రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ‘కిసాన్ మిత్ర’
ముందుకు సాగుతున్న ‘కిసాన్ మిత్ర’ (18001203244)
సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ 2017వ సంవత్సరం ఏప్రిల్ 14న వికారాబాద్ జిల్లాలో అప్పటి జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్ గారిచే ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రైతు ఆత్మహత్యలు నివారించడం. రైతు తమ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి ఏదైనా హెల్ప్‌లైన్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో ‘కిసాన్ మిత్ర’ ప్రారంభించడం జరిగింది. కారణాలు ఏవైనా అధికారులకు మరియు రైతులకు మధ్య దూరం పెరగడం వలన చాలా సమస్యలు గురించిన సమాచారం రైతుల వరకు చేరట్లేదు. మరియు రైతుల సమస్యలు అధికారుల దృష్టికి రావట్లేదు. కనుక కిసాన్ మిత్ర రైతుల నుండి అందుకున్న సమస్యలని వెంటనే సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించే వరకు రైతుకు తోడుగా వుంటుంది. కిసాన్ మిత్ర ద్వారా వికారాబాద్‌తో పాటు ఆదిలాబాద్ (ఫిబ్రవరి 7, 2018) మరియు మంచిర్యాల జిల్లాల (మార్చి 29, 2018) రైతులకి సేవలు అందుతున్నాయి.
ప్రస్తుతం ఖరీఫ్ పంట కాలం నడుస్తున్నందున కిసాన్ మిత్రకు ఎక్కువగా రెవెన్యూ, రైతుబంధు పెట్టుబడి సహాయం, పంట బీమా, పంట రుణాలు, రుణమాఫీ, సేంద్రీయ వ్యవసాయం గురించిన సమాచారం గురించిన ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు ఒక దానితో ఒకటి ముడిపడినందున రైతుల తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నారు. పట్టా పాసుబుక్కు రాకపోతే రైతుబంధు పెట్టుబడి సహాయం అందదు, అంతే కాక పంట ఋణం తీసుకునే సౌలభ్యం వుండదు అలాగే పంట బీమా చేసుకోలేరు. అన్నీ ఉండి పంటఋణం రెన్యువల్ చేయించుకోవాలంటే ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించింది కాబట్టి రెన్యువల్ చేసుకోవచ్చో లేదో అనే సందేహం. అదిలాబాద్ జిల్లాలో కౌలు రైతు గుర్తింపు కార్డులు గత సంవత్సరం జారీ చేసారు, ఈ సంవత్సరం తిరిగి వాటిని రెన్యువల్ చేసుకోవాలి. కానీ సర్క్యులర్ రాలేదనే కారణంతో తహసిల్దార్లు ఇప్పటి వరకు కొత్త కార్డులు జారీ చెయ్యలేదు మరియు ఉన్న వాటిని రెన్యువల్ చెయ్యట్లేదు, పత్తికి పంట బీమా చెల్లించే గడువు జూలై 15వ తేదీన ముగుస్తున్నందున కౌలు రైతులు మరియు పట్టా పాసుబుక్కు రాని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ కిసాన్ మిత్ర ఆయా జిల్లాల యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తోంది.
మంచిర్యాల జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం వైపు కిసాన్ మిత్ర అడుగులు
కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ప్రారంభించడానికి ముఖ్య కారణం తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు నివారించడం. రైతు ఆత్మహత్య చేసుకోవడానికి అనేక కారణాలు అనేక మంది విశ్లేషించారు. అందులో ఒక ముఖ్యమైన కారణం పంట మీద చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడడం. రైతు తన పంట పెట్టుబడి కోసం అవసరమైన రసాయనిక ఎరువులు మరియు పురుగుల మందులకు అప్పు చేయాల్సి వస్తోంది ఆ తర్వాత కరువు, వర్షపాతం లోటు భారీ వర్షాలు లేదా చీడ పీడల వలన అనుకున్న దిగుబడి రాక ఆ తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక పోతున్నారు. వీటి నుండి బయట పడడానికి రైతులకి ఉన్న ఒక మార్గం, రసాయనిక వ్యవసాయాన్ని వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపడం. సేంద్రియ వ్యవసాయ పద్దతిలో రైతు తనకు స్థానికంగా దొరికే వనరులను వుపయోగించడం వలన తన పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు అలాగే కొనుగోలుదారులు కూడా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ సేంద్రీయ ఉత్పాదకాలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపించడం వలన మార్కెట్లో వీటికి మంచి ధర కూడా లభిస్తోంది.
