పందిరి జాతి కూరగాయలలో సస్యరక్షణ – సుస్థిర వ్యవసాయ కేంద్రం
సొర, బీర, కాకర, పొట్ల, దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి, దొండ మరియు చిక్కుడు
పురుగులు: గుమ్మడి పెంకు పురుగు నివారణ :
తల్లి పురుగులు లేత ఆకులను ఆశించి ఎక్కువ నష్టం పంటకు కలిగిస్తాయి. వీటి నివారణకు వేప కషాయం లేదా నీమాస్త్రం రెండుసార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
పండు ఈగ (ఫ్రూట్ ఫ్లై):
తల్లి ఈగలు మొగ్గలపై మరియు లేత పిందెలపై గ్రుడ్లు పెడతాయి. వీటి నుండి వచ్చిన సన్నని పురుగులు కాయ లోపలి గుజ్జును తిని నష్ట పరుస్తాయి. అందువలన కాయలు కుళ్ళిపోతాయి. వీటి నివారణకు మొగ్గ సమయంలో రెండు సార్లు వేప కషాయం లేదా నీమాస్త్రం 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. మొక్క మొదళ్ళలో వేప పిండి పాదుకు 5 కిలోల చొప్పున వేయాలి. తల్లి ఈగలను ఆకర్షించేందుకు మిథైల్ యూజినాల్ ఎరలను పొలంలో అమర్చాలి. ఇవి తల్లి ఈగలను ఎక్కువగా ఆకర్షిస్తాయి.
పాము పొడ పురుగు (పాము పొడ తెగులు) :
ఈ పురుగు గొంగళి పురుగులు చాలా సన్నగా ఉండి ఆకు పొరలలో చొచ్చుకొనిపోయి పత్రహరితాన్ని తిని నష్టపరుస్తాయి. ఆకులపై అడ్డదిడ్డంగా తెల్లని చారలు ఏర్పడతాయి. ఒక్కోసారి ఈ పురుగు వల్ల పంటకు నష్టం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు పంట పెరుగుదల దశలో రెండు సార్లు 5 శాతం వేప గింజల కషాయాన్ని లేదా రెండు శాతం వేప నూనెను 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. పురుగు నష్టం చేసిన ఆకులను ఎప్పటికప్పుడు పంటనుండి తొలగించి నాశనం చేయాలి.
తెగుళ్ళ నివారణ : బూజు తెగులు:
ఆకు అడుగు భాగంలో బూజు మాదిరిగా ఏర్పడి, ఆకుల పై భాగాన పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పండి ఎండిపోతాయి. దీని నివారణకు పులిసిన మజ్జిగ + ఇంగువ ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి.
బూడిద తెగులు:
ఆకు పై భాగంలో తెల్లని పొడిలాగా ఏర్పడి, ఆకులు పసుపు రంగుకు మారతాయి. ఉధృతి ఎక్కువైతే బూడిద తెగులు కాండం పూతకు కూడా వ్యాపిస్తుంది. దీని నివారణకు పంట పెరుగుదల దశలో రెండు సార్లు 5 శాతం వేప గింజల కషాయాన్ని లేదా రెండు శాతం వేప నూనెను 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. తెగులు నష్టం చేసిన ఆకులను ఎప్పటికప్పుడు పంటనుండి తొలగించి నాశనం చేయాలి.
ఆకుమచ్చ తెగులు:
ఆకులపైన చిన్నని గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఈ మచ్చలు పెద్దవిగా మారి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. ఒక్కోసారి ఈ మచ్చలు కాయలకు ఆశించి నష్టం కలుగజేస్తాయి. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి.
వెర్రి తెగులు (వైరస్ తెగులు):
ఆకులలో ఈనెల వద్ద పసుపురంగు చారలు ఏర్పడతాయి. దీనినే ”మొజాయిక్” తెగులు అని కూడా అంటారు. వైరస్ తెగుళ్ళ వ్యాప్తి రసం పీల్చు పురుగుల ద్వారా వ్యాపిస్తుంది.
నివారణ:
- విత్తనాలను పచ్చి ఆవుపాలలో (ఒక లీటరు ఆవు పాలు + 250 గ్రాముల విత్తనాలు) 15 -20 నిమిషాలు ఉంచి విత్తన శుద్ధి చేయాలి.
- రసం పీల్చే పురుగులను 5 శాతం వేప కషాయం లేదా 5 శాతం వావిలాకు కషాయం లేదా నీమాస్త్రం పంటపై రెండు సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసి సమర్ధవంతంగా అరికట్టాలి.
- 5 శాతం ఆవుపాలు (5 లీటర్ల పచ్చి ఆవు పాలు + 100 లీటర్ల నీరు) పంటపై రెండు సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
- వైరస్ తెగులు ఆశించిన మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి పీకి వేసి నాశనం చేయాలి.
- వైరస్ తెగులు సోకని మొక్కల నుండి రైతులు విత్తనాలను సేకరించుకోవాలి.
Tag:కాకర, గుమ్మడి, దొండ చిక్కుడు, దోస, పందిరి జాతి, పొట్ల, బీర, బూడిద గుమ్మడి, సొర