జీడి మామిడిలో ఎరువుల యాజమాన్యం, అంతర పంటలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
- జీడిమామిడిలో ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైన అంశమే.
- జీడిమామిడి మొక్కలు ఆరోగ్యంగా, దృఢంగా పెరిగి త్వరగా కాపుకు వచ్చి, మంచి దిగుబడి ఇవ్వటానికి లేత తోటలకు మరియు పెద్ద తోటలనుండి క్రమం తప్పకుండా దిగుబడులు పొందటానికి, సేంద్రియ ఎరువులు వాడటం ఎంతో అవసరం.
- నాటిన మొదటి సంవత్సరం నుండి జీడిమామిడి చెట్లకు నాణ్యమైన సేంద్రియ ఎరువును అందించడం ద్వారా నాణ్యమైన జీడిమామిడిని ఉత్పత్తి చెయ్యవచ్చు.
- వానాకాలంలో రెండు సార్లు తోటంతా దున్నటం వలన కలుపు మొక్కలను అదుపులో ఉంచవచ్చు.
- నేల గుల్లగా అగుట వలన వర్షాకాలంలో వాననీరు ఇంకుటకు వీలవుతుంది.
- మొదటి 5 సంవత్సరాల వరకు కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే పైర్లు, ఫాల్సా, బొప్పాయిలాంటి పండ్లతోటలను అంతర పంటగా వేయవచ్చు.
- అంతర పంటలు సాగు చేయటం వలన నేల సత్తువ బాగా అభివృద్ధి చెందుతుంది. కలుపు నివారణ కూడా అవుతుంది. రైతుకు ఆదాయం కూడా వస్తుంది.
- తేలిక పాటి భూములలో తగినంత చెఱువు మట్టిని 10-15 ట్రాక్టర్ లోడులు (సుమారు 50 టన్నులు) కనీసం 2 సంవత్సరముల కొకసారి వేయాలి.
- సేంద్రియ ఎరువులను (కంపోస్టు, నాడెప్ కంపోస్టు, వర్మీకంపోస్టు మొ||) చెట్టుకు వయస్సును బట్టి 5-10 కిలోలు వేయాలి.
- సేంద్రియ ఎరువును సంవత్సరానికి 2 సార్లు – జూన్ – జులై మరియు సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో వేసుకోవాలి.
- కోతకు వచ్చిన తోటలలో వర్షాకాలంలో నేలలో తేమ చూసి జూలై – ఆగస్టు నెలలలో కంపోస్టు వేసుకోవాలి.
- లేత తోటలలో చెట్ల మధ్య గల ఖాళీ స్థలంలో జీలుగ, జనుము లాంటి పచ్చిరొట్ట పైర్లను వర్షాలు పడిన వెంటనే ఎకరాకు 10-15 కిలోల వంతున విత్తుకొని, పూత దశ రాగానే భూమిలో కలియదున్నాలి.
- కలియ దున్నడం వల్ల భూమికి సేంద్రియ పదార్థం, సూక్ష్మ పోషకాలు అందుతాయి. వానపాములు, సూక్ష్మజీవులు భూమిలో బాగా పెంపొందుతాయి.
- పొలంలోని ఎండు ఆకులను, వరిగడ్డిని జీడిమామిడి చెట్ల మొదళ్ళలో వేయటం వల్ల మొక్కలకు ఆచ్ఛాదన (మల్చింగ్) ఏర్పడి, వేసవి కాలంలో భూమిలోని తేమ ఆవిరి అవకుండా కాపాడుతుంది.
- క్రమంగా ఈ ఎండు గడ్డి, ఎండు ఆకులు మంచి సేంద్రియ ఎరువుగా మారి నేలకు అందుతాయి. నేల గుల్లబారుతుంది. వేసవిలో చెట్లు ఎండిపోవు.
- మంచి పూత, కాత కాస్తుంది. కాబట్టి తోటలలో మల్చింగ్ చేయడం చాలా అవసరం.
అంతర పంటలు:
జీడిమామిడి నాటిన 2-3 సంవత్సరాలలో చెట్ల మధ్య గల స్థలంలో అంతర పంటలుగా వివిధ కూరగాయలు, పొగాకు, వరి, మిరప నార్లను లాభసాటిగా పెంచవచ్చు. పప్పు దినుసు పంటలను అంతర పంటలుగా పెంచటం వల్ల ఆర్థికంగా లాభం పొందటమే కాకుండా, భూసారం వృద్ధిచెంది, జీడిమామిడి మొక్కలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.
తోటలలో మధ్య ఖాళీ స్థలాన్ని దున్నడం వలన నేల గుల్లబారి, గాలి బాగా ప్రసరించి వేర్లు బాగా పెరుగుతాయి. కలుపు మొక్కలను అరికట్టవచ్చు. అదే విధంగా నేలలో వుండే పురుగులు నిద్రావస్థ దశలోనే చనిపోతాయి. కాపుకు వచ్చిన తోటలలో వర్షాలకు ఒకసారి దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి నేల కోతను కొంత వరకు అరికడుతుంది.