సాగులో… సగం… శ్రమలో… సగం.. – పద్మ వంగపల్లి
శిక్షణ, అవగాహన ఈ రెండు అంశాలు యువ రైతు మిత్రులకు సాగులో ఓ కొత్త ఆలోచనను కలిగిస్తాయని మరోసారి రుజువైంది. రసాయన సాగు నుండి సేంద్రియం వైపు అడుగులు వేసి, అందరూ అభినందించేలా శ్రమిస్తున్న గంగాభవాని అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మన ముందు నిలిచింది.
పట్టుమని పాతికేళ్లు లేని గంగాభవానిది కడప జిల్లాలోని, వేంపల్లె మండలంలోని, తాళ్లపల్లె గ్రామంలోని ఓ సాధారణ రైతు కుటుంబం. ఇంట్లో వ్యవసాయం, దానిచుట్టూ అల్లుకున్న నిర్ణయాల్లో ఆమెకు ఏ మాత్రం భాగస్వామ్యం ఉండేది కాదు. వ్యవసాయ పనులు కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించేంది. అంతవరకే. ఆమెపనిగా ఉండేది. కడప అంటేనే వర్షాభావ పరిస్థితులు… నీటి కటకటలు. అలాంటి చోట నిరంతరం వ్యవసాయం చేయడం కష్టమైన పనే. అందుకే చాలా మంది రైతులు వర్షాల మీద ఆధారపడో, బోర్లను నమ్ముకునో మాత్రమే వ్యవసాయం చేస్తుంటారు. వీటికి తోడు విష రసాయనాలు, పురుగు మందులు, ఎరువులు కొని, అప్పులపాలు కావడం. లేదంటే సాగుభూములను అలా బీడుగా వదిలేయడం… ఇదీ అన్ని చోట్లా అన్నదాతల పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో, సాగుభూమిని బీడుగా పెట్టకుండా, మనిషికి, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న విషరసాయనాలు వాడకుండా, సుస్థిర వ్యవసాయ కేంద్రం సహకారంతో, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో అందరినీ ఎదిరించి ధైర్యంగా ముందుకు అడుగులేసింది గంగాభవాని.
అనుభవం గడించిన వారే, అనేకానేక రసాయనాలు, పురుగుమందులు వాడుతుంటేనే, వ్యవసాయం గిట్టుబాటు కావడట్లేదని వాపోతుంటే, వాటన్నింటినీ వదిలేసి వ్యవసాయంలో ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని, అవి ఆచరణ సాధ్యమేనని సుస్థిర వ్యవసాయ కేంద్రం చెప్పిన మాటలు నమ్మి, ఆ దిశగా సాగుబాట పట్టడమంటే సాహసమే. అందుకు ఎవరు అంగీకరిస్తారు? ఇంట్లో వాళ్లు ఎలా ఒప్పుకుంటారు? ఇలాంటి అనుభవాలే గంగా భవాని కూడా ఎదుర్కొంది. పిల్ల చేష్టలు చేయకని, వర్షాభావ పరిస్థితుల్లో, నీటి ఎద్దడి ఉన్నచోట సాగు సాధ్యం కాదని, అమ్మ వారించింది. అయినాసరే, గంగా భవాని గ్రామంలో అందరికన్నా భిన్నంగా ఆలోచించేందుకు, రో-వాటర్ సోయింగ్తో సాగు చేపట్టేందుకు సిద్ధపడింది. దుక్కి దున్ని ఘన జీవామృతం వేసింది. కంది పంట వేసేకంటే ముందు, సుస్థిర వ్యవసాయ కేంద్రం అందించిన విత్తనాలకు విత్తనశుద్ధి చేసింది. స్థానికంగా ఎక్కువగా సాగయ్యే వేరుశనగ పొట్టుని మల్చింగ్గా చేసింది. రో-వాటర్ సోయింగ్తో నీటి తడులు ఇచ్చింది. ఇంతా శ్రమపడుతుంటే, చుట్టుపక్కల రైతులందరూ వెక్కిరించారు. ఇది వచ్చే పంట కాదు, పోయే పంటేనని నిరుత్సాహ పరిచారు. కానీ, గంగాభవాని వెనకడుగ వేయలేదు. కానీ, వారందరినీ ధిక్కరించి గంగాభవాని తీసుకున్న నిర్ణయం సరైందేనని, ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని, వాటితో మంచి ఫలితాలు సాధించొచ్చని ఈ రోజు విరగకాసిన తన కందిచేలో నిలబడి విజయగర్వంతో నిరూపించింది. అద్భుతమైన పంటను చేతిలోకి తీసుకుంది. కేవలం 25 సెంట్ల భూమిలో, 15 రకాల పంటలు వేసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపడేలా చేసింది. ఆకుకూరలు, కాయకూరలతో పాటు, అలసందలు, జొన్న లాంటి ధాన్యం కూడా పండించింది.
ఈ ఆనందాన్ని చూసి, ఈ పంట దిగుబడులు చూసి, గ్రామంలోని ఇతర రైతులు కూడా ఆలోచనలో పడ్డారు. మనం కూడా అటువైపు అడుగులు వేయాలనే ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు గంగాభవాని సాగు భూమి కూడా, సారవంతంగా మారింది. మట్టిలో కూడా గతంలో లేని విధంగా తగినన్ని పోషకాలున్నాయంటోంది. తను ఎప్పుడూ చూడని మిత్రపురుగులు కూడా తన పొలం నిండా సందడి చేస్తున్నాయంటోంది. ఇంతకన్నా నిదర్శనం ఏముంటది? రసాయనాలు వదలి.. సేంద్రియం వైపు అడుగులు వేసిందనడానికి… ప్రకృతితో ఆమె చెలిమి చేసిందనడానికి…