“సేంద్రియ పసుపు సాగు – సుస్థిర వ్యవసాయ కేంద్రం”
పసుపు దుంపల్లోని పసుపు పచ్చదనం (కుర్కుమిన్) మరియు సుగంధ తైలం (2-6శాతం) వలన దీనిని ఆహార పదార్థాలకు రంగు, రుచి, సువాసనలు చేర్చుటకు, ఔషధాలలోనూ, చర్మ సౌరదర్యానికి వన్నెతెచ్చే పరిమళ ద్రవ్యాల తయారీలోనూ, రంగుల పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. అధిక కుర్కుమిన్ కల పసుపు రకాలకు మార్కెటు వుంది.
పసుపు ఉభయ తెలుగు రాష్ట్రాలలో 71,488 హెక్టార్లలో సాగు చేయబడుతూ 4,43,326 టన్నుల దిగుబడినిస్తుంది. తెలంగాణాలో పసుపు పండించే ముఖ్య ప్రాంతాలు నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, కొంత వరకు ఖమ్మం, మరియు ఆంధ్రప్రదేశ్‌లో కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి మరియు శ్రీకాకుళం జిల్లాలు ముఖ్యమైనవి.
వాతావరణం:
పసుపు దుంపజాతి ఉష్ణ మండల పంట. తేమతో కూడిన వేడి వాతావరణం అనువైనది. వర్షపాతం 1200-1400 మి.మీ. వుండి నీటి వసతి వున్న ఏ ప్రాంతంలోనైనా పండించవచ్చు. మొలకెత్తేటప్పుడు 25-35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. మెదక్, నిజామాబాద్ జిల్లాలలో 600-700 మి.మీ. వర్షపాతం కల ప్రాంతాలలో కూడా అధికంగా సాగు చేస్తున్నారు.
నేలలు:
బలమైన నేలలు పసుపు పండించడానికి శ్రేష్టమైనవి. గరప నేలలు మరియు మురుగు నీటి పారుదల సౌకర్యం గల ఇతర నేలలు అనుకూలం. నీరు నిలవ వుండే నేలలు, బరువైన నల్లనేలలు, చౌడు మరియు క్షార భూములు పనికిరావు. ఉదజని సూచిక 5.0-7.5 మధ్య వుండి సేంద్రియ కర్బనం ఎక్కువగా వున్న నేలల్లో బాగా పండుతుంది.
విత్తే సమయం:
స్వల్పకాలిక రకాలను మే చివరి వారంలో, మధ్యకాలిక రకాలను జూన్ మొదటి పక్షంలో, దీర్ఘకాలిక రకాలను జూన్ రెండవ పక్షంలో విత్తుకోవచ్చు. జూలై రెండవ పక్షం తర్వాత నాటినట్లైతే దిగుబడి చాలా తగ్గుతుంది.
ప్రవర్ధనం లేక వ్యాప్తి:
విత్తన కొమ్మును ఆరోగ్యవంతమైన బలమైన మొక్కల నుండి ఎంపిక చేసుకోవాలి. తల్లి కొమ్ములు, పిల్ల కొమ్ములు నాటటానికి వినియోగించుకోవచ్చు. విత్తన కొమ్ముల బరువు 30-40 గ్రా|| మరియు విత్తే లోతు 8 లేక 12 సెం.మీ. వున్న యెడల దృఢంగా మంచి ఎదుగుదల గల మొక్కలను పొందవచ్చు. 6-8 సెం.మీ. పొడవులో దృఢంగా వుండే మొలకెత్తు మొగ్గలున్న పిల్ల కొమ్ములు అనువుగా వుంటాయి. విత్తనపు దుంపలుగా తల్లి కొమ్ములు వాడినపుడు దిగుబడులు ఎక్కువగా వుంటాయి. ఎకరాకు 1000 కిలోల విత్తనం కావాలి.
నేల తయారీ:
వేసవిలో భూమిని లోతుగా గుల్లగా దున్నాలి. దుక్కి బాగా మెత్తగా వుండాలి. 6-8 సార్లు దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, అంతే మోతాదులో చెఱువు మట్టి కూడా వేసి కలియదున్నాలి.
