వస
వస
ఈ మొక్క మంచి సువాసన కల్గి ఉంటుంది. తేమ ప్రదేశాలలో పెరిగే బహువార్షికం. ఆకులు దళసరిగా, రెండు వరుసలతో అమరి వుంటాయి. నేలలో ఈ మొక్క దుంప ఉంటుంది. లేత పసుపు రంగు పుష్పాలు ఒక దొప్పలో అమరి ఉంటాయి. ఈ మొక్క గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతాలలోనూ, ఉత్తర కోస్తా మండలంలోని గిరిజనులచే పెంచబడుతుంది.
వేరును ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఆకులు, వేర్లలో వున్న రసాయనాలకు కీటక నాశని లక్షణాలు వున్నాయని శాస్త్రపరిశోధనలో తేలింది. పురుగులను నియంత్రించడంలో ఈ రసాయనాలు ఎంతగానో వుపయోగ పడతాయి. అదే విధంగా శిలీంధ్ర నాశక గుణాలు కూడా వున్నాయని ఇటీవలి బారిక్ (2010) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
విత్తన నిల్వలో ఆశించే పురుగుల నియంత్రణలో 3 గ్రాముల వస చూర్ణాన్ని ఒక కిలో విత్తనానికి కలిపి వుంచడం ద్వారా సుమారు 3 నెలల వరకూ విత్తనాన్ని పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు. ఈ పద్ధతి వుపయోగించి వరి ధాన్యాన్ని ఆశించే ముక్కు పురుగు, పప్పు ధాన్యాలు (కంది, పెసర, మినుము, శనగ మొ||) ఆశించే పుచ్చు పురుగుల నుండి విత్తనాన్ని రక్షించుకోవచ్చు.
వస దుంపల పొడికి వుండే ఘాటైన వాసనకు పురుగులు వికర్షించబడతాయని పరిశోధనలలో తేలింది.
పశువుల శరీరాన్ని ఆశించే గోమర్లు, పిడుగుల నిర్మూలనలో కూడా వసను వుపయోగించవచ్చునని ఇటీవల పరిశోధనలు సూచిస్తున్నాయి.
Tag:గోమర్లు, పిడుగుల నిర్మూలన, వస