చట్టాలు, జీవోలు అమలు కాకపోతే – కె. రవి
వ్యవసాయ కుటుంబాల ఆదాయాలు ఎలా పెరుగుతాయి…?
సమాజ అభివృద్ధి అంటే, సమాజంలో వున్న అన్ని కుటుంబాల జీవన ప్రమాణాల అభివృద్ధి అని అర్థం చేసుకోవాలి. అంతే కానీ కేవలం రాష్ట్ర, జిల్లా స్థాయి స్థూల అభివృద్ధి (జీడీపీ) పెరగడమే, రాష్ట్ర అభివృద్ధిగా పరిగణిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. రాష్ట్రంలో సంపద పెరగొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగొచ్చు. కొంతమంది ఆదాయం వందలరెట్లు పెరగొచ్చు. ప్రస్తుతమున్న నిర్దిష్ట నిర్వచనం ప్రకారం తలసరి ఆదాయాలు కూడా పెరిగినట్లు కనిపించవచ్చు. కానీ వాస్తవ పరిస్థితిలో ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయి? ముఖ్యంగా మొత్తం సమాజంలో 70 శాతంగా ఉన్న గ్రామీణ ప్రజల, ఆదివాసీ ప్రజల, అసంఘటితరంగ శ్రామికుల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయి? అనేది మొత్తం ”అభివృద్ధి” చర్చకు ప్రాతిపదిక కావాలి. అలాగే సహజ వనరుల (భూమి, నీటి వనరులు, అడవులు, ఖనిజ సంపద) సద్వినియోగం, పర్యావరణ పరిరక్షణ (విష పూరితం కాని గాలి, నీరు, సాగు భూమి), మానవ వనరుల వినియోగం
(ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం) కూడా ఈ చర్చకు ప్రధాన భూమిక కావాలి.
కుటుంబాల, లేదా వ్యక్తుల జీవన ప్రమాణాల మెరుగుదలకు, ఆయా కుటుంబాల లేదా వ్యక్తుల ఆర్ధిక ఆదాయాల పెరుగుదల ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది. ఈ ఆదాయాల పెరుగుదల – సహజ వనరులపై, జీవనోపాధిలపై ఆయా సమాజ సమూహాలకు, వ్యక్తులకు ఏ మేరకు హక్కు ఉంది, వనరుల వినియోగానికి ఏ మేరకు అవకాశం ఉంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది సహజ వనరులపై, అవకాశాల వినియోగంపై హక్కు కోసం ప్రజా సమూహాలు, వర్గాలు నిరంతర పోరాటాలు సాగిస్తుంటాయి. ఈ పోరాటాలు కొన్ని సందర్భాలలో సాయుధ పోరాటాల రూపం తీసుకున్నా, కొన్ని సార్లు ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రజా ఉద్యమాల రూపం తీసుకున్నా అంతిమ సారాంశంలో అవి వనరులపై హక్కు కోసం సాగిన పోరాటాలే. అలా తెలంగాణ రాష్ట్రం పరిధిలో 1940 దశకంలో తెలంగాణ సాయుధ పోరాటం ‘దున్నేవానికి భూమి హక్కు కావాలి’ అనే నినాదంతో సాగింది. గత 50 సంవత్సరాలుగా సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా ”నీళ్లు, నిధులు, నియామకాలు ”నినాదంతోనే సాగింది. ఈ ఉద్యమాలు తెలంగాణ ప్రజలకు, మొత్తం భారత దేశానికి కూడా విలువైన విజయాలను, ఫలితాలను అందించాయి. దేశ వ్యాపితంగా పేద ప్రజలు సాగించిన ఇటువంటి ఉద్యమాల ఫలితంగానే అనేక చట్టాలు, ప్రభుత్వ ఆదేశాలు (జీవోలు) వచ్చాయి. ఈ చట్టాలకు, జీవోలకు అనుగుణంగా అనేక మార్గదర్శకాలు కూడా అమలులోకి వచ్చాయి. కానీ, అసలు సమస్య-ప్రభుత్వాలు ఆయా చట్టాలను, జీవోలను వాటి స్పూర్తితో అమలు చేయకపోవడం.
తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక చట్టాలు, జీవోలు ఇలాగే అమలుకు నోచుకోకుండా ఉండిపోతున్నాయి. అమలు అయిన చోట కూడా, అరకొరగా అమలవుతున్నాయి. ఈ చట్టాలను సంపూర్ణ స్పూర్తితో అమలు చేయకపోతే, సమాజంలో అట్టడుగున వున్న వర్గాలకు హక్కులు దక్కవు. ఆదాయాలు పెరగవు. రాష్ట్ర స్థూల ఆర్ధిక వృద్ధి జరిగినా, మెజారిటీ ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం పెరగవు. రాష్ట్రంలో 1956 తెలంగాణ కౌలు రైతుల చట్టం, 1973 భూ గరిష్ట పరిమితి చట్టం, 2005 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2011 అధీకృత సాగుదారుల (కౌలు రైతుల) చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం, 2013 భూసేకరణ చట్టం, 2016 వ్యవసాయదారుల రుణ విముక్తి చట్టాల అమలుతీరు దారుణంగా ఉంది. అలాగే భూమిలేని దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందించేందుకు 2014 జులై 26న వచ్చిన జీవో. నంబర్ 1, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన జీవో 194 కూడా అమలు కావడం లేదు. లక్షలాది మంది అసంఘటిత కార్మికులకు ప్రయోజనకరమైన అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు పని తీరు కూడా నాసి రకంగా ఉంది.
ఈ చట్టాలను, జీవోలను అమలు చేయడానికి పూనుకోని ప్రభుత్వం, తన కవసరం అయినప్పుడు మాత్రం కొత్త చట్టాలను, జీవోలను వేగంగా తెచ్చి అమలు చేయడానికి పూనుకుంది. ముఖ్యంగా ప్రాజెక్టుల పేరిట భూములను సేకరించడానికి, 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ 2016లో తెచ్చిన ప్రత్యేక భూసేకరణ చట్టం, జీవో 123, మరియు 73వ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయితీలకు ఇచ్చిన హక్కులకు తూట్లు పొడుస్తూ, ఎటువంటి చట్టబద్ధతా లేని రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ 2017 సెప్టెంబర్ 9న తెచ్చిన జీవో నంబర్ 39 ఈ కోవకు చెందుతాయి.
1973లో వచ్చిన భూ గరిష్ట పరిమిత చట్టం నిజంగా అమలు జరిగి ఉంటే ఈ రాష్ట్రంలో భూసంస్కరణలు దేశానికి ఆదర్శంగా ఉండేవి. కానీ ఈ చట్టానికి మొదటి దశలోనే వివిధ మినహాయింపులతో తూట్లు పొడిచారు. దానితో మిగులు భూమి ఎక్కువ తేలలేదు. తేలిన మిగులు భూమి కూడా కోర్ట్ వివాదాలలో చిక్కుకుంది. పేదలకు పంచిన కొద్ది పాటి భూమి కూడా, సాగు యోగ్యం కాకుండా వుండింది. 1980 దశకం తర్వాత భూ సంస్కరణలు బూతు మాటగా మారాయి. భూ పోరాటాలు కూడా తగ్గు ముఖం పట్టాయి. ఇవాళ వందలాది ఎకరాలు కలిగిన పెద్ద జమీందారులు మన కళ్ళ ముందే తిరుగుతున్నారు. భూ గరిష్ట పరిమితి చట్టం అమలు గురించి అడిగే నాథుడే లేడు .మాగాణి భూమి 18 ఎకరాల కంటే ఎక్కువ, మెట్టభూమి 54 ఎకరాల కంటే ఎక్కువ ఒక కుటుంబానికి (5 గురు సభ్యుల) ఉండకూడదని చట్టం చెబుతున్నా, అది అమలవుతుందా లేదా అని పట్టించుకునే వాళ్ళు లేరు. పేదలకు భూమి పంచండి అని రైతు సంఘాలు అడిగినా ”భూమి ఎక్కడ ఉంది” అనే ప్రశ్న ప్రభుత్వాల నుండి వినపడుతుంది. సమగ్ర భూసర్వే చేసి, భూ సంస్కరణల చట్టం (గరిష్ట పరిమితి) ప్రకారం మిగులు భూమి తేల్చితే, పేద గ్రామీణులకు పంచడానికి భూమి బయటకు వస్తుంది.
