వరిలో వివిధ సాగు పద్ధతులు
వరిలో వివిధ సాగు పద్ధతులు
మనరాష్ట్రంలో వరి పంటను కాలువల కింద, చెరువుల కింద, బోరు బావుల కింద పండిస్తున్నారు. 1. నీటి సాగు పద్ధతి (పొలంలో నీరు నిల్వ ఉంచి పండించే పద్ధతి), 2. దమ్ములో విత్తు పద్ధతి, 3. మెట్ట సాగు పద్ధతి, 4. పరిమిత నీటి సాగు పద్ధతి, 5. శ్రీ పద్ధతి లాంటివి రైతులు అలనుసరిస్తున్నారు.
నీటి సాగు పద్ధతి
నీటి సాగు పద్ధతిలో నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి. నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా పెరుగుతుంది. ముదురు ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది.నాటుపైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశముంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్‌లో చ.మీ.కు 33 మూనలు, రబీలో 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ బాటలు తీయటం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని కొంత వరకు అదుపుచేయవచ్చు.
దమ్ములో విత్తు పద్ధతి
దమ్ములో విత్తనం వెదజల్లడం గానీ వరసలలో విత్తడం గానీ చేస్తారు. దీనిని చల్లు పద్ధతి లేదా అలుకుడు పద్ధతి అని అంటారు. ఈ పద్ధతిలో నారుమడి తయారీ, నారు పోయడం, నారు తీయడం, నాట్లు లేకపోవడం వలన శ్రమ, కూలీల ఖర్చు తగ్గుతాయి. నాట్ల పద్ధతిలో కన్నా 10-15 రోజుల ముందుగానే పైరు కోతకు వస్తుంది. సాగు నీరు ఆదా అవడమే కాకుండా పైరు నీటి ఎద్దడికి బాగా తట్టుకుంటుంది.
నేరుగా దమ్ములో వెదజల్లి పండించటానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు
వివిధ ప్రాంతాల్లో నాటటానికి అనువైన పరి వంగడాలే చాలా వరకు నేరుగా వెదజల్లి పండించటానికి కూడా అనుకూలం. కాండం గట్టిగా ఉండి, పడిపోని రకాలను ఎంపిక చేసుకోవాలి. పొలంలో మురుగునీరు పోవడానికి బోదెలు ఏర్పాటు చేసుకోవాలి. పొలాన్ని 15 రోజుల ముందుగా దమ్ముచేసి తరువాత విత్తడానికి 4 రోజుల ముందు మరొకసారి దమ్ముచేసి సమానంగా చదువుచేసి, మట్టి పేరుకున్న తర్వాత ప్రతి 2 మీ.లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. మొలకెత్తిన విత్తనాన్ని (ముక్కు బయటకు రాగానే), పొలంలో పలుచటి నీటి పొర ఉంచి సమానంగా వెదజల్లాలి లేదా 8 సాళ్ళ పరికరంతో నీరు పూర్తిగా తీసివేసి కూడా విత్తవచ్చు. మొక్కల మొదటి ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు (సుమారు 7-10 రోజుల వరకు) పంటకు ఆరుతడులు అవసరం.
మెట్ట సాగు పద్ధతి
ప్రతి జిల్లాలోనూ వరి పంటను కొద్దోగొప్పో వర్షాధారంతో పండిస్తారు. సాధారణంగా భూసారం తక్కువ, తేలిక నేలల్లో మెట్ట సాగు చేస్తున్నారు. జూన్, జులై నెలల్లో వర్షాలు పడిన వెంటనే నేలను లోతుగా దున్ని బాగా చివికిన పశువుల ఎరువు లేదా కంపోస్టును దుక్కిలో వేయాలి. అఖరిసారిగా దున్ని నేలను సమతలం చేయాలి. మెట్ట సాగులో ఎకరానికి గొర్రుతో విత్తడానికి 35 కిలోలు, వెదజల్లడానికి 40 కిలోల విత్తనం కావాలి. వర్షపు నీరు వీలైనంత ఎక్కువగా నేలలో ఇంకేటట్టు 15 రోజులకొకసారి వరుసల మధ్య అంతరకృషి చేయాలి. కలుపు మొక్కలు ఎక్కువగా రావడం వల్ల దిగుబడి తగ్గిపోకుండా ఉండటానికి సరైన సమయంలో కలుపు యాజమాన్యం చేయాలి. మెట్ట వరి సాగులో స్వల్పకాలిక వంగడాలు వేస్తాం కాబట్టి అవి వర్షాకాలంలోనే కోతకు వస్తాయి.
పరిమితమైన నీటి సాగు పద్ధతి
మొదట మెట్ట సాగు, చెరువుకు నీరు వచ్చిన తర్వాత నీటి సాగుగా వరి పండించే పద్ధతిని పరిమిత నీటి సాగు లేదా మెట్ట-నీటి సాగు అనవచ్చు. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఈశాన్య రుతుపవన ప్రభావం వలన అధిక వర్షం కురిసే ప్రాంతంలో ఈ పద్ధతి అమలులో ఉంది. ఈ రకమైన సాగులో విత్తనాన్ని గొర్రుతో విత్తుతారు. విత్తేటప్పుడు నేల పై పొర 8-10 సెం.మీ. లోతు వరకూ తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేనిచో విత్తనం మొలకెత్తక ఖాళీలు వస్తాయి. వరి విత్తనాలకంటే ముందుగా కలుపు విత్తనాలు వస్తాయి కాబట్టి విత్తన 15 రోజుల నుంచి 15 రోజులకు ఒకసారి వరుసల మధ్య దంతి తోలాలి. వరుసలలో మొక్కల మధ్య కలుపు మొక్కలను తీసివేయాలి.
వరిలో శ్రీ పద్ధతి
‘శ్రీ’ అనేది వరిలో ఒక రకం విత్తనం/ వంగడం కాదు. ఇదొక సాగు పద్ధతి మాత్రమే. ‘శ్రీ’ పద్ధతిలో ఏ వరి రకాన్నైనా సాగు చేయవచ్చు.