గలిజేరు
గలిజేరు
గలిజేరు మొక్కను కొన్ని ప్రాంతాలలో అంబటిమాడు అని కూడా పిలుస్తారు. ఇది 50 సెంటీ మీటర్ల పొడవు పెరిగే, నేలబారున విస్తరించే ఏకవార్షిక మొక్క. ఈ మొక్కకు తెల్లని దుంపవంటి తల్లివేరు వుంటుంది. శాఖలు తెలుపురంగులో వుంటాయి. మొక్క దేహమంతటా నూగుతో కప్పబడి వుంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు అండాకారంలోగానీ, దీర్ఘ వృత్తాకారంలోగానీ వుంటాయి. పత్రాల పైభాగం పైన సన్నని నూగు ఉంటుంది. పుష్పాలు చిన్నవిగా తెలుపురంగులో లేదా వుదారంగులో ఉంటాయి. ఫలాలు చిన్నవిగా గుళిక మాదిరిగా ఉండి వాటికి చిన్న కప్పులాంటి మూత కలిగి ఉంటుంది. విత్తనాలు నలుపు రంగులో వుంటాయి. ఈ మొక్క పంట పొలాలలోనూ, బీడు భూములలోనూ, తేలికపాటి నేలలలోనూ కలుపు మొక్కగా పెరుగుతుంది. ఈ మొక్కను సమూలంగా వైద్యపరంగా ఉపయోగిస్తారు.
గలిజేరు మొక్కలో నత్రజని (1.2 శాతం), భాస్వరం (0.2 శాతం) పొటాష్ (0.3 శాతం), అనేక సూక్ష్మ పోషకాలు వున్నాయి. అందువలన, ఈ మొక్కను కంపోస్టుగా రైతులు వుపయోగించవచ్చు. పచ్చిఆకు ఎరువుగా కూడా దుక్కిలో వేసి కలియదున్నాలి. నేలలో సరిపడినంత తేమ వున్నప్పుడు త్వరగా కుళ్ళిపోతాయి. తద్వారా పోషకాలు విత్తిన ముఖ్య పంటకు సకాలంలో అందుతాయి.
గలిజేరు మొక్కను సస్యరక్షణలో ”కషాయంగా గానీ, పంచపత్ర కషాయం (వివిధ ఆకుల (ద్రావణం)లోగానీ రైతులు వుపయోగించుకోవచ్చు. ఆకులలో వున్న రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి. గలిజేరు కషాయానికి పంటల నాశించే రసం పీల్చే పురుగులను ఆకులను తినే గొంగళి పురుగులను సమర్థ వంతంగా నివారించవచ్చని రైతుల అనుభవం. (గలిజేరు మొక్కను వివిధ ఆకుల ద్రావణంలో వుపయోగించి వరిలో వచ్చే పురుగుల నివారణకు రైతులు వుపయోగిస్తారు.
గలిజేరు మొక్కకు వివిధ పంటల (ఉదా: జొన్న, గుమ్మడి, వంగ, ముల్లంగి, అపరాలు, గోధుమ మొ||) విత్తనాలను మొలకెత్తకుండా (లేదా) మొలకల శక్తిని తగ్గించే లక్షణం వున్నట్లు డా|| బెనర్జీ మరియు జోషి (1971) పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఈ అంశంపై శాస్త్రజ్ఞుల పరిశోధనలు చాలా అవసరం. సేంద్రియ వ్యవసాయంలో ”కలుపు నాశనుల” ఆవశ్యకత దృష్టా ఈ పరిశోధనలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంటాయి.
Tag:గలిజేరు