రైతుల భూమి సంబంధిత సమస్యల పరిష్కారమే రెవెన్యూ అధికారులకు నిజమైన రక్షణ
అబ్దుల్లాపూర్‌మెట్ తహసిల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిద్దాం
రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టి భూ సంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి
రెవెన్యూ శాఖకు తగినంత మంది సిబ్బంది, మౌలిక సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటు,
అవినీతి రహిత పాలనా పద్ధతులు కల్పించాలి.
శిక్షణ పొందిన ప్రత్యేక అధికారులతో రెవెన్యూ పరిపాలనను పునరుద్ధరించాలి.
నిరంతరం భూ రికార్డుల ప్రక్షాళన చేయాలి.
ప్రజానుకూల ”రెవెన్యూ కోడ్” కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడిగా డిమాండ్ చేద్దాం
రైతులకు, రెవెన్యూ సిబ్బందికి రైతు స్వరాజ్య వేదిక – తెలంగాణ రైతు జే.ఏ.సి పిలుపు
గ్రామీణ ప్రజలారా, రెవెన్యూ శాఖ ఉద్యోగులారా…
తెలంగాణా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు, రెవెన్యూ శాఖ ఉద్యోగులకు మధ్య ఒక అనారోగ్యకర వాతావరణం నెలకొని ఉంది. ఈ వాతావరణం నెలకొనడానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్య విధానాలు, ప్రకటనలు ప్రధాన కారణంగా పని చేస్తున్నాయి.
సుదీర్ఘ కాలంగా గ్రామీణ రైతులు, మరీ ముఖ్యంగా పేద, సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులు తమ భూమి రికార్డులను లేదా భూమి సంబంధిత ఇతర విషయాలను పరిష్కరించుకునే క్రమంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. నెలలు, సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితంగా తీవ్ర మానసిక క్షోభకు గురి కావడమే కాక, ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులు రైతులలో, రెవెన్యూ ఉద్యోగుల పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి.
ప్రధాన దోషి రాష్ట్ర ప్రభుత్వమే
గ్రామీణ ప్రజల, రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరంగా అనేక చర్యలు చేపట్టాల్సి వుంటుంది. జనాభా ప్రాతి పదికన, తగినంత మంది సిబ్బందిని నియమించ వలసి వుంటుంది. ఈ సిబ్బందికి చట్టాలపై, పరిపాలనా పద్ధతులపై, ప్రజలతో మెలగవలసిన తీరుపై సమగ్రమైన శిక్షణ ఇవ్వవలసి
ఉంటుంది. క్షేత్ర స్థాయిలో, మండల స్థాయిలో సిబ్బంది పని చేయడానికి అవసరమైన మౌళిక వసతులను (సరైన భవనం, ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఇతర పనిముట్లు) ఏర్పాటు చేయవలసి వుంటుంది. అవినీతికి ఆస్కారం లేని విధంగా టెక్నాలజీని తగిన స్థాయిలో ఉపయోగించుకోవలసి వుంటుంది. ప్రభుత్వపరంగా, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేలా జీవోలను, సర్క్యులర్లను క్రింది స్థాయి సిబ్బందికి, ప్రజలకు అర్థమయ్యేలా తెలుగు భాషలో విడుదల చేయాల్సి వుంటుంది.
మరీ ముఖ్యంగా భూ సంబంధిత వివాదాలు, సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నప్పుడు, వాటి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలను రాష్ట్ర స్థాయిలోనే చేపట్టవలసి వుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయాన్ని అందుకుని, పూర్తి స్థాయిలో, నిర్ధిష్ట కాల పరిమితిలో, సమగ్ర భూసర్వేను చేపట్టి పూర్తి చేయాల్సి వుంటుంది. భూ సరిహద్దులను, విస్తీర్ణాన్ని శాస్త్రీయంగా నిర్ధారించి, భూ యజమాన్య హక్కులను ‘సెటిల్’ చేయవలసి వుంటుంది. భూ వివాదాలను పరిష్కరించేందుకు, అన్ని స్థాయిలలో భూ వివాద పరిష్కార ట్రిబ్యునళ్ళను ఏర్పాటు చేయవలసి వుంటుంది. రాజకీయాలకు, పక్షపాతానికి, అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలనా పద్ధతులను అభివృద్ధి చేయవలసి వుంటుంది.