తెలంగాణ గ్రామీణ సమాజంలో అట్టడుగున ఉన్న 50 శాతం జనాభాకు సెంటు భూమి దక్కలేదని 2011 సామజిక, ఆర్ధిక కుల గణన (ఎస్.ఇ.సి.సి.) సర్వే తేల్చి చెప్పింది. గత 15 సంవత్సరాలలో అరకొరగా పేదలకు భూ పంపిణీ జరిగినప్పటికీ 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రామీణ ప్రాంతంలో 3 లక్షల దళిత కుటుంబాలకు భూమిలేదని, ఈ కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున 9 లక్షల ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 2014 ఆగష్టు 15 నుండీ, ఇప్పటి వరకూ కేవలం 5,185 మందికి 13,190. 23 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసి ఇచ్చింది. గత సంవత్సర కాలంగా పూర్తిగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ విషయాన్ని పూర్తిగా మాట్లాడటం మానేసింది. భూ పంపిణీ జరగని కారణంగానే రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్నది.
రాష్ట్రంలో 13 శాతం మంది కౌలు రైతు ఉన్నారని నీతీ ఆయోగ్ ప్రకటించినా, 10 లక్షలకు మించి కౌలు రైతులు ఉంటారని అనేక ప్రభుత్వ నివేదికలు నిర్ధారించినా, కౌలు రైతులను గుర్తించే 2011 అధీకృత సాగుదారుల చట్టం అమలు కావడం లేదు. కౌలు రైతులకు, బ్యాంకు రుణాలు, రైతుబంధు లాంటి పథకాలు అమలు కావడం లేదు. సెంటు భూమి లేని కౌలు రైతులు రైతు బీమాకు కూడా అర్హత సాధించలేకపోతున్నారు. చట్టం వచ్చిన తోలి దశలో 44,000 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చినా ,తెరాస ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని అమలుచేయడం లేదు. కౌలు రైతులు తమ ప్రాధాన్యతే కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నారు. కౌలు రైతులకు కూడా తాకట్టు లేని పంట రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకు ఎన్ని సర్క్యూలర్లు జరీచేసినా బ్యాంకులు అమలు చేయవు. దీనితో కౌలు రైతు కుటుంబాల ఆదాయాలు పెరగడం లేదు. కౌలు ధరలపై నియంత్రణ లేకపోవడం వల్ల, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
గ్రామీణ కుటుంబాలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే మరో చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతంలో పని కోరుకున్న ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల పని కల్పించాలి. కరువు కారణంగా వలసలను నివారించి, గ్రామంలోనే ఆదాయాలు కల్పిచే లక్ష్యం ఈ చట్టానికి ఉంది.
కానీ తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండీ ఈ చట్టం అమలుతీరు ఘోరంగా ఉంది. 2019 మార్చ్ నాటికి ఈ రాష్ట్రంలో 53 లక్షల 95 వేల కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేయగా, ఇందులో 32 లక్షల 18 వేల జాబ్ కార్డులు మాత్రమే ఆక్టివ్‌గా ఉన్నాయి. ఈ జాబ్ కార్డుల ఆధారంగా మొత్తం 1 కోటీ 16 లక్షల 46 వేల మంది పని కోసం నమోదు చేసుకోగా, 2019 మార్చ్ నాటికి ఆక్టివ్‌గా వున్న శ్రామికులు 58 లక్షల 98 వేల మంది మాత్రమే. జాబ్ కార్డులు పొందిన కుటుంబాలలో 2018-2019 సంవత్సరంలో కేవలం 24 లక్షల 22 వేల కుటుంబాలకు మాత్రమే పని కల్పించారు. ఈ కుటుంబాల నుండి పనిలో పాల్గ్గొన్న శ్రామికులు 40 లక్షల 68 వేల మంది మాత్రమే. చాలా సందర్భాలలో శ్రామికులు పని కోరుకున్నా, పనులు కల్పించడం లేదు. అనేక సార్లు ఈ పధకం క్రింద పనికి వెళితే నెలలు గడిచినా వేతనాలు రాకపోవడం వల్ల శ్రామికులు కూడా ఆసక్తి చూపించడం లేదు. విచిత్రమేమిటంటే మొత్తం జాబ్ కార్డులు పొందిన యాక్టీవ్ కుటుంబాలలో 100 రోజులు పూర్తిగా పని దొరికిన కుటుంబాలు కేవలం 1 లక్షా 53 వేల 823 మాత్రమే. 205 రూపాయలు ఉపాధిహామీ రోజు వేతనంగా నిర్ణయించినా, 2018-2019లో పడిన సగటు రోజు కూలీ 146.61 రూపాయలు మాత్రమే. చట్టం ప్రకారం నిజంగా జాబ్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికీ 100 రోజుల పని కల్పించగలిగితే, ఆయా కుటుంబాలకు కనీసం 15,000 రూపాయలు సంపాదించుకోగలిగేవి. కానీ ఒక కుటుంబానికి సగటున 43 రోజుల పని దినాలు మాత్రమే కల్పించారు. వర్షాధార ప్రాంతాలలో ఈ చట్టం క్రింద దొరుకుతున్న పని, వస్తున్న ఆదాయం కూడా గ్రామీణ పేద కుటుంబాలకు అత్యంత ముఖ్యమైనవి.
ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి అటవీ హక్కుల చట్టం అమలు తీరు కూడా సరిగా లేకపోవడం వల్ల ఆదివాసీ కుటుంబాల వ్యవసాయానికి సరైన మద్ధతు అందడంలేదు. పోడు వ్యవసాయదారులుగానే వాళ్ళను చూడడం వల్ల, పంట రుణాలు, రైతుబంధు, రైతు బీమా అమలు కావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 2018 నవంబర్ 30 నాటి నివేదిక ప్రకారం 1,86,679 దరఖాస్తులు అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలు పెట్టారు. అందులో 1,83,252 దరఖాస్తులు వ్యక్తిగత భూ హక్కుల కోసం, మరియు 3,427 దరఖాస్తులు అడవిపై సముదాయక హక్కుల కోసం పెట్టినవి. ఇందులో కేవలం 94,360 దరఖాస్తులను మాత్రమే (93,639 వ్యక్తిగత మరియు 721 సాముదాయక) ఆమోదించారు. మరో 83,757 దరఖాస్తులను తిరస్కరించారు (44 శాతం). చట్టం ప్రకారం హక్కులు కల్పించిన అటవీ భూమి కేవలం 7,54,339 ఎకరాలు మాత్రమే. ఎందుకు తమ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయో ఆదివాసీ కుటుంబాలకు తెలవదు. ఈ హక్కులు కల్పించక పోవడం వల్ల ప్రభుత్వం నుండి ఈ కుటుంబాలకు వ్యవసాయ పరంగా అందాల్సిన ఏ సహాయమూ అందడంలేదు.
2016లో వ్యవసాయదారుల రుణవిముక్తి చట్టం చేసినా, ఆ చట్టం ప్రకారం పని చేయడానికి కమీషన్‌కు ఇంతవరకూ సరైన వసతి, ఫర్నిచర్ కూడా కల్పించలేదు. ఈ కమీషన్ గురించి వ్యవసాయ దారులలో ప్రచారం కూడా కల్పించలేదు. ప్రైవేట్ అప్పుల ఊబిలో రైతులు కూరుకు పోతున్నారు. బ్యాంకు రుణాలు కూడా తీర్చలేకపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. రైతులకు అందాల్సిన మద్ధతు ధరలు అందకపోవడం వల్ల రైతుల ఆదాయాలు పెరగడంలేదు.
వ్యవసాయ కుటుంబాల సంక్షోభం కారణంగా ఈ రాష్ట్రం ఏర్పడినాక ఇప్పటి వరకూ 3,850 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క ప్రకారం రిపోర్ట్ అయినవి కేవలం 2066 మాత్రమే. ఇందులో కూడా ప్రభుత్వం ”న్యాయమైన ఆత్మహత్యలుగా ”గుర్తించినవి 1,149 మాత్రమే. వీటిలో 846 కుటుంబాలకు 194 జీవో ప్రకారం 6 లక్షల చొప్పున పరిహారం చెల్లించడానికి ఆమోదం తెలిపారు. కానీ, విషాదమేమిటంటే ఇప్పటికీ ప్రభుత్వం ఆమోదించిన 500 బాధిత కుటుంబాలాకు నిధులు విడుదల చేయలేదు. లక్షల కోట్ల ఆదాయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని చెప్పే ప్రభుత్వానికి ఈ 500 కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి 30 కోట్ల రూపాయలు లేవా…?
అమలు కాని జీవోలు, చట్టాల వల్ల గ్రామీణ వ్యవసాయ దారులు, ఎంతగా నష్టపోతున్నారో, ఎంతగా మానసిక క్షోభకు గురవుతున్నారో ఈ ప్రభుత్వానికి ఎప్పటికైనా అర్థమవుతుందా…?
Tag:అమలు కాని జీవోలు