ఈ ప్రక్రియలోనే కిసాన్ మిత్ర పనిచేస్తున్న జిల్లాలో ఒకటి అయిన మంచిర్యాల జిల్లా పాలనాధికారి శ్రీమతి భారతి హోళికేరి గారు సేంద్రీయ వ్యయసాయం మీద చాలా మక్కువ చూపిస్తూ జిల్లాలో జరిగే ప్రతి మీటింగ్‌లో రైతులకు సేంద్రీయ వ్యవసాయం వైపుగా ప్రోత్సాహించడం గమనించి కిసాన్ మిత్ర, సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ) కలిసి రైతులకు మరియు అధికారులకు సేంద్రీయ వ్యవసాయంలో శిక్షణ ఇస్తాం అని ఒక ప్రతిపాదన కలెక్టర్ గారి ముందు పెట్టడం జరిగింది. అందుకు వెంటనే అంగీకరించిన కలెక్టర్ జిల్లా వ్యవసాయధికారితో కలిసి శిక్షణా తరగతులకు తేదీలు నిర్ణయించి, జిల్లాలో 750 మంది రైతులతో 1500 ఎకరాలలో ఈ సంవత్సరం సేంద్రీయ వ్యవసాయం చేయించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. మొదట జిల్లాలోని లక్సెట్టిపేట్, బెల్లంపల్లి మరియు చెన్నూర్ మండలాల్లో మే 17,18,19వ తేదీలలో రైతులకు అవగాహన సదస్సులు జరిగాయి. దీని కోసం సుస్థిర వ్యవసాయ కేంద్రం నుండి రాజశేఖర్, కన్నెగంటి రవి మరియు యాదవరెడ్డి హాజరయ్యి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత మే 25వ తేదీన మంచిర్యాలలో డా|| జి.వి. రామాంజనేయులు వ్యవసాయ, ఉద్యాన మరియు గ్రామీణాభివృద్ది శాఖ సిబ్బందికి సేంద్రియ వ్యవసాయం గురించి, తిరిగి వారి మండలాల్లోని రైతులకు శిక్షణ ఇచ్చే లాగా శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాలన్నింటిలో ముఖ్యంగా రసాయన వ్యవసాయం వలన కలిగే దుష్పరిణామాలు మరియు సేంద్రీయ వ్యవసాయం వలన కలిగే ఉపయోగాలతో పాటు, అందరినీ పి.జి.ఎస్. సర్టిఫికేషన్ క్రిందకు తీసుకు రావాలని,రైతులను సహకార సంఘాలుగా నిర్మాణం చేయాలని, రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని చర్చించడం జరిగింది. శిక్షణతో పాటుగా మనకు స్థానికంగా దొరికే వనరులతో సేంద్రీయ ఎరువులు, ద్రావణాలు మరియు కషాయాలు ఎలా చేసుకోవాలి అనే సమాచారాన్ని సుస్థిర వ్యవసాయ కేంద్రం తనకున్న అనుభవంతో వ్రాసిన ”స్థానిక వనరులతో సుస్థిర సేద్యం” అనే ఒక పుస్తకాన్ని జిల్లా యంత్రాంగానికి మరియు రైతులకు అందించడం జరిగింది.
ఈ క్రమంలో కిసాన్ మిత్ర రైతులకు విత్తనం దగ్గర నుండి మార్కెట్ వరకు అవసరమయ్యే సూచనలు మరియు సలహాలు ఇవ్వడానికి ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అందులో వారికి కావాల్సిన సమాచారం అందిస్తున్నాము. అలానే వివిధ పంటలకు సేంద్రీయ వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులను వివరంగా జిల్లా వ్యవసాయ శాఖకు సమాచారం పంపడం జరిగింది. దానితో పాటు రైతులు సహకార సంఘాలుగా ఏర్పడి తమకు అవసరమైన ఎరువులు, కషాయాలు, ద్రావణాలు ఉమ్మడిగా తయారు చేసుకునేలాగా ప్రోత్సహించడం జరుగుతోంది.