గునుగు
గునుగు
గురుగు మొక్క ఇంచుమించు 1-2 మీటర్లు ఎత్తు వరకు పెరిగే ఏక వార్షిక మొక్క. మొక్క అంతటా నూగు వుంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దీర్ఘ వృత్తాకారంతో వుంటాయి. వృతం పొట్టిగా వుంటుంది. పుష్పాలు పొడవైన కంకిపైన ఏర్పడతాయి. పుష్పాలు గులాబీ రంగు నుండి తెల్లని తెలుపు రంగులో వుంటాయి. ఫలంలో నల్లని విత్తనాలు మెరుస్తూ వుంటాయి.
గురుగు అన్ని రకాల భూములలో కలుపు మొక్కగా పెరుగుతుంది. ఈ మొక్కల లేత ఆకులను చాలా ప్రాంతాలలో ‘పప్పు కూరగా’ వాడుతారు. ఈ మొక్కను సమూలంగా గానీ, పత్రాలు, వేర్లు, విత్తనాలను విడివిడిగా గానీ, వైద్య పరంగా వుపయోగిస్తారు.
ఈ మొక్కలో సాపోనిన్, టానిన్స్, గ్లూకోసైడ్, ఆల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్ వంటి రసాయనాలు వుంటాయి. విత్తనాలలో అమైనో ఆమ్లాలు (సిలోసియా తైలం) వుంటాయి. ఈ మొక్క కషాయం కడుపు నొప్పి, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధుల నివారణలో వుపయోగిస్తారు. పత్రాల కషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే నీళ్ళ విరోచనాలు, జిగట విరోచనాలు తగ్గుతాయి. పత్రాల రసాన్ని విషకీటకాలు కుట్టిన భాగంపై పూస్తే త్వరగా బాధ నివారణ అవుతుంది. ఈ మొక్క రసాన్ని కంటిలో వేస్తే, కండ్ల మసకలు పోతాయి.
గురుగు మొక్కలో వున్న రసాయనాలు శక్తివంతమైనవి. ఈ రసాయనాలు కీటకాలకు ‘వికర్షణకారి’ (రిపల్లెంట్) గాను మరియు ‘కీటక నాశని’ గాను (పెస్టిసైడ్) పనిచేస్తాయని డా|| కోలిన్ (2001) మరియు డా|| వాలే (2011) మరియు ఇతర శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఈ మొక్క ఆకులను విత్తన నిల్వలో ఆశించే పురుగుల నివారణలో వుపయోగించవచ్చని డా|| అతుంగ్ (2009) పరిశోధనలు సూచిస్తున్నాయి. గురుగు ఆకులను వివిధ ఆకుల కషాయం (పంచపత్ర కషాయం) తయారీలో కూడా రైతులు వుపయోగించు కోవచ్చు. తద్వారా పంటలను ఆశించే రసం పీల్చే పురుగులు మరియు చిన్న చిన్న లార్వాల నిర్మూలనలో సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు.
Tag:గునుగు