గాలివాన మొక్క
గాలివాన మొక్క
గాలివాన మొక్క సుమారు 1-2 అడుగులు ఎత్తు వరకు పెరిగే ఏకవార్షిక మొక్క. పత్రాలు కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దాదాపు 3-5 సెంటీ మీటర్ల పొడవు ఉండి, అండాకారంలో ఉండి, అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. మొక్క భాగాలను గిచ్చితే పాలు వస్తాయి. ఈ మొక్క అన్ని భాగాలు ఘాటైన వాసనతో ఉంటాయి. తెల్లని పుష్పాలు పొడవైన కంకి మాదిరిగా ఏర్పడతాయి. మొక్క పైన సన్నని, తెల్లని నూగు ఉంటుంది. ఫలాలు 5 మిల్లీ మీటర్ల పొడువుగా ఉండే గుళిక. పుష్పాలు, ఫలాలు సెప్టెంబరు – నవంబరు మాసాలలో ఎక్కువగా లభిస్తాయి. ఈ మొక్క పంట పొలాలలోనూ, బీడు భూములలోనూ, తేలికపాటి నేలలలోనూ కలుపు మొక్కగా పెరుగుతుంది.
గాలివాన మొక్కలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. అందువల్ల ఈ మొక్కను వ్యవసాయంలో సస్యరక్షణ కొరకు రైతులు వినియోగించుకోవచ్చు. గాలివాన మొక్క ఆకుల కషాయానికి పంటలలో వచ్చే బ్యాక్టీరియా తెగుళ్ళను నియంత్రించే లక్షణాలు వున్నాయని డా|| దుబే (2011) పరిశోధనలు నిరూపిస్తున్నాయి. గాలివాన మొక్కకు కూరగాయ పంటలను (వంగ, టమాట, మిరప మొదలైన) ఆశించే ‘నులిపురుగు’ను అదుపు చేసే గుణం వుందని డా|| ఎమ్.ఎమ్. అలామ్ (2006) పరిశోధనలు సూచిస్తున్నాయి. బంతి మొక్కలకు కూడా నులి పురుగులను నియంత్రించే లక్షణం వుందన్న విషయం రైతులకు తెలిసిందే!
ఈ మొక్క ఎక్కువగా వున్న పొలాలలో లుపు కూడా తక్కువగా వుండటం ఈ రచయిత గమనించారు. ఈ మొక్క పంటలలో వచ్చే కలుపు నియంత్రణలో ‘సేంద్రియ లుపు నాశని’గా వినియోగించే అంశంపైన శాస్త్రవేత్తల పరిశోధనలు చాలా అవసరం.
గాలివాన మొక్కను సమూలంగా కంపోస్టు గుంతలలో వేసి బాగా కుళ్ళిన తర్వాత సేంద్రియ ఎరువు (కంపోస్టు)గా వుపయోగించు కోవచ్చు.
Tag:గాలివాన మొక్క