మామిడి రకాలు
మామిడి రకాలు
నీలం :
ఆలస్యంగా కోతకు వచ్చే ఈ రకం దక్షిణ ఆంధ్రలోనూ, తమిళనాడులోనూ ఎక్కువగా పెంచబడుతోంది. చెట్టు మధ్యస్థం, పండు మధ్యమం. తోు మరీ మంద ముండదు. కండ నార లేదు. పసుపు పచ్చ రంగు. నాణ్యత ఎక్కువ, ఏటేటా దట్టంగా ఆలస్యంగా నమ్మకంగా కాస్తుంది. కాయ బాగా నిలువ ఉంటుంది. టెంక పురుగు బెడద ఎక్కువ. వేసవిలో ఎక్కువ వేడిని తట్టుకోలేదు. మెట్ట ప్రాంతాల్లో కాయ సరిగ్గా పెరగక గిడసబారి పోతుంది.
దశేరి :
ఉత్తర భారతదేశంలో ముఖ్యమైన రకం. తెలంగాణా జిల్లాల్లో పెంచి, ఉత్తరాదికి ఎగుమతి చేయతగినది. చెట్టు మధ్యస్థం, కాయ పరిమాణం స్వల్పం నుండి సాధారణం. తోలు మరీ మందముండదు. పసుపు రంగు. కండ గట్టిగా వుంటుంది. నార తక్కువ. నాణ్యత అత్యుత్తమం. తేనె మంచు పురుగులకు గురి అవుతుంది. కాయ బాగా నిలువ ఉంటుంది. మన రాష్ట్రంలో సుమారు 1-1.5 నెలలు ముందుగా కోతకు వస్తుంది కాబట్టి దీనికి మంచి ధర పలుకుతుంది.
చిన్న రసం:
చెట్టు మధ్యస్థం నుండి పెద్దది. పండు మధ్యమం, రసభరితం, రుచి ఘాటు, నాణ్యత హెచ్చు. ఏటేటా దట్టంగా మధ్యకాలం నుండి ఆలస్యంగా కాస్తుంది. నిలువకు అంతగా పనికిరాదు. నార అధికం. ఒక మాదిరిగా నిలువ చేయవచ్చు. ఆవకాయకు కూడా అనువైనది.
పెద్ద రసం:
రసం రకం. ప్రతి ఏటా బాగా కాస్తుంది. చాలా రసంతో కూడి ఉంటుంది. నార అధికంగా ఉంటుంది. పండు పరిమాణం పెద్దదిగా ఉంటుంది. మధ్యకాలంలో కోతకు వస్తుంది.
హిమాయత్ :
మంచి నాణ్యత గల కోతరకం. కాయ పెద్దది. శ్రేష్టమైన మామిడి రకాలలో ఇది ఒకటి. ఈ రకం కోస్తా మరియు తెలంగాణ ప్రాంతాలకు అనుకూలమైనది. కాయలు జూన్ నెలలో వస్తాయి. కాపు తక్కువ
మహమూదా వికారాబాద్:
దగ్గరగా నాటుటకు అనువైన పొట్టి రకం. హెక్టారుకు 200 నుంచి 300 చెట్ల వరకు నాటవచ్చు. పండు మధ్యమం, తోలు పలుచన లేత పసుపు రంగు, కండ కొంత గట్టిగా ఉండి నార ఉండదు. నాణ్యత చాలా హెచ్చు. ప్రతి ఏటా దట్టంగా మధ్యకాలం నుండి ఆలస్యంగా కాస్తుంది. తేనె మంచు పురుగులను తట్టుకోలేదు. పెను గాలులను తట్టుకొంటుంది. నిలువ ఉంచుటకు చాలా అనువైనది. కోత మరియు రసం రకంగా కూడా పనికివస్తుంది.
చిరుతపూడి గోవ (రాయల్ స్పెషల్)
నీలం రకం కాయని ప్రాంతాలలో కూడా రెండవ పంటగా సెప్టెంబరు – అక్టోబర్లో పునాస కాపు కాస్తుంది. చెట్టు మధ్యస్థం, పండు మధ్యమంగా ఉండి రసంతో నిండి ఉంటుంది. పీచు ఎక్కువ, నాణ్యత ఎక్కువ, ఏటేటా మధ్య కాలం నుండి ఆలస్యంగా మొదటి పంట కాస్తుంది. తేనె మంచు పురుగులను ఒక మాదిరిగా తట్టుకోగలదు. గాలులను కొంత తట్టుకొంటుంది.