విత్తన శుద్ధి:
విత్తన శుద్ధిని రెండుసార్లు చేసుకోవచ్చు. మొదటిసారి విత్తన శుద్ధి చేసుకొని ఆరబెట్టిన తరువాత నీడ ప్రదేశంలో కుప్పలాగా పోసి నిలువ వుంచుకోవాలి. రెండవ సారి విత్తన శుద్ధి నాటేటపుడు చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసేటపుడు మొలక విరగకుండా జాగ్రత్త వహించాలి. ఒకేసారి చేయాలనుకుంటే విత్తనం ఎంపిక చేసుకొని శుద్ధి చేసి నిలువ వుంచుకోవడమే మంచిది. దీని కొరకు బలమైన, మొలకెత్తిన మొగ్గలు గల పిల్ల కొమ్ములను ఎంచుకోవాలి. విత్తన శుద్ధి చేయటం వలన విత్తనం ద్వారా సంక్రమించే దుంప, వేరుకుళ్ళు, తాటాకు తెగులు, ఆకుమచ్చ తెగుళ్ళకు కారణమైన శిలీంధ్రాలు నాశనమవుతాయి. భూమిలోకి హానికర శిలీంధ్రాలు కొంతకాలం వరకు విత్తనాన్ని ఆశించవు.
నీటి యాజమాన్యం:
తక్కువ వర్షపాత ప్రాంతాల్లో పసుపును నీటి వసతి క్రింద సాగుచేయాలి. పసుపు దుంపలు నాటిన వెంటనే ఒక నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి. తరువాత మొలకొచ్చి మొక్క భూమిమీద కనపడు వరకు 4-6 రోజుల కొకసారి నీరివ్వాలి. భూ భౌతిక, వాతావరణ పరిస్థితులను గమనించి బరువైన నేలల్లో సాధారణంగా 15-20 సార్లు, తేలికపాటి నేలల్లో 20-25 సార్లు నీరు పెట్టాలి. దుంపకుళ్ళు ఆశించినపుడు నీటి తడుల మధ్య వ్యవధి పెంచాలి. దుంపలు పక్వానికొచ్చే సమయంలో ఎక్కువ తడులు అవసరముంటుంది. పసుపులో బిందుసేద్యం ద్వారా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. నీరు సక్రమంగా, నిలువకుండా వుండేటట్లు ఇవ్వాలి.
మల్చింగ్:
కాలువల మధ్య భూమిని పచ్చి ఆకులు లేదా ఎండుటాకులతో కప్పి ఉంచాలి. దీని వల్ల పసుపు బాగా మొలకెత్తడమే కాక కలుపు పెరగదు. నేలలో తేమ త్వరగా ఆరిపోదు. ఆకువల్ల సత్తువ, సేంద్రియ పదార్థం నేలకు అందుతుంది. అంతే కాకుండా ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మపోషకాలు కూడా పైరుకు అందుతాయి. దీని వల్ల దిగుబడులు, నాణ్యత పెరుగుతాయి. మల్చింగ్ కొరకు జీలుగ, జనుము, వేప, వెంపలి, సీమకానుగ, దిరసన, కానుగ, గ్లైరిసీడియా లాంటి పచ్చి ఆకులను లేదా ఎండుటాకులను కప్పుతారు.
పంట మార్పిడి:
ఒకసారి పసుపు వేసిన భూముల్లో 2 సంవత్సరాల వరకు పసుపు పంటను మరల వేయరాదు. వేసినచో దిగుబడులు తగ్గడమే కాకుండా చీడపీడల బెడద ఎక్కువై పంటకు హాని కలిగించే అవకాశం వుంది. పసుపును వరి, చెఱకు, అరటి, తమలపాకు మరియు కూరగాయలు మొదలగు పంటలతో పంట మార్పిడి చేయాలి. ఉత్తర తెలంగాణాలో ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు తర్వాత నువ్వులు, పొద్దుతిరుగుడు, సజ్జ మొదలగునవి సాగు చేయడం వాడుకలో వుంది. ఈ పంటలు పసుపుకు వేసిన సేంద్రియ పోషక పదార్థాలను వుపయోగించుకొని అధిక దిగుబడులనిస్తాయి. ఇట్టి అదనపు పంట ఉత్పత్తిలో సుగుణ (పి.సి.టి. 13), సుదర్శన (పి.సి.టి. 14) లాంటి స్వల్పకాలిక రకాలను వాడి అధిక దిగుబడులను పొందవచ్చు.
