సేంద్రియ పద్దతిలో టమాట సాగు
వాతావరణం:
టమాట శీతాకాలపు పంట. కానీ సమశీతోష్ణ మండలాలలో బాగా పండుతుంది. మంచును అసలు తట్టుకోలేదు. విత్తనం 18.500C నుండి 240C లో బాగా మొలకెత్తుతుంది. కాయ 150C నుండి 320C వరకు బాగా పండుతుంది. టమాట ఎక్కువ ఉష్ణోగ్రతను గానీ, ఎక్కువ వర్షపాతమును గానీ తట్టుకోలేదు.
నేలలు:
టమాటను యిసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల వరకు వివిధ రకాలైన నేలల్లో సాగుచేయవచ్చు. అధిక దిగుబడికి నీరు బాగా ఇంకే బరువైన గరప నేలలు శ్రేష్ఠం. వర్షాకాల ప్రారంభంలో తెలంగాణలోని తేలిక పాటి నేలలలో వర్షాధార పంటగా కూడా సాగుచేయవచ్చు. ఉదజని సూచిక 6.0 నుండి 7.0 గల సారవంతమైన నేలలు చాలా అనుకూలం.
టమాటలో మంచి విత్తనాలు
రకం పేరు: అర్క వికాస్
పంట కాలం: 105-110 రోజులు (ఖరీఫ్)
దిగుబడి: 140-160 క్వింటాళ్ళు / ఎకరానికి
- మొక్క కొంత వరకూ దృఢంగా ఉంటుంది.
- 60 రోజులలో పూతకు వస్తుంది.
- పండ్ల పరిమాణం పెద్దగా (80-85 గ్రాములు) ఉంటుంది.
- కాయలు గుండ్రంగా ఉండి చదునుగా ఉంటాయి.
- వేసవికి అనుకూలమైన రకం.
- తాజా కూరగాయగా వాడడానికి అనుకూలమైనది.
- నీటి ఎద్దడిని కొంత వరకు తట్టుకుంటుంది.
రకం పేరు: పూసా రుబీ
పంట కాలం: 130-135 రోజులు (ఖరీఫ్)
దిగుబడి: 120-140 క్వింటాళ్ళు / ఎకరానికి
- మొక్క నిలువుగా ధృఢంగా ఉండి, కొంతవరకు పాకే లక్షణం ఉంటుంది.
- 60-65 రోజులలో పూతకు వస్తుంది.
- పండ్ల పరిమాణం మధ్యస్థంగా ఉండి, ఎరుపు రంగుతో గుండ్రంగా ఉంటాయి.
- కాయలపై లోతైన వరుసలు కలిగి ఉంటాయి.
- మన రాష్ట్రంలో సాగు చేయడానికి అనువైన రకం.
- ముఖ్యంగా వేసవి కాలంలో సాగుచేయడానికి అనువైన రకం.
- నీటి ఎద్దడిని కొంత వరకు తట్టుకుంటుంది.
రకం పేరు: మారుతమ్
పంట కాలం: 135-140 రోజులు (ఖరీఫ్)
దిగుబడి: 120-140 క్వింటాళ్ళు / ఎకరానికి
- మొక్క పొట్టిగా, ధృఢంగా, కొమ్మలు ఎక్కువగా, గుబురు ఆకులు కలిగి ఉంటుంది.
- 60 రోజులలో మొదటి పూతకు వస్తుంది.
- పండ్లు గుండ్రంగా ఉంటాయి.
- కాయలపై లోతైన వరుసలు కలిగి ఉంటాయి.
- మన రాష్ట్రంలో అన్ని కాలాలలోనూ సాగు చేయుటకు అనువైన రకం.
- ముఖ్యంగా వేసవి కాలంలో సాగుచేయడానికి అనువైన రకం.
రకం పేరు: పి.కే.యమ్ – 1
పంట కాలం: 135 రోజులు (ఖరీఫ్), 140 రోజులు (రబీ)
దిగుబడి: 200 క్వింటాళ్ళు / ఎకరానికి
- మొక్క చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఎకరానికి ఎక్కువ మొక్కలు నాటుకోవాలి.
- 50-55 రోజులలో మొదటి పూతకు వస్తుంది.
- మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ సాగు చేయుటకు అనువైన రకం.
- ముఖ్యంగా అన్ని కాలాలలో సాగుచేయుటకు అనువైన రకం.
రకం పేరు: ఎస్-22
పంట కాలం: 105-110 రోజులు (ఖరీఫ్),100 రోజులు (రబీ)
దిగుబడి: 200 క్వింటాళ్ళు / ఎకరానికి
- మొక్కకు ఆకులు తక్కువగా ఉంటాయి. కాయలు తెల్లగా ఉండి, లోతైన గళ్ళు కలిగి ఉంటాయి.
- 50-55 రోజులలో మొదటి పూతకు వస్తుంది.
- అతి తక్కువ వర్షపాత ప్రాంతాలలో సాగు చేయడానికి అనువైన రకం.
- ఎర్ర నేలల్లో సాగు చేయడానికి అనువైన రకం.
