గ్లైరిసిడియా
గ్లైరిసిడియా
ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా పంట పొలాలలోనూ, అన్ని అరణ్యాలలోనూ, తోటలలోనూ సరిహద్దు మొక్కగా, చెఱువులు, కాలువల గట్ల వెంబడి పెరుగుతుంది. ఈ మొక్క లేత కొమ్మలు, పత్రాలు వ్యవసాయంలో ఉపయోగిస్తారు.
గ్లైరిసిడియా అంటేనే ఎలుకలను నివారించేది అని లాటిన్ భాషలో అర్థం. ఈ మొక్కలో వున్న రసాయనాలు, ఎలుకలకు ‘వికర్షణ’ను కల్గిస్తాయి. పొలం గట్ల చుట్టూ గ్లైరిసిడియా మొక్కలు వున్న పొలాలలో ఎలుకల బెడద తక్కువ వుంటుందన్న విషయం రైతులందరికీ తెలిసిందే. గ్లైరిసిడియా విత్తనాలను ఎలుకలకు పెట్టే విషపు ఎరలలో వినియోగించే పద్ధతి ఇండోనేషియా దేశంలో వుంది.
గ్లైరిసిడియా మొక్క ఆకులలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి, అందువల్ల ఆకులను సస్యరక్షణలో వుపయోగించవచ్చు. గ్లైరిసిడియా ఆకుల కషాయం రసం పీల్చే పురుగుల పైన మరియు చిన్న చిన్న లార్వాలపైన (ఆకులను తినే గొంగళి పురుగులు) సమర్ధవంతంగా పనిచేసి నివారించగలదని పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
గ్లైరిసిడియా ఆకు కషాయం తయారీ:
2 కిలోల గ్లైరిసిడియా ఆకులను తీసుకొని దానిని 10 లీటర్ల నీటిలో అరగంట సేపు బాగా ఉడకబెట్టాలి.
ఒక కర్రతో ఉడుకుతున్న ద్రావణాన్ని మధ్యమధ్యలో కలుపుతూ వుండాలి.
కషాయాన్ని బాగా చల్లార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి.
కషాయానికి 100 గ్రాముల సబ్బు పొడిని కలపాలి.
ఈ కషాయానికి 100 లీటర్ల నీటిని చేర్చి ఒక ఎకరాకు సాయంత్రం వేళ పంటపై పిచికారీ చేయాలి.
Tag:గ్లైరిసిడియా