మిశ్రమ పంట:
పసుపు మిశ్రమ పంటగా మిరప, ఉల్లి, వంగ, సువర్ణగడ్డ (కంద), మరియు మొక్కజొన్న, రాగి పంటలతో వేసుకోచ్చు.
పసుపులో సేంద్రియ పద్ధతులలో సస్యరక్షణ
ఎర్రనల్లి (పొగచూరు తెగులు):
పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి ఆకులు పాలిపోయి ఎండిపోయేటట్లు చేస్తాయి.
పొలుసు పురుగు (స్కేల్సు):
విత్తనం నిలవ చేసేటప్పుడు కొమ్ముల్లో రసాన్ని పీల్చి వడిలిపోయేటట్లు చేసి, నష్టాన్ని కలుగజేస్తుంది. ఇవి తెల్లని చుక్కలవలె దుంపల మీద కన్పిస్తాయి.
దుంప తొలుచు ఈగ (రైజోమ్ ప్లై):
ఈ పురుగు పిల్ల పురుగులు తెల్లగా బియ్యం గింజల వలె వుండి భూమిలో వున్న దుంపలలోనికి చొచ్చుకొనిపోయి దుంపలోపలి పదార్థాన్ని తినేస్తాయి. అక్టోబర్ నుండి పంట చివరి వరకు ఈ సమస్య వుంటుంది. దీని వలన సుడి ఆకు దాని దగ్గరలో వుండే లేత ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. మువ్వ సుడిలాగా ఊడిస్తుంది. దుంపలో కణజాలం దెబ్బతింటుంది. పుచ్చు ఆశించిన దుంపలను వండితే తొర్ర మాదిరిగా కనిపిస్తుంది. మొక్క ఎదుగుదల నిలిచిపోయి నాణ్యత, దిగుబడి చాలా తగ్గుతాయి.
దుంప, వేరు కుళ్ళు తెగులు:
ఈ తెగులు సోకడానికి కారణాలు: విత్తనశుద్ధి చేయని కొమ్ములను నాటడం, మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం, సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించకపోవడం, ఎడతెరపి లేని వర్షాలు కురిసి మొక్కల నీరు నిలబడి వుండడం, పొటాష్ మరియు వేప పిండి ఎరువులను సక్రమంగా వాడక పోవడం. ఈ తెగులు సోకిన పొలం గమనించినపుడు ముదురు ఆకులు ముందుగా వాడిపోయి గోధుమ రంగుకు మారి చివరగా ఎండిపోతాయి. తరువాత మొక్కపై భాగాన వున్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి కొమ్ములు మరియు పిల్ల దుంపలు కుళ్ళి మెత్తబడి పోతాయి. దుంపలు కుళ్ళి చెడువాసన రావడమే కాకుండా నాణ్యత బాగా తగ్గుతుంది.
తాటాకు మచ్చ తెగులు:
ఈ తెగులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ మరియు ఉష్ణోగ్రత తక్కువగా వుండడం వలన వ్యాపిస్తుంది. సెప్టెంబర్ నుంచి ఈ వ్యాధి కనపడుతుంది.. అండాకారపు పెద్ద పెద్ద మచ్చలు ఆకులపై అక్కడక్కడా కనపడుతాయి. మచ్చలు ముదురు గోధుమ రంగులో వుండి మచ్చ చుట్టూ పసుపురంగు వలయం వుంటుంది. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి క్రిందకు ఆకు వాలుతుంది. నివారణ చర్యలుగా పైన సూచించిన విధంగా విత్తన శుద్ధి చేయాలి. దృఢమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి. మచ్చలు వున్న ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి.
ఆకు మచ్చ తెగులు:
పై వ్యాధికి సూచించిన కారణాల వల్లే ఆకుమచ్చ రోగం వస్తుంది. దీని వలన మొదట ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు చ్కులు ఏర్పడుతాయి. తరువాత చిన్న చిన్న గోధుమరంగు మచ్చలుగా మారతాయి. తెగులు ఎక్కువైతే ఆకు మాడిపోతుంది. నవంబరు, డిసెంబరు మాసాలలో ఈ తెగులు ఎక్కువగా కనపడుతుంది.
నివారణ చర్యలుగా వ్యాధి సోకిన ఆకులను కత్తిరించి నాశనం చేయాలి. తాటాకు మచ్చ తెగులుకు సూచించిన మందులతో పాటు …..
