రైతు ఆదాయ మద్ధతు పథకాలకు హేతుబద్ధత – శాస్త్రీయత ఉండాలి – వడ్డే శోభనాద్రీశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 15వ తేదీ నుండి ప్రారంభం అయిన ”వై.ఎస్.ఆర్. రైతు భరోసా” పథకమునకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. సాగు భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతు కుటుంబానికి సంవత్సరానికి కేవలం రూ. 6,000/-లు, అవి కూడా మూడు విడతలుగా ఇచ్చే పి.ఎం. కిసాన్ సమ్మాన్ పథకం కేవలం రాజకీయ లబ్దికొరకు ప్రవేశపెట్టినదే తప్ప రైతు కష్టాన్ని, నష్టాన్ని గుర్తించి ఆదుకోవటానికి ఉద్దేశించినదిగా కనిపించదు. పి.ఎం. కిసాన్ సమ్మాన్ ద్వారా లభించు 6 వేల రూపాయలతో కలిపి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500/- రూపాయలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం అమలు మార్గదర్శక సూత్రాలు లోప భూయిష్టంగా ఉన్నాయి.
కనీసం 1 ఎకరాకు మించిన భూమిని కౌలు చేస్తేనే కౌలు రైతుకు ఈ పథకం వర్తిస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీ.సి. మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు మాత్రమే, ఒకే యజమానికి సంబంధించిన భూమిని ఒకరుకు మించి కౌలుదారులుంటే వారిలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొనబడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగులకు ఆదాయాన్ని బట్టి పథకం వర్తిస్తుందని తెలిపింది. మంత్రులు, ఎమ్మేల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇతర ప్రజా ప్రతినిధులకు, వ్యవస్థీకృత భూ యజమానులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేయబడింది.
వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయల ఆర్థిక సహాయం ఇన్‌ఫుట్ సబ్సిడీగా ఇస్తామని ప్రకటించడం జరిగింది. (ఇటీవల దీనిని (3,500 రూ||లుగా పెంచారు.) కానీ ఎన్నికల అనంతరం బహుశా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 6 వేల రూపాయలను కూడా జోడించితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక భారం తక్కువగా పడవచ్చనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది. మార్గదర్శకాల రూపకల్పనలో ”పి.ఎం. కిసాన్ సమ్మాన్” పథక మార్గదర్శకాలను యదాతధంగా ”వై.ఎస్.ఆర్. భరోసా” పథకంలో కూడా చేర్చడం జరిగింది. ”పి.ఎం. కిసాన్ సమ్మాన్” మార్గదర్శకాలలో క్లాస్-4 / గ్రూప్ -డి ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది.
”పి.ఎం. కిసాన్ సమ్మాన్” మరియు ”వై.ఎస్.ఆర్. రైతు భరోసా” పథకాలు రెండింటిలోనూ శాస్త్రీయత, హేతుబద్ధత లోపించాయి. మనదేశంలో వ్యవసాయ రంగంలో తీవ్రమైన సంక్షోభం దీర్ఘకాలంగా కొనసాగుతూ వుంది. ఏటా గిట్టుబాటుకాక లక్షలాది మంది రైతులు సాగు నుండి వైదొలుగుతూ వున్నారు. ఏటేటా వేలాది మంది రైతులు, అందులో కౌలు రైతులు అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకవైపు పెరిగిపోతూ వున్న సాగు
ఉత్పత్తి వ్యయమునకు అనుగుణంగా కనీస మద్ధతు ధరలు లేకపోవటం, ఆ ధరలు కూడా దక్కక అనేక పంటల పైన రైతులు ఏటా సుమారు రూ. 30,000 కోట్లకు పైగా నష్టపడుతున్నారనే అంచనాలు ఒకవైపున ఉండగా, మనదేశంలో వరి, గోధుమ, పత్తి, చెఱకు పంటలకు భారత ప్రభుత్వం, డబ్ల్యు.టి.ఓ. నిబంధనలను అతిక్రమించి హెచ్చు స్థాయిలో మద్ధతు ధరలను ప్రకటించుతూ వుందని అమెరికా, బ్రెజిల్ మరికొన్ని దేశాలు డబ్ల్యు.టి.ఓ.లో ఫిర్యాదులు చేసిన నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పంటల ధరలతో సంబంధం లేకుండా రైతులకు నేరుగా పలు అభివృద్ధి చెందిన దేశాలు అందిస్తూ వున్న విధంగా ఆర్థిక సహకారమును అందించాలనే నిర్ణయాన్ని తీసుకున్నది. ఆశయం మంచిదే అయినా అమలు పరిచే విధానంలో శాస్త్రీయత, హేతుబద్ధత లోపించాయి.
