పుతాయి. ఈ గుడ్ల నుంచి వారం రోజుల్లో పిల్లపురుగులు వెలువడి, మూడు రోజులలో కాండంలోకి చేరి లోపలి కణజాలాన్ని తినేస్తాయి. ఈ పురుగులు వరి పంటను నారుమడి నుంచి వెన్ను అభివృద్ధి చెందే దశ వరకు ఆశించి నష్టం కలుగజేస్తాయి. పిలకలు వేసే దశలో ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. దీనిని మొవ్వు కుళ్ళుగా పిలుస్తాం. ఈనిన తరువాత ఆశిస్తే వెన్నులోని గింజలన్నీ తాలుగింజలుగా మారి తెల్ల కంకులు ఏర్పడతాయి. దీనినే ‘ఊచపోటు’ అని అంటాం.
నివారణ :
- వేసవికాలంలో లోతుగా దుక్కి దున్నాలి. దీనివల్ల కొయ్య కాలలో ఉన్న నిద్రావస్థ లార్వాలను, కోశస్థదశ పురుగులను నివారించవచ్చు.
- దుక్కిలో పాలకొడిస వంటి ఆకులను తొక్కడం ద్వారా ఈ పురుగు రాకుండా నివారించుకోవచ్చు.
- ప్రధానపొలంలో నాటు వేసేటప్పుడు చిగుళ్ళు తుంచి నాటడం వలన పురుగు గుడ్లను నాశనం చేయవచ్చు.
- నేలకు దగ్గరగా కోత కోయడం వలన కోశస్థ దశలను నిర్మూలించవచ్చు.
- లింగాకర్షక బుట్టలను ఎకరానికి ఒకటి చొప్పున పొలంలో పెట్టడం ద్వారా పురుగుల ఉనికిని తెలుసుకోవచ్చు.
- పొలంలో రెక్కల పురుగులను కానీ, పురుగు గుడ్లను కానీ గమనించిన వెంటనే 5శాతం వేప కషాయాన్ని పిచికారి చేసి గుడ్లు పెట్టడాన్ని నివారించవచ్చు.
- పురుగు మందు వాడని పొలాల్లో రైతుమిత్ర పురుగులు ఎక్కువగా ఉండడం వలన ఈ పురుగు గుడ్డు దశపై ఆశించే ట్రైకోగ్రామా పరాన్న జీవి ద్వారా సహజ సస్యరక్షణ జరుగుతుంది. ఈ పరాన్నజీవులను పురుగు ఉధృతిని బట్టి ఎకరానికి 20,000 చొప్పున రెండు మూడు సార్లు పొలంలో వదలడం ద్వారా జీవనియంత్రణ సాధించవచ్చు.
- తట్టుకొనే రకాలు నాటుకోవడం : వికాస్, సస్యశ్రీ, రాశి, కావేరి, వర్ష, పోతన, స్వర్ణముఖి లాంటి రకాలు కాండం తొలుచు పురుగును తట్టుకుంటాయి.
Tag:పురుగుల నియంత్రణ