“కౌలు రైతుల గుర్తింపు కార్డుల కోసం”
కౌలు రైతులకు రైతు భరోసా రావటంలో ఉన్న సమస్యల గురించి, వీలైనంత త్వరగా కౌలు రైతు గుర్తింపు కార్డు స్థానంలో వచ్చిన సి.సి.ఆర్.సి. (క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్) ఇవ్వాలని, ప్రతి వాస్తవ సాగు దారునికి రైతు భరోసా అందే విధంగా చూడాలని, రైతు ఆత్మహత్య కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూశాఖ మంత్రి గారైన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని, అలాగే గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు గారిని కలిసి వివరించాము. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కన్న బాబు గారు ఈ రోజు సచివాలయంలో రాత్రి దాదాపు 8 గంటల సమయంలో మా టీమ్‌కు ఇచ్చిన సమయం, సమస్యలు విన్న విధానం కొంత సంతృప్తినిచ్చింది. కౌలు రైతుల సమస్యల గురించి, రైతు ఆత్మహత్య కుటుంబాల గురించి ఒక్కొక్క విషయం ఓపికగా వింటూ, ఏ మార్పులు తీసుకువస్తే ఎక్కువ మందికి మేలు జరుగుతుందని చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటూ దానికి వారి వైపు నుండి వచ్చే సమస్యలు చెబుతూ వీలైనంత ఎక్కువ మందికి రైతు భరోసా వచ్చే విధంగా చూస్తామని చెప్పారు. పథకం అమలులో ఏ సమస్య వచ్చినా మీరు మా దృష్టికి తీసుకు రావచ్చని చెప్పారు. ఇక 2014 నుండి 2019 వరకు జరిగిన రైతు ఆత్మహత్య కుటుంబాల (గత ప్రభుత్వం) విచారణలో జరుగుతున్న తీవ్ర జాప్యం గురించి మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చాము. వీలైనంత త్వరగా అన్ని రైతు ఆత్మహత్య కుటుంబాలకు న్యాయం చేస్తామని, దాని మీద ప్రత్యేకంగా ఒక రోజు వివరంగా చర్చిద్దామని చెప్పారు.
Tag:గుర్తింపు కార్డు