అడ్డసరము
అడ్డసరము
అడ్డసరము ఇంచుమించు 2-4 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఎక్కువ శాఖలు కలిగి ఉంటుంది. పత్రాలు సరళం. కణుపులు రెండు ఏర్పడతాయి. అండాకారంలో ఉంటాయి. పుష్పాలు తెల్లగా, ఆకుపచ్చని పుష్ప గుచ్చాలతో కంకులపై ఏర్పడతాయి. ఫలం గుళిక. ఈ మొక్క పంట పొలాలు, వుద్యానవనాలలో ఎక్కువగా పెంచబడుతుంది. ఈ మొక్క ఆకులను పశువులు తినవు. ఈ మొక్కను పొలాలు, తోటలకు కంచె మొక్కగా ఉపయోగిస్తున్నారు.
ఈ మొక్క ఆకులను అనాదిగా పచ్చిరొట్ట ఎరువుగా నేపాల్లో రైతులు వరిపంటలో ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులలో నత్రజని (4.3 శాతం), భాస్వరం (0.88 శాతం), పొటాష్ (4.4 శాతం) మరియు అనేక పోషక పదార్థాలు వున్నాయి (డా|| సుబేదీ 1991).
అడ్డసరము మొక్కలో ఉన్న రసాయనాలు చాల శక్తివంతమైనవి. ఈ రసాయనాలు కీటకాలకు అభివృద్ధి నిరోధకంగానూ మరియు కీటక నాశనిగానూ పని చేస్తాయని డా|| సింగ్ మరియు డా|| శరత్ చంద్ర (2005) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
అడ్డసరము ఆకుల కషాయానికి ”పొగాకు లద్దె పురుగు”ను నియంత్రించే గుణం ఉందని డా|| దేవానంద్ (2008), డా|| అనురాధ (2010) పరిశోధనలు సూచిస్తున్నాయి. అదే విధంగా ఈ మొక్క ఆకుల కషాయం పంటలనాశించే ”పేనుబంక” (రసం పీల్చే పురుగు) పురుగును సమర్థవంతంగా నివారించగలదని డా|| దేశాయ్ (2008) ప్రయోగాలు నిరూపిస్తున్నాయి.
విత్తన నిల్వను ఆశించే వరి ముక్కు పురుగును అడ్డసరం మొక్క ఆకుల పొడి సమర్ధవంతంగా అరికట్టకలదని డా|| అబ్రాల్ మరియు ఉమా శంకర్ (2012) పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆయుర్వేద వైద్యంలో ఈ మొక్క వుపయోగాలపై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి.
Tag:అడ్డసరము