వేపపిండిని మరింత సమర్ధవంతంగా వినియోగించుకునే విధానం:
పసుపును ఆశించే చీడ, పీడలలో దుంప పుచ్చు, దుంపకుళ్ళు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి ఆశించిన తరువాత నివారించేకంటే రాకుండా నివారించడం మేలు. ఇలా నివారించేందుకు వేపపిండిని మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోవాలి.
సాధారణంగా రైతులు వేపపిండిని దుక్కిలోనూ, లేదా పైపాటుగానూ వేసి భూమిలో కలియదున్నుతారు. అలాకాక, దుంపపుచ్చుకు కారణమైన ఈగ మొదటిసారి కనిపించిన వెంటనే, వేపపిండిని ఎకరానికి 250-300 కిలోలు మొక్కల మొదళ్ళ చుట్టూ తడిగా వున్న నేలపై (నీటితడి ఇచ్చిన తరువాత) చల్లాలి. అలా చల్లిన వేపపిండి మొక్కల మొదళ్ళ చుట్టూ తడిగా వున్ననేలపై అంటుకుని, తదుపరి ప్రతి తడిలోను, వేప ఊట మొట చుట్టూ భూమిలోనికి దిగి పసుపు దుంపకుళ్ళు, దుంపపుచ్చును కలుగజేసే క్రిమి కీటకాలను మొక్కల దరిచేరనీయక పైరును కాపాడుతుంది. పైరును ఎప్పటికప్పుడు గమనిస్తూ పైరుకాలంలో రెండు లేక మూడుసార్లు పై విధంగా చేసి దుంపపుచ్చు, దుంప కుళ్ళు తెగుళ్ళ నుండి పసుపు పంటను కాపాడుకోవచ్చు.
పసుపులో చీడ పీడల నివారణ :
పసుపు దుంప జాతి పంట. భూమిలో సేంద్రీయ పదార్థం ఎక్కువగా వున్నపుడు దుంప ఊరడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. ఎకరానికి 16 టన్నుల సేంద్రియ ఎరువు దుక్కిలో వేసుకోవాలి.
దుంప ఈగ సమస్య ఉన్నట్లైతే ఎకరానికి 50 కిలోల వేప పిండి చివరి దుక్కిలోను మరియు మరొక 50 కిలోలు నాటిన నెల రోజుల తర్వాత మొక్క మొదలుకి వేసుకోవాలి. తర్వాత ఈగ కనిపించిన వెంటనే మొక్క మొదల్లో నీరు కట్టిన తర్వాత 150 నుండి 200 కిలోల వేప పిండిని వేస్తే అది మట్టి పైనే అంటుకుని నీరు కట్టినప్పుడల్లా వేప గుణాన్ని మొక్క వేర్లకు అందివడం వల్ల ఈగ, దుంప కుళ్ళు లాంటి సమస్యలు రాకుండా వుంటాయి.
ఎరువుతో పాటు 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్ర నాశక శిలీంద్రపు పొడిని సేంద్రియ ఎరువులో కలుపుకుని నేలలో వేసుకోవాలి.
ఎకరానికి 2 కిలోల సూడోమోనాస్ ఫ్లోరెసేన్స్ అనే బ్యాక్టీరియా పొడిని కూడా కలుపుకున్నట్లయితే భూమి నుండి సోకే వేరు కుళ్ళు, దుంప కుళ్ళు లను నివారించుకోవచ్చు.
విత్తన దుంపలను బీజామృతంతో శుద్ధి చేసుకోవాలి. బీజామృతంను ఆవు పేడ 5 కిలోలు, ఆవుమూత్రం 5 లీటర్లు, సున్నం 50 గ్రాములతో తయారు చేస్తారు. 5 కేజీల పేడను ఒక గుడ్డలో కట్టి పెద్ద కుండలో 20 లీటర్ల నీటిలో వేలాడదీయాలి. ఈ నీటిలో ఆవు మూత్రం మరియు సున్నం వేసి బాగా కలియ బెట్టాలి. సుమారు 12 గంటల వరకు ఈ మిశ్రమాన్ని నీడలో వుంచాలి. కుండలో వున్న మిశ్రమాన్ని ఉదయం మరియు సాయంత్రం వేళల్లో కలియబెట్టాలి. తర్వాత గుడ్డతో వడపోసి ఆ ద్రావణంతో దుంపలను శుద్ధి చేయాలి. అంటే అరగంట సేపు దుంపలను ఆ మిశ్రమంలో ఉంచి తర్వాత నీడలో ఆరబెట్టి నాటుకోవాలి.
