వరిలో నీటి యాజమాన్యం – సుస్థిర వ్యవసాయ కేంద్రం
సాధారణంగా రైతులు కలుపును అరికట్టడానికి నీళ్ళు ఎక్కువగా పెట్టి ఉంచుతారు. కాలువల ప్రాంతాల లోనే కాకుండా చెరువులు, బోర్లకింద కూడా పంటకు అవసరం కన్నా నీటి వినియోగం ఎక్కువగా ఉంది. నీళ్ళు నిలబడి ఉన్న నేలల్లో గాలి ఆడక వరి వేళ్ళు ఆరోగ్యంగా పెరగవు.
అందుకే శ్రీ పద్ధతిలో పొలంలో నీళ్ళు నిలబడేలా కాకుండా కేవలం పొలం తడిచేలా మాత్రమే పెట్టాలి. నేల సన్నటి నెర్రలు కొడుతున్న దశలో మళ్ళీ నీళ్ళు పెట్టాలి. నేలను బట్టి, వాతావరణం బట్టి ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టాల్సి ఉంటుందో నిర్ణయించుకోవాలి.
నీళ్ళు నిలబెట్టకపోవటం వల్ల వరి మొక్క ఆరోగ్యంగా, లోతుగా అన్ని వైపులా విస్తరిస్తుంది. దూరంగా నాటడం వల్ల కూడా వరి వేళ్లు బాగా విస్తరిస్తాయి. పొలాన్ని తడుపుతూ, ఆరగడుతూ ఉండటం వల్ల నేలలోని సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెంది మొక్కలకు పోషకాలు బాగా అందుతాయి.
ఒకరోజు ముందు పలుచగా నీళ్ళు నిలబెట్టి వీడర్‌ను నడపాలి. వీడర్ నడిపిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మడిలోని మురికి నీటిని క్రింది మడికి వదలకూడదు. అలా చేస్తే ఆ మడిలో పోషకాలన్నీ బయటకు పోయే ప్రమాదం ఉంది. పంట పొట్ట దశకు వచ్చినప్పటి నుండి ఒక అంగుళం మేర నీళ్ళు నిలగట్టాలి. గింజ 70 శాతం గట్టిపడే వరకూ నీళ్ళు నిలగట్టి ఆ తరువాత తీసివేయాలి.
భూమి ఎగుడుదిగుడుగా ఉంటే ఒక చోట నీళ్ళు నిలబడి ఉంటాయి. ఇంకోచోట తడిలేక చేను ఎండి పోతుంది. నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలంటే మడులు చిన్నగా, చదునుగా ఉండాలి. పొలం పూర్తిగా తడిచేవరకూ నీళ్ళు పెట్టకుండా మూడు వంతులు (స్థానిక పరిస్థితులను బట్టి) తడిచిన తరువాత నీటి సరఫరా ఆపివేస్తే చేను మొత్తం తడుస్తుంది. ఒకవేళ నీళ్ళు ఎక్కువై బయటకు తీసివేయాల్సివస్తే, ఆ నీటిని గట్ల మీద మొక్కలకు కానీ, క్రింద నున్న చిన్న మడిలో కూరగాయల పెంపకానికి కానీ ఉపయోగించుకోవాలి.
వెన్ను దశ
వరిసాగులో ఇది కీలకమైన దశ. వెన్నుదశలో కంకి తయారవుతుంటుంది. కంకి ఎంత బాగా తయారైందనే దానిపై దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ దశలో పంచగవ్య పిచికారీ చేయడం వల్ల దిగుబడి పెరుగుతుంది. పంచగవ్య అనేది మొక్కల పెరుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఇందులో ఆవు నుంచి లభించే ఐదు ఉత్పత్తులను, మరికొన్ని జీవ సంబంధ పదార్ధాలను ఉపయోగిస్తారు. ముతక రకాలలో దిగుబడులు పెంచడానికి ఒకసారి పిలకల దశలో, మరోసారి వెన్నుదశలో 3 శాతం పంచగవ్యను ఉపయోగిస్తారు. సన్నబియ్యం (ఫైన్) రకాలకైతే వెన్నుదశలో ఒకసారి మూడు శాతం పంచగవ్య ఉపయోగిస్తారు.
