సీతాఫలం
సీతాఫలం
కృత్రిమ రసాయనాలకు ప్రత్యామ్నాయంగా సస్యరక్షణ కోసం వృక్షసంబంధ కీటకనాశనుల తయారీలో సీతాఫలం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సీతాఫలం వర్షాకాలం సమయంలో తియ్యని పండ్లనిచ్చే చిన్న వృక్షం. సస్య రక్షణలో సీతాఫలం ఆకులను, విత్తనాలను ఉపయోగించవచ్చు. వీటిలో గల ఆల్కలాయిడ్స్ పురుగుల నియంత్రణలో ఉపయోగపడతాయి.
5 కిలోల సీతాఫల ఆకులను 10 లీటర్ల నీటిలో వేసి అర్థగంట వరకు బాగా ఉడికించాలి. ద్రావణం ఉడుకుతున్నపుడు ఒక కర్రతో మధ్యలో కలియపెడుతుండాలి. ద్రావణాన్ని ఒక రాత్రంతా బాగా ఆరనివ్వాలి. మర్నాడు ద్రావణాన్ని ఒక పలుచని బట్టలో వడపోసి, దానికి 100 గ్రాముల సబ్బుపొడి, 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం పంటపై సాయంత్రం సమయంలో పిచికారీ చేసుకోవాలి. 100 గ్రాముల సబ్బుపొడి బదులు 500 గ్రాముల కుంకుడు కాయల రసాన్ని కూడా ఉపయోగించి మంచి ఫలితాలు సాధించవచ్చు. రసం పీల్చే పురుగులపైన చిన్న సైజు లార్వాల పైన సీతాఫలం కషాయం బాగా పనిచేస్తుంది. పంట కాలంలో రైతులు 2-3 సార్లు సీతాఫలం కషాయం ఉపయోగించుకోవచ్చు
సీతాఫలం విత్తనాలలో ఉన్న ఆల్కలాయిడ్స్ (అసిటోజెనిన్స్) కూడా కీటక నాశనిగా చాలా శక్తివంతమైనవి. సీతాఫలం గింజల నూనెను ఒక లీటరు నీటిలో 5 మి. లీటర్లు కలిపి, తయారైన ద్రావణానికి కొద్దిగా సబ్బుపొడిని వేసి బాగా కలియపెట్టాలి. ఈ ద్రావణాన్ని పంటలపై పిచికారి చెయ్యాలి. ఎండిన సీతాఫలం పొడిని విత్తన నిల్వలో ఆశించే పురుగుల నియంత్రణకు కూడా వినియోగించవచ్చు. ముఖ్యంగా అపరాలను ఆశించే ”పుచ్చుపురుగు” నియంత్రణకు (కందులు, మినుములు, పెసలు, అలసందలు, సోయాచిక్కుడు, మొ||) 100 కిలోల అపరాలకు సుమారు 5 కిలోల సీతాఫలం పొడి అవసరమౌతుంది.
Tag:సీతాఫలం