విషముష్ఠి
విషముష్ఠి
విషముష్టి చెట్టును కొన్ని ప్రాంతాలలో ముషిణి, ముషిడి ముష్ఠి అని కూడా అంటారు. ఈ చెట్టు సుమారు 10-15 మీటర్ల వరకు పెరిగే వృక్షం. పత్రాలు అండాకారంలో ఉండి ప్రతి కణుపుకు రెండు ఉంటాయి. పత్రాలు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి దళసరిగా ఉంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా ఉండి శాఖల చివర గుత్తులుగా వస్తాయి. ఫలాలు గుండ్రంగా ఉసిరి కాయ పరిమాణంలో ఉండి, పండినపుడు కాషాయ రంగులో ఉంటాయి. విత్తనాలు తప్పడగా, గుండ్రంగా ఉంటాయి. ఫలంలో గుజ్జు తెల్లగా ఉంటుంది. ఈ చెట్టు యొక్క పుష్పాలు మార్చి – జూన్ మాసాలలో లభిస్తాయి. విత్తనాలు ఆగస్టు – ఫిబ్రవరి మాసాలలో లభిస్తాయి. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా అరణ్యాల లోను, కొన్ని ప్రాంతాలలో పొలాల కంచెల వెంబడి పెరుగుతుంది.
దీనిని జీవ రసాయనంగా, ఎలుకల నివారణలో, మార్కెట్లో ఎలుకల నిర్మూలన రసాయన మందులు రాని సమయంలో వాడుతుండేవారు. ప్రస్తుతం అనేక రకాల ప్రత్యమ్నాయ పద్ధతులు ఎలుకల నిర్మూలనలో లభ్యమవుతుండడం వల్ల విషముష్ఠిని వుపయోగించుట లేదు. విషముష్ఠి ఆకులు చేదుగా వుంటాయి. ఈ ఆకులలో వుండే రసాయనాలు క్రిమి సంహారకంగా పని చేస్తాయి. అందువల్ల ఆకులను ”పంచపత్ర కషాయం” (వివిధ ఆకుల ద్రావణం)లో రైతులు ఇతర ఆకులలో కలిపి వుపయోగించవచ్చు.
విషముష్ఠి ఆకుల కషాయానికి టేకు చెట్టు ఆకులను తినే గొంగళి పురుగులను నివారించే గుణం కలిగి వుందని డా|| సెంథిల్ కుమార్ 2012 (తమిళనాడు) పరిశోధనలు తెలుపుతున్నాయి. దోమల లార్వాను నిర్మూలించే గుణం విషముష్ఠి ద్రావణానికి వుందని డా|| ప్రామ్సిరి (2006) పరిశోధనలలో నిరూపితమైనది.
విషముష్ఠి ఆకుల కషాయాన్ని (పంచపత్ర కషాయం) వుపయోగించి వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు (తెల్ల కంకి)ను నివారించడం ఈ రచయిత చూడటం జరిగింది. ఈ కషాయాన్ని 10 రోజుల వ్యవధిలతో 2 సార్లు వుపయోగించి ఈ పురుగును సమర్ధవంతంగా నివారించవచ్చు.
విషముష్ఠి ఆకులను పచ్చిరొట్ట ఎరువుగా వుపయోగించిన వరి పొలాల్లో చీడపీడల బెడద చాల తక్కువగా వుండటం, ఆదివాసి ప్రాంతాలలో గమనించడం జరిగింది.
Tag:విషముష్ఠి