మొలకెత్తిన తర్వాత నుండి నెలకు ఒకసారి చొప్పున జీవామృతంను చేనులో నీరు కట్టేటప్పుడు పిచికారీ చేసుకోవాలి.
రసం పీల్చే పురుగుల నివారణ కొరకు 5% వావిలి కషాయాన్ని కానీ లేదా పచ్చిమిర్చి – వేప – వెల్లుల్లి మరియు పొగాకు కషాయాన్ని కానీ వాడాలి. 5% వావిలి కషాయాన్ని తయారు చేయడానికి 5 కిలోల వావిలి ఆకులు 10 లీటర్ల నీటిలో మూడు పొంగులు వచ్చే వరకు వుడకబెట్టాలి. దాన్ని చల్లార్చి వడగట్టి 100 గ్రాముల సబ్బు పొడిని కలిపి దానికి నీరు కలుపుతూ 100 లీటర్లు చెయ్యాలి. ఇది ఒక ఎకరానికి ఒకమారు పిచికారీ చేయడానికి సరిపోతుంది. పచ్చి మిర్చి- వేప-వెల్లుల్లి- పొగాకు కషాయాన్ని తయారు చేయడానికి వేప ఆకులు 2 కిలోలు, పొగాకు రద్దు 1 కిలో, వెల్లుల్లి పాయలు 1 కిలో, పచ్చి మిరపకాయలు 1 కిలో మరియు ఆవుమూత్రం 5 లీటర్లు అవసరం. వేప ఆకులు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలను మెత్తగా నూరి, ముద్ద చేసి దీనికి పొగాకు రద్దును కలిపి ఒక కుండలో ఉంచి 5 లీటర్ల ఆవుమూత్రం చేర్చాలి. దీన్ని 10 రోజుల పాటు నీడలో వుంచి రోజూ కర్రతో కలియబెట్టాలి. 10 రోజుల తర్వాత ఈద్రావణాన్ని వడపోసి దీనికి 150 లీటర్లు నీరు కలిపి ఎకరం పొలం పై సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి. ఇది పిచికారీ చేసేటప్పుడు ఒంటికి నూనె రాసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది శక్తివంతమైన ద్రావణం. దీన్ని లేత నారుమడులపై వుపయోగించరాదు.
పసుపులో వచ్చే ఆకుమచ్చ తెగులు, తాటాకు మచ్చ తెగులు నివారణకు పులిసిన మజ్జిగ 6 లీటర్లకు నీరు చేరుస్తూ 100 లీటర్లు చేసి దానిని ఎకరా పంటపై పిచికారీ చేస్తే ఈ మచ్చ తెగుళ్ళను నివారించవచ్చు.
పంచగవ్య 3% (100 లీటర్ల నీటిలో 3 లీటర్ల పంచగవ్య) పిచికారీ చేస్తే కూడా ఈ మచ్చ తెగుళ్ళు నివారించబడుతాయి.
పంటకోత, త్రవ్వటం:
పసుపు పంట విత్తిన సుమారు 210-270 రోజులకు త్రవ్వకానికి వస్తుంది. భూమిలో వున్నటువంటి పసుపు దుంపలు పక్వానికి చేరుతున్న కొద్దీ మొక్కల ఆకులు పాలిపోయి ఎండటం ఆరంభమవుతుంది. మొక్కలు ఎండిపోయేవరకు పంట కోయరాదు. పసుపు బాగా పండినట్లు గుర్తు ఏమిటంటే మొక్కలు బాగా ఎండి నేలపై వాలిపోతాయి. పసుపును తవ్వే రెండు రోజుల ముందు మొక్క ఆకులు, కాండాలను భూమట్టానికి కోసివేయాలి. తర్వాత తేలికగా నీరుపెట్టి రెండు రోజుల తరువాత దుంపల త్రవ్వకం ప్రారంభించాలి. భూమిలో మిగిలిపోయిన దుంపలను నాగలితో దున్ని ఏరించాలి. తరువాత పసుపు దుంపలకు అంటివున్న మట్టిని తొలగించి శుభ్రపరచాలి. తవ్వి తీసిన 2-7 రోజుల లోపల ఉడక పెడితే పసుపు నాణ్యత చెడిపోకుండా వుంటుంది. పసుపును యంత్రాలతో కూడా త్రవ్వవచ్చు. యంత్రాలతో త్రవ్వాలని అనుకున్నప్పుడు నాటే సమయంలోనే యంత్రానికి అనుగుణంగా వరుసల మధ్య దూరం పాటించాలి.
