కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై “రైతు స్వరాజ్య వేదిక” విశ్లేషణ
మిత్రులారా ఈ రోజు కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై
“రైతు స్వరాజ్య వేదిక”విశ్లేషణ, పత్రికా ప్రకటన.
2020 ఫిబ్రవరి 1 వ తేదీ;
గ్రామీణ ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తిని పెంచటంలో బడ్జెట్ విఫలం; ఆర్ధిక వ్యవస్థను మాంద్యం నుండి బయటికి తెచ్చే బదులు ఈ బడ్జెట్ బడా కార్పొరేట్ కంపెనీల లాభాలను పెంచటానికే తోడ్పడుతుంది.
కేంద్ర బడ్జెట్ గురించి పూర్తిగా విశ్లేషిస్తూ రైతు స్వరాజ్యవేదిక నాయకులు ఈ బడ్జెట్ రైతాంగం మరియు గ్రామీణ ప్రాంత ప్రజలని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్ ను కొనుగోలు శక్తిని పెంచి తద్వారా గ్రామీణ ఆదాయాలను పెంచటం అనేది భారత దేశ ఆర్ధిక వ్యవస్థ సత్వర అవసరం కాగా ఈ బడ్జెట్ గ్రామీణ రంగాన్ని బలోపేతం చేయటానికి ఎటువంటి కేటాయింపులు చేయలేదు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు విస్సా కిరణ్ కుమార్, “మొత్తం కేంద్ర బడ్జెట్లో ఈ రంగాలకు 2019-20లో 9.61% కేటాయింపు ఉండగా, 2020-21లో కేవలం 9.30%కి పడిపోయింది. 2019-20 బడ్జెట్ లో వ్యవసాయం, నీటి పారుదల, గ్రామీణ అభివృద్ధికి చేసిన మొత్తం కేటాయింపు 2.68 లక్షల కోట్లు, దీనిని ఈ సంవత్సరం బడ్జెట్ లో నామమాత్రంగా 2.83 లక్షల కోట్లకు పెంచారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే తరుగుదల అనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాలకి, రైతాంగానికి మరింత కేటాయింపులు ఉండవలసిన సమయంలో కేంద్ర ప్రభుత్వం మరొకసారి నిర్లక్ష్య వైఖరి అవలంబించింది,” అని అన్నారు.
ఇది రైతుల ఆదాయాలు, పొదుపులు, ఆహార భద్రత లేక ఉపాధి మొదలైనవాటిని మెరుగు పరచటానికి ఏవిధంగానూ దారితీయదు – అవి ప్రస్తుతం ఏర్పడి వున్న ఆర్ధిక మాంద్యం నుండి ఆర్ధిక వ్యవస్థను బయట పడవేయటానికి అత్యవసరం. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పించే అతి పెద్ద కార్యక్రమమైన జాతీయ ఉపాధి హామీ పధకానికి బడ్జెట్ కేటాయింపును 71,001 కోట్ల రూపాయల నుండి (2019-20) ప్రస్తుత బడ్జెట్ లో 61,500 కోట్ల రూపాయలకు తగ్గించారు. నిజానికి రాష్ట్రాలు ఈ పధకానికి లక్ష కోట్ల బడ్జెట్ అవసరమని డిమాండ్ చేయగా 9,500 కోట్ల రూపాయలను తగ్గించారు. 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగించే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పధకం పి ఎం కిసాన్ పధకం కింద ఒకొక్క రైతు కుటుంబానికీ అందించే 6000 రూపాయలు కేవలం 6.12 కోట్ల మంది రైతులకు మాత్రమే అందింది. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఈ పధకాన్ని వర్తింపచేయనే లేదు. ఈ లోగా గత ఐదు ఏళ్లలో వ్యవసాయ ఉత్పాదకాల ధరలు 33% నుండి 100% పెరిగాయి, జీవన వ్యయం రెట్టింపైంది.
రైతు స్వరాజ్య వేదిక కమిటీ సభ్యులు ఆశాలత గారు మాట్లాడుతూ, “2020 బడ్జెట్ వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, పంటల సేకరణ, నిల్వ, శుద్ధి, బీమా, పంట బీమా మొదలైన వాటిలోకి కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీలు మరింత ఎక్కువగా చొరబడటాన్ని ప్రతిపాదిస్తుంది. అది రైతులకు అధిక ఉత్పాదకాల ధరలు, తక్కువ పంట ధరలు, తెగనమ్ముకోవటం, పంట నష్టం మొదలైనవాటి నుండి ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. రైతుల భూములను కౌలుకు తీసుకోవటం, వారిని మరింత అప్పుల ఊబిలోకి తోయటం, వారి పంటలను మరింత తక్కువ ధరలకు కొనటం, ఆహార శుద్ధి ద్వారా అధిక లాభాలు పొందటం, మార్కెటింగ్ చేయటం ద్వారా కంపెనీలు రైతులను దోపిడీ చేయటం పెరుగుతుంది.” అని అన్నారు.