కానీ ఇవేవీ రాష్ట్ర ప్రభుత్వం గత 6 సంవత్సరాలలో చేయలేదు. సమగ్ర భూ సర్వే చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి చెప్పి, కొంత నిధుల సహాయం పొందినా, కేవలం భూ రికార్డుల ప్రక్షాళనకే పరిమితమైంది. అది కూడా తప్పుల తడకగా చేసింది. పార్ట్-బి పేరుతో వేలాది మంది రైతుల సమస్యలను పక్కకు నెట్టేశారు. సాదా బైనామా సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరించలేదు. రైతులకు, ఇతర శాఖలకు అత్యంత ఉపయోగకరంగా ఉండాల్సిన ‘ధరణి’ వెబ్సైట్ ఇంకా చీకట్లోనే మగ్గుతోంది. భూ పరిపాలనా శాఖకు (సి.సి.ఎల్.ఎ) పూర్తిస్థాయి కమీషనర్‌ను నియమించకుండా, ఇంఛార్జీలపై నడిపిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా నడిచిన ”భూ భారతి” ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. అత్యంత దుర్మార్గమైన మరో విషయం ఏమిటంటే, రెవెన్యూ శాఖలో జరుగుతున్న తప్పులన్నింటికీ రెవెన్యూ ఉద్యోగులే కారణమన్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, రెవెన్యూ ఉద్యోగులందరూ అవినీతి పరులన్నట్లుగా చేసిన ప్రచారం, ప్రభుత్వాన్ని సమర్థించే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ‘ధర్మగంట’ పేరుతో వచ్చిన కథనాలు, ప్రజల్లో రెవెన్యూ ఉద్యోగుల పనితీరు పట్ల ఉన్న అసంతృప్తిని మరింత పెంచాయి.
రెవెన్యూ శాఖలో నెలకొన్న అవినీతి
గ్రామస్థాయి నుండీ ఆర్డీవో స్థాయి వరకూ రెవెన్యూ శాఖలో కొందరు ప్రజలను లంచాల కోసం వేధిస్తున్నారు. చేతులు తడపనిదే ఏ పనీ చేయడం లేదు. కావాలని రెవెన్యూ రికార్డులలో తప్పులు సృష్టించడం, వాటిని పరిష్కరించే పేరిట డబ్బులు గుంజడం మామూలై పోయింది. రెవెన్యూ కార్యాలయాలకు నెలల కొద్దీ తిప్పుకోవడం, జనన, మరణ, కుల, ఆదాయ సర్టిఫికెట్లు కోరినా లంచం అడగడం, చివరికి రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల సభ్యుల నుండీ కూడా లంచం ఆశించడం కూడా గ్రామీణ ప్రజలలో ఈ శాఖ పట్ల ఒక వ్యతిరేక భావన ఏర్పడడానికి కారణమైంది. రెవెన్యూ శాఖలో కొంత మంది సిబ్బందే, ఇలా వ్యవహరించినా, వారి పట్ల మిగిలిన రెవెన్యూ సిబ్బంది, వారి యూనియన్లు, చివరికి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా ఉదాసీనంగా ఉండడం వల్ల, ఎప్పుడైనా కొందరు అవినీతి అధికారులపై చర్యలు తీసుకున్నా, యూనియన్లు అడ్డుపడి వారిని రక్షించడం వల్ల మొత్తం రెవెన్యూ శాఖే అవినీతిమయమనే భావన ప్రజలలో కలుగుతున్నది. ఈ ముద్రను పోగొట్టుకోవలసిన బాధ్యత మొత్తం రెవెన్యూ శాఖ సిబ్బందిపై వుంది. ఉద్యోగుల హక్కుల కోసం యూనియన్లు పోరాడడంతో పాటు ప్రజల పట్ల ఉద్యోగులు బాధ్యతగా ఉండి పనిచేయాలని తమ సభ్యులకు యూనియన్లు బోధించాలి.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు:
భూ రికార్డులలో తప్పుల వల్ల రైతులకు పంట రుణాలు, పంటల బీమా, రైతు బంధు, రైతు బీమా లాంటి మద్ధతు, ఇతర సబ్సిడీ పథకాలు అందడం లేదు. కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు అందడం లేదు. 1973 భూ గరిష్ట పరిమితి చట్టం అమలు కాక, భూమిలేని రైతులకు భూమి హక్కులు లభించడం లేదు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలు పరిష్కారం కాక, ఆదివాసీలకు, భూమి లేని పేదలకు హక్కులు లభించడం లేదు. రైతుల మధ్య సరిహద్దు తగదాల సమయంలో సర్వే త్వరగా పూర్తికాక, ఇరుపక్షాలూ నష్టపోతున్నాయి. మ్యూటేషన్ సకాలంలో పూర్తికాక, వారసులు, మహిళా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మహిళా రైతుల భూ రికార్డులను ప్రత్యేకంగా నిర్వహించడం, హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలకు కూడా ఆస్తి హక్కులు కల్పించడం లాంటి విషయాలలో రెవెన్యూ సిబ్బంది చొరవ చూపించడం లేదు.
ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు చైతన్యంతో ఐక్యంగా పోరాడాలి. రెవెన్యూ సిబ్బందిపై భౌతిక దాడులు, చంపడం లాంటి ఘటనలు రైతుల రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడకపోగా, రైతులు ఆఫీసులకు వెళ్ళి రెవెన్యూ అధికారులను కలవడానికి కూడా, ఆంక్షలను ఎదుర్కొనే అవకాశం వుంది. రియల్ ఎస్టేట్ మాఫియా, రెవెన్యూ అధికారులకు లంచమిచ్చి, భయపెట్టి పనులు చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నది. కానీ పేద ప్రజలు ఆ మార్గంలో పోకుండా, సంఘటిత శక్తితో, చైతన్యంతో సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.
రైతులకు, గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి
- రెవెన్యూ చట్టాలపై, భూ సంబంధ విషయాలపై మరింత అవగాహన పెంచుకుందాం.
- సమస్యలను చైతన్యంతో, ఐక్యంగా ఉండి పరిష్కరించుకుందాం.
- లంచం అడిగే అధికారులపై అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదు చేద్దాం. శిక్షపడేలా చూద్దాం.
- పొలం గట్ల మధ్య సరిహద్దు తగాదాలను ఊరి ప్రజల మధ్య సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం.
రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి విజ్ఞప్తి
- రైతుల పట్ల, గ్రామీణ ప్రజల పట్ల గౌరవంతో, మానవత్వంతో వ్యవహరించండి.
- రైతులను, గ్రామీణ ప్రజలను లంచాల కోసం పీడించే మీ సహచరులను మీరే కట్టడి చేయండి.
- మీ పరిధిలో ఉన్న సమస్యలను, సకాలంలో, న్యాయంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి.
- ప్రజానుకూలమైన ‘రెవెన్యూకోడ్’ కోసం రైతులతో కలసి ప్రభుత్వంపై పోరాడండి.
- రాష్ట్ర ప్రభుత్వం ముందు మా డిమాండ్లు
- గ్రామీణ జనాభా ప్రాతిపదికన రెవెన్యూ శాఖలో అధికారులను, సిబ్బందిని, గ్రామ పంచాయితీ స్థాయిలో వి.ఆర్.ఓ.లను, సర్వేయర్లను నియమించాలి. మౌలిక సౌకర్యాలు కల్పించాలి. రెవెన్యూశాఖను ప్రైవేటీకరించే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. వివిధ శాఖల మధ్య పని విభజన చేసినా అది మరింత వివాదాలను లేవనెత్తకుండా చూడాలి.
- సమగ్రమైన, ప్రజానుకూలమైన ‘రెవెన్యూకోడ్’ను రూపొందించాలి.
- రాష్ట్రంలో సమగ్ర భూసర్వే పూర్తి చేసి, భూ సంబంధ అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలి. రైతులకు, గ్రామీణ ప్రజలకు హక్కులు కల్పిస్తూ, ‘సిటిజన్స్ ఛార్టర్’ రూపొందించాలి. నిర్ధిష్ట కాలపరిమితిలో సమస్యలు పరిష్కరించేలా నిరంతర పర్యవేక్షణ, సమీక్ష చేయాలి.
- రెవెన్యూ శాఖపై ప్రభుత్వం దుష్ప్రచారం ఆపి, ప్రజలకు, రెవెన్యూ సిబ్బందికి మధ్య సామరస్యపూర్వక సంబంధాలు ఏర్పడేలా కృషి చేయాలి. రెవెన్యూ సిబ్బందిని కలవడానికి, ప్రజలపై పెడుతున్న అన్ని రకాల ఆంక్షలను తొలగించాలి.