పసుపు ఉడికించే సమయంలో జాగ్రత్తలు
పొలం నుండి తీసిన కొమ్ములను త్వరగా ఉడికించి ఆరబెట్టాలి. ఆలస్యమైతే నాణ్యత తగ్గుతుంది. దుంపలను మరియు కొమ్ములను వేరువేరుగా వుడకబెట్టాలి. పసుపు ఉడికించే బానెలలో దుంపలు, కొమ్ములు మునిగే వరకు నీరు పోసి సమంగా మంట పెట్టాలి. 45-60 నిమిషాలకు తెల్లటి నురుగు పొంగు, దానితోపాటు పసుపుతో కూడిన మంచి వాసన పొగలు వస్తాయి. అప్పుడు పసుపును నొక్కితే మెత్తగా వుంటుంది. సన్న పొరక పుల్లనుగుచ్చితే లోనకు దిగబడుతుంది. ఆ దశలో పసుపును బయటకు తీయాలి. తక్కువ ఉడికితే ఎండిన తరువాత కొమ్ములోని గర్భంలో తొర్రలా ఏర్పడుతుంది. అప్పుడు సులువుగా విరుగుతుంది. ఎక్కువ ఉడికిస్తే ఆరిన తరువాత కొమ్మురంగు తగ్గి ఆకారం కోల్పోతుంది. పసుపును ఉడికించేందుకు వాడే నీరు శుభ్రంగా వుండాలి. బురద నీరు, ఉప్పునీరు వాడరాదు. పేడ కలుపరాదు.
పసుపు ఉడకబెట్టటంలో మేలైన పద్ధతులు
సుమారు 50 కిలోల శుభ్రపరచబడిన తల్లి దుంపలను గానీ, పిల్ల దుంపలను గానీ తీసుకొని 90I55I40 సెం.మీ. సైజు గల జల్లెడ రంధ్రాలు గల ఇనుప తొట్టెలో పొయ్యాలి. ఇరుప్రక్కల పట్టుకొని ఈ తొట్టిని దీనికన్న కొంచెం పెద్ద సైజు గల ఇనుప కళాయిలో దించాలి. తొట్టిలోని దుంపలు మునిగే వరకు నీరు పొయ్యాలి. తర్వాత కళాయి కింద మంట వేసి దుంపలు సరిగ్గా మెత్తబడే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత దుంపలున్న తొట్టిని పైకి లేపి పట్టుకొన్నచో ద్రావణం కళాయిలోనికి దిగిపోతుంది. ఉడికిన దుంపలను పరిశుభ్రమైన స్థలంలో పోసి తిరిగి తొట్టిలో వేరే దుంపలు పోసి పై విధంగా వుడికించాలి.
ఆవిరితో ఉడికించడం
ఇందులో ట్రాక్టర్‌పై నాలుగు డ్రమ్ములు అమర్చి ఉంటాయి. కరెంటు ద్వారాగానీ, డీజిల్ ద్వారా గానీ, కట్టెల ద్వారా గానీ మధ్యలో వున్న ఆవిరి వుత్పత్తి చేసే యూనిట్లో వేడి ఆవిరి ఉత్పత్తి అయ్యి దాని ద్వారా నాలుగు మూలల్లో ఉన్న డ్రమ్ములోని పసుపు ఉడుకుతుంది.
