సముద్రపాల
సముద్రపాల
సముద్రపాల (చంద్రపొద) సుమారు 12 మీటర్లు పొడవు పెరిగే బహువార్షిక తీగ. శాఖోప శాఖలతో బాగా విస్తరించి ఒక పొదలా వుంటుంది. మొక్క అంతా తెల్లని నూగుతో కప్పబడి వుంటుంది. గిచ్చితే పాలు వస్తాయి. పత్రాలు, కణుపుకు ఒకటి చొప్పున పెద్దవిగా హృదయాకారంలో వుంటాయి. పత్రాల అడుగు భాగమున తెల్లటి నూగు వుంటుంది. పుష్పాలు గంట ఆకారంతో ఎర్రగా వుంటాయి. ఫలాలు గుండ్రంగా వుండి, బూడిద రంగు విత్తనాలను కలిగి వుంటాయి. సాధారణంగా ఈ మొక్క పుష్పాలు, ఫలాలు జులై – డిసెంబర్ మాసాలలో లభిస్తాయి. ఈ మొక్క నీటి వాగులు, నదుల వెంబడి ఎక్కువగా పెరుగుతుంది. వరి పండించే ప్రాంతాలలో నీటి బోదెల వెంబడి కూడా ఈ మొక్క కనబడుతుంది. ఈ మొక్క వేర్లు, కాండం, పత్రాలు, విత్తనాలు వైద్యపరంగా వుపయోగిస్తారు.
ఈ మొక్క మూత్రాశయ, గుండె, చర్మ సంబంధిత మరియు జ్వరం నివారణలో వుపయోగపడుతుంది. కఫం, వాతాలను హరిస్తుంది. వాంతులను అరికడుతుంది. పత్రాలను చర్మ వ్యాధుల నివారణలో వాడతారు. వేరు పొడిని కీళ్ళ నొప్పులు, పక్షవాతం నివారణలో ఎక్కువగా వుపయోగిస్తారు. ఈ మొక్క చూర్ణాన్ని ఆయుర్వేద వైద్యంలో ”అజమోదాది చూర్ణం” అంటారు.
సముద్రపాల మొక్కలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. ఈ రసాయనాలు కీటకాలకు, ”కీటక నాశని” (బయోఫెస్టిసైడ్)గా పని చేస్తాయని డా|| ఎ.జె.మోడి మరియు ఇతర శాస్త్రజ్ఞుల పరిశోధనలు సూచిస్తున్నాయి (2010).
ఈ మొక్క ఆకులను, లేత కొమ్మలను వరి పొలాల్లో (ఎకరాకు సుమారు 20-30 కిలోల వరకు) వరి నాటిన 30 రోజుల సమయంలో వేసిన యడల, వరి నాశించే కాండం తొలుచు పురుగు ఉధృతిని సమర్ధవంతంగా అరికట్టవచ్చని ఈ రచయిత గమనించడం జరిగింది.
ఈ మొక్క ఆకులను విత్తన నిల్వలో ఆశించే పురుగుల నివారణలో వుపయోగించవచ్చని డా|| మోడి (2010) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
Tag:సముద్రపాల