భూమి విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా కేవలం కుటుంబం ప్రాతిపదికగా తీసుకొనటం ఎంత మాత్రం సరికాదు. రైతుకు వున్న భూమి విస్తీర్ణత దామాషాలోనే నష్టం చేకూరుతూ వుంటుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో వుంచుకొని తెలంగాణా రాష్ట్రంలో టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఎకరాకు ఒక పంటకు తొలుత రూ. 4,000/-లు, ఇప్పుడు రూ. 5,000/-లు చొప్పున రైతుకు అందచేస్తూ వుంది. ఇక్కడ కూడా ప్రధానమైన లోపం ఏమంటే భూమిని వాస్తవంగా సాగుచేస్తూ వున్న భూయజమాని లేక కౌలు రైతుకే ఆ ఆర్థిక సహకారం అందించటం కాకుండా కేవలం పట్టాదారు పాసు పుస్తకం కలిగి వుండి, స్వయంగా వ్యవసాయం చేయక పోయినా, దూరంగా నగరాలలో వున్నా, చివరకున విదేశాలలో వున్న భూ యజమానులకు ”రైతు బంధు” ఆర్థిక సహకారం అందటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. మనదేశంలో ప్రస్తుతం 39.14 కోట్ల ఎకరాలలో రైతులు వివిధ పంటలను సాగుచేస్తూ వున్నారు. ఎకరాకు రూ. 4,000/-లు చొప్పున సహకారాన్ని అందించేందుకు 1,57,840 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు లక్షలాది కోట్ల రూపాయల రాయితీలను ప్రకటించుతూ వుంది. బడా పారిశ్రామిక వేత్తలు మరియు వ్యాపార వేత్తలకు చడీ, చప్పుడు లేకుండా లక్షలాది కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేస్తూ వుంటుంది. అటువంటిది మనదేశంలో స్థూల జాతీయ సంపద
ఉత్పత్తిలో 17 నుండి 18 శాతం సమకూరుస్తూ శ్రమజీవులలో సగం మందికి ఉపాధిని కల్పిస్తూ వున్న వ్యవసాయరంగం ఎదుర్కొంటూ వున్న సంక్షోభ నివారణకు, రేయనక – పగలనక, ఎండనక – వాననక, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొంటూ లాభదాయకం కాకపోయినా గత్యంతరం లేక మట్టిని పిసుకుతూ వున్న రైతులకు, కౌలు రైతులకు ఈ మేరకు ఆర్థిక సహకారం అందించవలసిన బాధ్యత ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పైన వుంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం పే కమీషన్ లెక్కల ప్రకారం మనదేశంలో ఒక కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000/-లు ఆదాయం వుండవలసి ఉంటుందని అంచనా వేసింది. ఆ సంస్థ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరిగాయి. సంఘటిత శక్తితో రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు కానీ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు కానీ తమ జీతభత్యాలను పెంచుకో గలుగుతున్నారు. మంత్రులు, ఎం.పి.లు, ఎమ్.ఎల్.ఎ.ల జీతభత్యాలు ఎన్నో రెట్లు పెరిగాయి. ప్రభుత్వ సర్వే ప్రకారమే మనదేశంలో రైతు కుటుంబం సగటు నెలసరి ఆదాయం రూ. 6,460/-లు మాత్రమే ఇందులో కొంత వ్యవసాయం నుండి వస్తూ వుండగా మరొకొంత పశుపోషణ, లేక కూలీ, నాలీ పని చేస్తే లభిస్తుంది.
ఈ వాస్తవాలను పరిగణనలో వుంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తీర్ణం ప్రాతిపదికగా ప్రతి రైతు / కౌలు రైతుల కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయమును అందించేలా ఇప్పటికే ప్రకటించిన పథకాలలో మార్పు చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది. అగ్రవర్ణాలలో స్వంతంగా భూమిలేని వారు కొద్దిగా స్వంత భూమి వున్నా, కౌలు చేసుకుంటే మరికొంత ఆదాయం రావచ్చనే ఆశతో లక్షలాది మంది అగ్రవర్ణ కౌలుదారులు వున్నారు. వారిని కూడా తప్పనిసరిగా పథకంలో చేర్చవలసిన ఆవశ్యకత వుంది. కొన్ని సందర్భాలలో ఒకే రైతు భూమిని ఒకరికి మించి కూడా కౌలు రైతులు సాగుచేస్తూ వుంటారు. వారిలో ఒక్కరికే ఇస్తామనటం న్యాయం కాదు. కౌలు రైతుకు స్వంత భూమి కొంత వుంటే అనర్హత వేటు సరికాదు. లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీ.సి. వర్గాలకు చెందిన కౌలు రైతులకు ఈ పథకం వలన సంపూర్ణమైన ప్రయోజనం చేకూరదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేస్తూ వున్నా, రిజర్వు బ్యాంకు ఆదేశిక సూత్రాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ అత్యధిక శాతం కౌలు రైతులకు బ్యాంకుల నుండి రుణాలు లభించుట లేదు. పంటల బీమా పథకం, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ఇన్పుట్ సబ్సిడీలు వారికి అందటం లేదన్నది నగ్నసత్యం. ఈ నేపధ్యంలో తెలంగాణాలో ”రైతు బంధు” పథకంలో వాస్తవ సాగుదారులను గుర్తించి వారికి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆర్థిక సహకారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
పైన వివరించిన అంశాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించిన రైతు ఆదాయ పథకాలలో తగు మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. రైతు కుటుంబం ప్రాతిపదికగా కాక, ఎకరాకు పంటకు రూ. 4,000/-లు చొప్పున అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరించి పథకాన్ని కొనసాగించినప్పుడే రైతు ఆదాయ మద్ధతు పథకం లక్ష్యం నెరవేరుతుంది. అలా చేసినపుడే వ్యవసాయం కొంత మేరకైనా గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
Tag:రైతు ఆదాయ మద్ధతు