పసుపు ఆరబెట్టడం
సమంగా ఉడికిన పసుపును చిన్న బానెల నుంచి తీసి బయట చదునైన, శుభ్రమైన నేల లేదా టార్పాలిన్ లేదా సిమెంట్ ప్లాట్ ఫారంపై కుప్పగా పోయాలి. 24 గంటల తరువాత రెండు, మూడు అంగుళాల మందముండేలా పరచాలి. పలుచగా పరిస్తే ఎండిన పసుపురంగు చెడిపోతుంది. 10-15 రోజులకు పసుపు తయారై కొమ్ములన్నీ ఒకే మాదిరిగా కనిపిస్తాయి. పసుపును అప్పుడప్పుడూ తిరగబెట్టాలి. మధ్యాహ్నం పూట తిరగబెడితే సమంగా ఎండుతాయి. కొమ్ములు విరిస్తే కంచు శబ్దం వస్తే అది ఆరినట్లు. తేమ శాతం 8 ఉన్నట్లు లెక్క. ఎండిన పసుపు, పచ్చి పసుపులో సుమారు 20 శాతం తూగుతుంది. ఉడికిన పసుపు తడిస్తే పసుపు రంగు కోల్పోయి నారింజ రంగు వస్తుంది. కాబట్టి తడవకుండా పాలిథీన్ షీటు లేదా టార్పాలిన్ సిద్ధంగా వుంచుకోవాలి.
వండిన దుంపలను ఆరబెట్టడం
దుంపలను కృత్రిమంగా కూడా 600 సెల్సియస్ ఉష్ణోగ్రతల వేడి గాల్పులు పంపి ఆరబెట్టవచ్చు. దుంపలను ముక్కలుగా కోసి ఆరబెట్టే అలవాటున్న ప్రాంతాల్లో ఈ పద్ధతి ఉపయోగించటం వలన మంచి రంగు, నాణ్యత కలిగిన పసుపు లభిస్తుంది.
పసుపు ఆరబెట్టేటప్పుడు ఆశించే బూజులు మరియు అఫ్లాటాక్సిన్
ఈ బూజులు ఆశించినపుడు కొమ్ములపై నల్లని, ఆకుపచ్చని మరియు తెల్లని ప్రాంతాలు ఏర్పడతాయి. ఉడికిన పసుపు తొందరగా ఎండకపోవడం, పసుపులో అఫ్లాటాక్సిన్ వృద్ధి చెందడం జరుగుతుంది. దీని నివారణకు వండిన పసుపును ఆరబెట్టేటప్పుడు పైకి, కిందకు తిప్పుతుండాలి. ఉడికించేటప్పుడు తక్కువ, ఎక్కువ ఉడికించరాదు. ఎండ, గాలి తగిలే సమతులమైన, గట్టి కల్లంలో ఆరబెట్టాలి. ఉడికిన పసుపుకు దెబ్బతగలకుండా చూడాలి. పసుపును ఎండబెట్టేటప్పుడు వర్షంలోగానీ, మంచులోగానీ తడవకుండా కప్పివుంచాలి. తేమ శాతం 8 వచ్చే వరకు ఎండబెట్టాలి.
పాలిషింగ్
ఎండిన పసుపు దుంపలు, కొమ్ములు గరుకుగా, పొలుసులు, చిన్నచిన్న వేర్లు కలిగి ఆకర్షణీయంగా ఉండవు. కావున వాటిని మెరుగుపెడితే ఆకర్షణీయంగా తయారవుతాయి. మనుషులతో మెరుగు పెట్టేందుకు ఎండిన పసుపు దుంపలను, కొమ్ములను గట్టి ఉపరితలం మీద రుబ్బిగానీ లేదా గోనె సంచులలో చుట్టి కాళ్ళతో రుద్ధటం కానీ చేయాలి. మరొక పద్ధతిలో ఒక డ్రమ్ముకు నడుమ ఇరుసుపెట్టి దాని పక్కల వ్యాకోచించే లోహంతో జల్లెడగా తయారు చేయించి, పసుపు దుంపలను, కొమ్ములను అందులోపోసి చేతితో ఇరుసును త్రిప్పితే డ్రమ్ము తిరుగుతుంది. డ్రమ్ము ప్రక్క భాగమందు ఇనుపమెష్ అమర్చి ఉండడం వలన ఒకదానికి ఒకటి రాసుకొని వసుపు మెరుగు పెట్టబడుతుంది. ఆఖరి దశలో మెరుగు పెట్టేటప్పుడు పసుపు పొడిని నీళ్లలో కలిపి కొమ్ములపై చిలకరించితే సరుకు ఆకర్షణీయంగా తయారవుతుంది. మెరుగు పెట్టేటపుడు దుంపలు, కొమ్ములు ఆకర్షణీయంగా ఉండేందుకు కృత్రిమ రంగులు వాడరాదు. వీటిని వాడడం వల్ల పసుపును దిగుమతి చేసుకొనే దేశాలు అభ్యంతరం తెలుపుతున్నాయి.
