ఆకుకూర పంటలలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
పాలకూర, తోటకూర, గోంగూర, కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర, పుదీన, బచ్చలి
ఆకుకూర పంటలలో లేత ఆకులను ఎప్పటికప్పుడు మొక్కల నుండి త్రుంచుతూ ఆకుకూరగా ఉపయోగిస్తాం. కరివేపాకు, కొత్తిమీర మరియు పుదీనాలను పచ్చళ్ళలో సువాసనకై వాడతాము. ఆకుకూరలలో చాలా పోషక విలువలు ఉండటం వలన ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మెంతికూర మరియు గింజలలో ”ఔషధ గుణాలు” చాలా ఎక్కువ. కొత్తిమీర ఆకులు మరియు కాండమును సలాడ్లలో కూడా విరివిగా వాడతారు. ఆకుకూరలలో విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణాల రీత్యా సస్యరక్షణ కోసం రసాయన క్రిమినాశకాలను వాడకూడదు. సేంద్రియ పద్ధతులలోనే సస్యరక్షణ చేయాలి.
కీటకాలు:
రసంపీల్చే పురుగులు :
పేనుబంక, తామరపురుగు, దీపపు పురుగులు, పిండినల్లి, సిల్లిడ్నల్లి మొదలైనవి. రసంపీల్చే పురుగులు ఆకులనుండి మరియు లేత కాండం నుండి రసంను పీల్చుట వలన ఆకులు ముడుచుకు పోయి పసుపు రంగుకు మారతాయి. ఆకులు నాణ్యతను కోల్పోతాయి. ఒక్కోసారి ఆకులపై నల్లటి మసి కూడా ఏర్పడుతుంది.
నివారణ:
తప్పనిసరి పరిస్థితులలో వేప సంబంధిత మందులు (వేప కషాయం, నీమాస్త్రం, వేపనూనె మొ||) మాత్రమే పంట కాలంలో 1-2 సార్లు 10 రోజుల వ్యవధిలో పంటపై పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసిన తరువాత 3-4 రోజుల వ్యవధిలో ఆకులను కోసుకోవచ్చు. కోసిన ఆకులను మంచి నీటిలో బాగా శుభ్రం చేసి వాడుకోవాలి.
ఆకులు తినే గొంగళి పురుగులు:
గొంగళి పురుగులు ఆకులను లేత కొమ్మలను తినడం వలన ఆకులకు రంధ్రాలు ఏర్పడి నష్టాన్ని కలుగజేస్తాయి. ఆకులు నాణ్యతను కోల్పోతాయి.
నివారణ:
గొంగళి పురుగులను చేతితో ఏరివేసి నాశనం చేయడం చాలా మంచిది. పైన సూచించిన వేప సంబంధిత సస్యరక్షణ మందులను మాత్రమే వాడాలి.
తెగుళ్ళు:
ఆకుకూర పంటలను ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు, కుళ్ళు తెగులు ఆశించి పంటకు నష్టం కలిగిస్తాయి.
నివారణ:
తెగులు సమస్య ఎక్కువగా ఉన్న భూములలో పంట మార్పిడి పద్ధతిని పాటించాలి.
బీజామృతం, బీజరక్షతో విత్తనశుద్ధి తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి.
2 కిలోల ట్రైకోడర్మా విరిడీ, మాగిన పశువుల ఎరువు 90 కిలోలు మరియు 10 కిలోల వేప పిండి కలిపి నీళ్లు జల్లి వారం రోజులు మగ్గిన తరువాత ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. ఇలా చేయడం వలన నేల ద్వారా ఆశించే తెగుళ్ళను అరికట్టవచ్చు.
పుల్ల మజ్జిగ + ఇంగువ ద్రావణం (ఒక ఎకరానికి 6 లీటర్ల పుల్లటి మజ్జిగ + 100 గ్రాముల ఇంగువ + 100 లీటర్ల నీరు) 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పంటపై పిచికారీ చేయడం వలన ఆకుమచ్చ తెగులు మరియు బూడిద తెగులు నివారించబడుతుంది.
జీవామృతాన్ని 15 రోజుకు ఒకసారి పంటపై పిచికారీ చేయడం వలన నాణ్యమైన ఉత్పత్తులను సాధించవచ్చు. జీవామృతం పంటలలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.