పూత దశలో 10 శాతం మజ్జిగ (చల్ల) ద్రావణం లేదా మూడు శాతం లేత కొబ్బరి నీరు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. దీని వల్ల అన్ని మొక్కలు ఒకేలా పూతకు వచ్చి దిగుబడులు పెరుగుతాయి. ఈ దశలో కాండం తొలిచే పురుగు, పసుపు బొంత పురుగు, కంకినల్లి వంటి పురుగులు పంటను ఆశ్రయిస్తాయి. కాండం తొలిచే పురుగులను లింగాకర్షక బుట్టల సాయంతో అదుపు చేయవచ్చు. పసుపు బొంత పురుగులను వేప కషాయంతో, కంకి నల్లిని పంచపత్ర కషాయంతో అదుపు చేయవచ్చు.
పంటకాలంలో ఎలుకల నివారణకు కొన్ని సులువైన పద్ధతులు
- పచ్చి బొప్పాయి కాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి పొలం గట్లపై చల్లాలి. ఎకరానికి నాలుగు పచ్చి బొప్పాయి కాయలు సరిపోతాయి. వీటిలోని ఒక రసాయనం ఎలుక నోటి కండరాలకు హాని కలిగిస్తుంది.
- ఎలుక వికర్షకాలైన జిల్లేడు, పసుపు, ఆముదం మొక్కలను పొలం గట్లపై నాటితే వాటి బాధ నివారణ అవుతుంది.
- పొలం గట్లపై ఇంగ్లీషు తుమ్మ లేదా స్క్రూ పైన్ వంటి ముళ్ళ కంపను పరిస్తే వాటిపై సంచరించిన ఎలుకల ఉదర భాగాలు చీరుకుపోతాయి. అవి వాటికి సంచార నిరోధకంగా ఉపయోగపడతాయి.
- సిమెంట్‌ను, మైదా పిండిని సమభాగాల్లో కలిపి పొట్లాలు కట్టి కలుగుల వద్ద ఉంచితే అవి తిన్న ఎలుకల నోటి భాగాలు పిడచగట్టుకపోయి నశిస్తాయి.
- కొబ్బరి లేదా తాటి గెలల జవటలను పాము ఆకారంలో మలిచి గట్లపై అమరిస్తే ఎలుకల బాధ నివారణ అవుతుంది.
- తూటాకు కాడలు రెండు మూడు కిలోలు సేకరించి మూడు లీటర్ల నీటిలో 30 నిమిషాలు మరిగించి వడపోయాలి. ఆ ద్రావణంలో రెండు మూడు కిలోల జొన్నలు కలిపి మరో 30 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ జొన్న విత్తనాలను ఎలుకల బొరియల్లో వేయాలి. జొన్న గింజలను తిన్న ఎలుకలు మరణిస్తాయి.
- ఎండు మిర్చిని కలుగుల్లో వేసి అగ్గిపుల్ల వెలిగించి మూసి ఊదరబెట్టాలి.
- మట్టికుండను ఎండుగడ్డితో నింపి నీరు చిలకరించాలి. కుండ అడుగు భాగాన రంధ్రం చేసి కలుగుపై కుండను బోర్లించి పై రంధ్రం ద్వారా కుండలోని గడ్డిని నిప్పుతో రగిలించాలి. సదరు రంధ్రాన్ని తడి మట్టితో కప్పి కుండనుంచి పొగ బయటకు పోకుండా ఎలుక బొరియల్లోకి పోయేలా ఊదరబెట్టాలి. కుండనుంచి వచ్చే పొగ బొరియ అంతటా వ్యాపించి ఎలుకలకు ఊపిరాడకుండా చేస్తుంది. అత్యవసరమార్గం ద్వారా బొరియ నుంచి ఎలుక బయటకు వచ్చి గిల గిలా కొట్టుకొని చనిపోవడం ఒక్కోసారి జరుగుతుంది.
Tag:Telugu, ఎలుకల నివారణ, నీటి యాజమాన్యం