బడ్జెట్ పత్రాలను పరిశీలిస్తే కేటాయింపుల ప్రకటనకు చేసిన ఖర్చుకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడవుతుంది. 2018-19 బడ్జెట్ లో 22,000 గ్రామీణ మార్కెట్లను గ్రామీణ్ అగ్రికల్చర్ మర్కెట్స్(GrAM) లుగా వాటి స్థాయిని పెంచటం జరుగుతుంది అని వాగ్దానం చేయటం జరిగింది. కానీ రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ 0.5% నిధులు మాత్రమే ఖర్చు చేశారు. కనీస మద్దతు ధర ప్రతి రైతుకు అందుతుందని, దాని కోసం PM -AASHA పధకాన్ని స్థాపించారని 2018-19 బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి వాగ్దానం చేశారు. 2019-20 సంవత్సరంలో అందుకోసం కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించగా, దానిలో 321 కోట్ల రూపాలు మాత్రమే ఖర్చు చేశారు. ఈ బడ్జెట్ లో ఆ కేటాయింపును 500 కోట్లకు తగ్గించారు. గత రెండు సంవత్సరాలలో చాలా పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించనేలేదు. నిజానికి మార్కెట్లో జోక్యం చేసుకుని మద్దతు ధర అందించాల్సిన సమయం అదే, కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2017-18 బడ్జెట్ ఉపన్యాసం లో 10,881 కోట్ల “పాడి పరిశ్రమకు మౌలిక సదుపాయాల అభ్రివృధి నిధి”ని ప్రకటించారు, దానిని 3 ఏళ్లలో ఖర్చు చేయవలసి వుంది. అయితే ఇప్పటివరకు పెట్టిన అసలు ఖర్చు కేవలం 440 కోట్లరూపాయలు మాత్రమే. ప్రస్తుత బడ్జెట్ లో దీని కోసం కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అదే విధంగా ప్రధాన మంత్రి సించాయి యోజన అనే చిన్నతరహా నీటి పారుదల కోసం 3500 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో 2019-20 లో కేవలం 2032 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
కాంట్రాక్టు ఫార్మింగ్ చట్టం, మరియు ఏ.పి.ఎం.సి. మోడల్ చట్టాలు అమలు చెయ్యమని రాష్ట్రాలకు సూచన ఇచ్చింది కాని జాతీయ గ్రామీణ ఉపాధి పధకం, గ్రామీణ వేతనాలు, నీటి పారుదల, డీజిల్-విద్యుచ్ఛక్తి -విత్తనాలు-ఎరువులకు సబ్సిడీలు, భూమిలేనివారు, వ్యవసాయ కూలీలు, బటాయిదారుల సమస్యలు మొదలైనవాటికి బడ్జెట్ లో ఎటువంటి ప్రతిపాదనలు లేవు.
రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు నవీన్ కుమార్ మాట్లాడుతూ, “ప్రభుత్వం ఈ బడ్జెట్ లో వ్యవసాయ రుణాన్ని 15 లక్షల కోట్లకు పెంచింది, కానీ ఈ రుణాలు చిన్న సన్నకారు రైతులకు, కౌలు రైతులకు, ఆదివాసీ రైతులకు అందటానికి ఎటువంటి వ్యవస్థాగత మార్పులు సూచించలేదు. వ్యవస్థాగత అప్పులు అందక అప్పులలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఈ రైతులే, అయినప్పటికీ వారి ప్రస్తావన లేదు. అంటే ఈ రుణాలలో ఎక్కువ భాగం పెద్ద వ్యాపార సంస్థలకు అందుతుంది, కంపెనీలు తయారు చేసే అధిక ఖర్చు గల ఉత్పాదకాలు, యంత్రాల అమ్మకాలను పెంచటానికే పోతుంది . రైతులు తమ భూములను తనఖా పెట్టుకోకుండా నివారించటానికి వారికి ఎటువంటి సహాయం లేదు . ప్రభుత్వం ఇటీవలే కార్పొరేట్లు చెల్లించకుండా ఉండిపోయిన 2 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి వారికి అదనంగా 1. 45 లక్ష కోట్ల పన్ను రాయితీలను కల్పించింది,” అని అన్నారు.
ఈ బడ్జెట్ లో సమగ్ర ఉత్పత్తి ఖర్చు C2 కు అదనంగా కనీసం 50% లాభం చేకూర్చే గిట్టుబాటు ధరకు హామీ కల్పించే కేటాయింపులు చేస్తారని, అలాగే PM-AASHA పధకానికి మరింత నిధులు ఇస్తారని ఆశించారు. అప్పులు, పంట నష్టాల నుండి ఉపశమనం, యథేచ్ఛగా తిరిగే జంతువుల నుండి రక్షణ, పంట బీమా మొదలైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వుండింది. కానీ ఇవేవీ అంటుకోలేదు “అని అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. గత 3 ఏళ్లలో రైతులు నష్టాలు పాలవగా ప్రయివేటు కంపెనీలు పంట బీమా నుండి 18830 కోట్లు సంపాదించాయి .
రైతు స్వరాజ్య వేదిక నాయకులు కేంద్ర ప్రభుత్వాన్నితీవ్రంగా విమర్శిస్తూ “ఇది చాలా నిరాశాజనకంగా వుంది. ఈ దేశ రైతాంగానికి ఎటువంటి చోటు లేని బడ్జెట్ ఇది. ప్రభుత్వానికి కంపెనీలే గాని రైతుల సమస్యల గురించి పట్టదు అని మోడీ ప్రభుత్వం మరొక సారి ప్రకటించింది,” అని అన్నారు.