సరస్వతి ఆకు
సరస్వతి ఆకు
ఈ మొక్కలో వల్లారిన్, బ్రహ్మిక్ ఏసిడ్, సెంటిల్లోజ్, ఏసియాటిక్ ఏసిడ్, హైడ్రోకాటిలిన్, సెంటిలోసైడ్, సైటోస్టిరాల్ వంటి శక్తివంతమైన రసాయనా లుంటాయి.
ఈ మొక్క రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మానసిక వ్యాధులు నివారణ అవుతాయి. తెలివి తేటలు పెరుగుతాయి. ఈ మొక్క రసం చర్మానికి రక్షణ కల్పిస్తుంది. జ్వరాల నివారణలో ఉపయోగపడుతుంది. ఈ మొక్కను ఉపయోగించి చాలా రకాల ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నారు.
సరస్వతి మొక్కలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. ఈ రసాయనాలు కీటకాలకు వికర్షణ కలిగించే వాటిగానూ (రిపల్లెంట్) మరియు కీటక నాశనిగానూ (ఇన్సెక్టిసైడ్) పని చేస్తాయని డా|| బహదూర్ (2012) మరియు డా|| దాస్ (2013) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
ఈ మొక్క ఆకుల కషాయానికి వ్యాధులు కలిగించే దోమల లార్వాలను (మేగట్స్) నివారించే లక్షణం వుందని డా|| ఘోష్ (2012) పరిశోధనలలో నిరూపితమైనది.
ఈ మొక్క ఆకుల కషాయానికి శిలీంధ్ర నాశని లక్షణాలు వున్నాయని డా|| మినిజ మరియు డా|| తోప్పిల్ (2003) పరిశోధనలలో తేలింది.
ఈ మొక్కలు ఎక్కువగా పెరిగే తేమ ప్రదేశాలలో కలుపు మొక్కల బెడద చాలా తక్కువగా వుండటం మరియు అక్కడ పండే పంటలు ఆరోగ్యంగా వుండటం ఈ వ్యాస రచయిత స్వయంగా గమనించడం జరిగింది.
సేంద్రియ వ్యవసాయంలో ఈ మొక్క వుపయోగాల గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు ఎంతో అవసరముంది. ఈ నేపధ్యంలో రైతులు వారి వారి గ్రామాలలో లభ్యమయ్యే మొక్కలను కేవలం ”కలుపు” దృష్టితో చూడక, వాటిని సంరక్షించుకొని సేంద్రియ వ్యవసాయ కృషిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము.
Tag:సరస్వతి ఆకు