గ్రేడింగ్
ఎండిన దుంపలను, కొమ్ములను సైజును బట్టి గ్రేడింగ్ చేయాలి. తరువాత మెరుగు పెట్టిన కొమ్ములను ప్యాకింగ్ చేసుకోవాలి.
ప్యాకింగ్
దీనికోసం శుభ్రమైన క్రొత్త గోనె సంచులను వాడాలి. లోపలి భాగాన పూత వున్న గోనె సంచులను వాడడం మంచిది. తేమ తగలకుండా నిలువ చేసుకోవాలి. దీని కోసం నిల్వ చేసే సంచుల అడుగు భాగాన చాపలు వేసి వరిపొట్టు పరవాలి.
పసుపు నిల్వ
నీరు నిలవని, ఎత్తైన ప్రదేశాలను ఎన్నుకొని గుంటలు తయారుచేసి నిల్వ చేసుకోవాలి. 4I3I2 మీటర్ల గుంటలను తీసి 2-3 రోజులు బాగా ఎండబెట్టాలి. గుంత అడుగు భాగంలో రెండు అంగుళాల మందంతో వరిపొట్టు వేయాలి. గుంత అడుగు చుట్టూ పక్క గోడలను బోద లేదా వరి గడ్డితో 4 అంగుళాల మందంతో కప్పాలి. ఆ బోద లేదా వరిగడ్డి పొరను ఈత చాపలతో బాగా కప్పాలి. ఈత చాపలున్న గుంతలలో శుభ్రం చేసిన పసుపును పోయాలి. దుంపలను, కొమ్ములను వేరువేరుగా నిలువచేయాలి. ఒకవేళ ఒకే గుంతలో దుంపలను, కొమ్ములను నిలువచేయదలచు కుంటే తొలుత గుంత అడుగుభాగాన గుండ్రంగా వుండే దుంపలను వుంచి దానిపై ఈత చాపలు పూర్తిగా పరచి ఆపైన కొమ్ములు వేసి గుంతలు నింపాలి. గుంతలో పసుపును శంకు ఆకారంలో అంచులు పొర్లకుండా నింపాలి. శంకు ఆకారంలో ఉన్న పసుపు కుప్పను ఈత చాపలతో కొమ్ములు కనిపించకుండా పూర్తిగా కప్పాలి. ఈ విధంగా ఈత చాపలు పరచిన కుప్పపై బోద లేదా వరిగడ్డి కప్పి తరువాత మట్టితో కప్పాలి. ఈ విధంగా శంకాకారంలో కుప్ప చేసినందున వర్షపునీరు సులువుగా దొర్లిపోతుంది. పసుపును గోనె సంచులలో ఉంచి కూడా పై విధంగా నిల్వ చేయవచ్చు.
గోదాముల్లో పసుపు నిల్వ:
పండిన పసుపును గోనె సంచుల్లో నింపాలి. గోదాముల్లో నిల్వ చేయాలి. సంచులను ఎండలో ఆరబెట్టి, తరువాత పసుపును నిల్వ చేయాలి.
విత్తన పసుపు నిల్వ:
విత్తన పసుపును చెట్టు నీడన చల్లని ప్రదేశంలో నిల్వ వుంచాలి. ఎటువంటి పరిస్థితులలోనూ ఆరుబయట ఎండతగిలేచోట విత్తనాన్ని నిల్వ చేయరాదు. చెట్టు నీడనగానీ, కొట్టాలు, పాకల్లో గానీ విత్తనాన్ని నిలువ చేయు ప్రదేశాన్ని సమతలంగా చేసి అర అడుగు మందంతో ఇసుక పరచాలి. తరువాత ఇసుకపై కొంచెం నీరు చిలకరించి విత్తన పసుపును శంకాకారంలో కుప్పగా పోయాలి. కుప్ప మీద వేపాకు, వరి గడ్డి లేదా మంచి పసుపు ఆకులను కప్పాలి. తరువాత ఎర్రమట్టి, పేడ కలిపిన లేపనం చేసి ఆకులపై అలకాలి. తొలకరి వర్షాలకు విత్తన దుంపలకు, కొమ్ములకు మోసులు వస్తాయి.
Tag:పసుపు