పండ్ల తోటలు – అంతరపంటలు – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం
పండ్ల తోటలు – అంతరపంటలు
మన రాష్ట్రంలో ఈ మధ్య కాంలో నెకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా మరియు తగినంత వ్యవసాయ కూలీలు దొరకనందున రైతులు పండ్లతోటల వైపు మొగ్గుచూపుతున్నారు. పండ్లతోటలు వేసిన వెంటనే రైతులకు ఫలసాయం అందదు. కనీసం 4-5 సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి పండ్లతోటల్లో మొక్కల మధ్య, వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఏవైనా స్వల్ప కాలిక పంటలను వేసుకొని దిగుబడిని పొందవచ్చు. వీటినే అంతరపంటలు అంటారు. ఈ అంతర పంటలను పండ్ల మొక్కల కాపుకు తయారయ్యే వరకు మాత్రమే వేసుకోవాలి.
అంతర పంటల ముఖ్య ఉద్దేశ్యం:
- మొక్కల మధ్య ఉన్న ఖాళీస్థలాన్నిసమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు.
- నేల సారాన్ని పెంచి నేలకోతను తగ్గించవచ్చు.
- కలుపు మొక్కల పెరుగుదల నివారించవచ్చు.
- ప్రధాన పంట పెరుగుదలను ప్రోత్సహించవచ్చు.
- నేల, సూర్యరశ్మి, నీరు మొదలగు సహజవనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు.
- అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
అంతరపంటల ఎంపిక:
అంతర పంట ఎంపిక ప్రధానపంటలైన, మొక్క మధ్య ఉన్న ఖాళీ స్థలం పైన, మార్కెటింగ్ సదుపాయం మొదలగు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతరపంటలుగా అసంద, గోరుచిక్కుడు, పెసర, మినుము, వేరుశనగ మొదలగు లెగ్యూమ్ జాతి పంటలు, క్యారెట్, ములంగి, దుంపలు, చిలగడదుంప, ఉల్లి, టమాట, వంగ, బెండ వంటి కూరగాయల పంటలు మరియు బొప్పాయి, అరటి, అనాస, ఫాల్సా, అంజూర వంటి స్వల్ప కాలిక పండ్లజాతి మొక్కలను ఎంపిక చేసుకోవచ్చు.
కాలాన్ని బట్టి ఈ క్రింద పేర్కొన్న పంటలను అంతర పంటలుగా వేసుకోవడం లాభదాయకం.
వేసవి కాలం:
దోస, బెండ, వంగ, అసంద, గోరుచిక్కుడు
వర్షాకాలం:
అసంద, మినుము, పెసర, గోరు చిక్కుడు, బెండ, అలం, పసుపు మొదగులనవి.
చలికాలం:
బఠాణి, టమాట, కాబేజీ, కాలీఫ్లవర్, వంగ, క్యారెట్, ములంగి, ఉల్లి, ఆకుకూరలు మరియు పశుగ్రాసాలైన బెర్సీమ్, లూయిసెర్న్డా ఆవాలు, వేరుశనగ వంటి నూనె గింజల పంటలను కూడా వేసుకోవచ్చు. అంతరపంటల ఎంపిక సరిగా లేకపోతే పోషకాలు, తేమ నష్టపోవడమే కాకుండా నేల స్వభావాన్నీ, ప్రధాన పంట పెరుగుదలనూ కూడా నష్టపరుస్తుంది.
అంతరల పంటలు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
అంతర పంట వేర్లు, పండ్ల మొక్క వేర్ల మధ్య పోషకాలు, నీటి కోసం పోటీ ఏర్పడకుండా పండ్ల మొక్క చుట్టూ 120 సెం.మీ. వ్యాసం వదిలి అంతరపంటలను వేసుకోవాలి.
- అంతర పంటలకు తగినంత ఎరువులు, నీరు విడిగా ఇవ్వాలి.
- అంతర పంటలను ఎక్కువకాలం ఉంచకుండా పండ్ల తోటలు కాపుకు వచ్చినవెంటనే తీసివేయాలి.
- అంతరపంటలకు పురుగులు, తెగుళ్ళు వ్యాపిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.
- అంతర పంటలు పండ్ల మొక్కల పై ప్రాకేటట్లు ఉంచకూడదు.
- అంతర పంటల సాగుకోసం లోతుగా దున్నటం చేయకూడదు. అలా చేయడం వలన పండ్లతోటల వేర్లు తెగి వేరుకుళ్ళటం, తోట క్షీణింపు సంభవిస్తుంది.
అంతర పంటలు వేసుకునే కాలపరిమితి:
రైతులు పండ్లతోటలు వేసిన తర్వాత కనీసం 4-5 సం॥ల వరకు కాపు తీసుకోలేరు. కాబట్టి ఈ మధ్య కాలంలో తక్కువ కాపరిమితి గల పండ్లమొక్కలు ఉదా: బొప్పాయి, అరటి, అనాస లేదా కూరగాయల పంటలు లేదా లెగ్యూమ్ జాతి పంటలైన పెసర, మినుము, అలసంద, వేరుశనగ వంటి పంటలు వేసుకోవచ్చు. పండ్లతోటలు కాపుకు వచ్చిన తర్వాత కూడా అంతరపంటలు సాగుచేస్తే నీటికి, పోషకాలకు పోటీ ఏర్పడి పండ్లతోటల దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
ఈ క్రింది పట్టికలో వివిధ పండ్లతోటల్లో వేసుకోదగ్గ అంతరపంటలను సూచించాం.
పండ్లతోటలు | అంతరపంటలు |
మామిడి | ఉల్లి, అలసంద, బఠాణి, క్యాలీఫ్లవర్, క్యారెట్, ముల్లంగి, టమాట, గోరుచిక్కుడు, బొప్పాయి. |
జామ | అలసంద, ఫ్రెంచిబీన్స్, ఉల్లి, బెండ, క్యాబేజి, క్యాలీఫ్లవర్, అనాస, చిక్కుడు |
అరటి | వంగ, చామగడ్డ, కంద, బెండ, అల్లము, పసుపు, ఉల్లి, లెగ్యూమ్ జాతి పంటలు |
చీనీ నిమ్మ | లెగ్యూమ్ జాతి పంటలు, బఠాణి, అలసంద, బెండ, క్యాలీఫ్లవర్ |
సపోట | టమాట, బఠాణి, ముల్లంగి, అలసంద, ఫాల్సా, బొప్పాయి, ఫ్రెంచి బీన్స్ |
కొబ్బరి | అల్లము, వేరుశనగ, కోకో, కర్రపెండలం, చామగడ్డ, పసుపు |
అంతర పంటలుగా వేసుకోకూడనివి
మామిడి | గోధుమ, జొన్న, సజ్జ |
అరటి | చిగడదుంప |
జామ | సోయాచిక్కుడు, పెసర |
చీనీ నిమ్మ | జొన్న, సజ్జ, మొక్కజొన్న, చెరకు, ఆముదం, గోధుమ, పత్తి, పొగాకు, బెండ, బెర్సీమ్, మిరప, ముల్లంగి |
ఈ విధంగా రైతులు తమ పండ్లతోటల్లో పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తూ అంతరపంటలు వేసుకుంటే అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.