- ఖరీఫ్ మరియు రబీ కాలాల్లో సాగుచేయడానికి అనువైన రకం. నీటి వసతి క్రింద కూడా సాగుకు అనువైన రకం.
- పండ్ల నుండి వేరుచేసిన విత్తనాలను నీడలో ఆరబెట్టి 6 నెలల వరకు నిలవ చేసుకొని విత్తుకోవచ్చు.
రకం పేరు: అర్కమేఘాలి
- వర్షాధార సాగుకు అనుకూలం. కాయలు గుండ్రంగా మధ్యస్థ సైజులో ఉంటాయి.
రకం పేరు: పూసా ఎర్లీడ్వార్ఫ్ (పిఇడి)
- తొందరగా కాపుకు వస్తుంది. తొలకరి వర్షాలకు వేసుకోవడానికి అనుకూలం. అధిక వర్షాన్ని తట్టుకోగలిగి 125-130 రోజుల కాలపరిమితితో ఎకరాకు 100-120 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది.
రకం పేరు: రాములక్కాయ
పంట కాలం: 110 రోజులు(ఖరీఫ్)
దిగుబడి: 80 క్వింటాళ్ళు / ఎకరానికి
- మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ, అన్ని కాలాలకూ అనుకూలమైన రకం.
- కాయలు చిన్నగా ఉండి పల్చటి తోలును కలిగి ఉంటాయి.
- కాయలలో గింజలు ఎక్కువగా ఉండి, పులుపుదనం కూడా ఎక్కువగా ఉంటుంది.
- కాయలు చాలా గుండ్రంగా గోళీలవలే ఉంటాయి.
- అన్ని రకాల చీడపీడలను తట్టుకుంటుంది.
- 50-55 రోజులలో మొదటి పూతకు వస్తుంది.
- అతి తక్కువ వర్షపాత ప్రాంతాలలో సాగు చేయుటకు అనువైన రకం.
- ముఖ్యంగా ఎర్ర నేలల్లో సాగు చేయడానికి అనువైన రకం.
విత్తన శుద్ధి:
టమాటను విత్తేముందు, ఆ తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడే తో లేదా బీజరక్షతో విత్తనశుద్ధి చేయాలి.
విత్తన మోతాదు:
సూటి రకాలైతే ఎకరాకు 200 గ్రాముల విత్తనం కావాలి. సంకర జాతి రకాలైతే ఎకరాకు 70 నుండి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది.
నారుమడి తయారీ:
నేలను శుభ్రంగా 3-4 సార్లు నాగలితో దుక్కి దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో 40 కిలోల మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 4 మీ. పొడవు, 1 మీ. వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు కలిగిన నారు మడులను తయారు చేసుకోవాలి. మురుగునీరు పోవడానికి మడికి మడికి మధ్య 50 సెం.మీ. దూరం ఉంచాలి. ఒక ఎకరాకు 10 నారుమడులు సరిపోతాయి. 25-30 రోజుల వయస్సు గల నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.
ఎరువుల యాజమాన్యం:
ఆఖరి దుక్కిలో ఎకరాకు దాదాపు 8-12 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి.
జీవ ఎరువులు:
కొన్ని రకాల సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని (78%) స్థిరీకరించి, మొక్కలకు అందించి భూసారాన్ని పెంపొందిస్తాయి. జీవ ఎరువుల వాడకం వల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గించడమే కాకుండా వాతావరణ కాలుష్యం తగ్గించవచ్చు.
ఎకరాకు 2 కిలోల అజటోబాక్టర్ను 50 కిలోల పశువుల ఎరువులో కలిపి, నీళ్ళు చల్లుతూ 7-10 రోజులు మాగనిచ్చి తర్వాత ఆఖరి దుక్కిలో వేయాలి. దీనితో పాటు ఎకరాకు 2 కిలోలు ఫాస్ఫో బాక్టీరియా (పిఎస్బి)ను పొలం అంతా సమంగా చల్లాలి.
నాటేకాలం:
టమాటను మన రాష్ట్రంలో అన్ని కాలాలలోనూ పండిస్తున్నారు. కానీ రబీ పంటకాలం ముఖ్యమైనది. ఖరీఫ్ పంటను జూన్-జూలై (వర్షాధారపు పంట) మాసాలలోనూ, రబీ పంటను అక్టోబర్ – నవంబర్ మాసాలలోనూ, వేసవి పంటను జనవరి – ఫిబ్రవరి మాసాలలోనూ విత్తుకుని పండిస్తే అధిక దిగుబడులు వస్తాయి. వేసవి కాలంలో ఆలస్యంగా విత్తినపుడు శంఖు మరియు ముడత రోగాలు ఆశించి పంట దిగుబడి చాలా తగ్గిపోతుంది.
ప్రధాన పొలం తయారీ:
భూమిని నాగలితో 3 -4 సార్లు బాగా దుక్కి దున్ని చదును చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8-10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. నేలలో ఎకరానికి 200 కిలోల వేపపిండిని కలపడం ద్వారా నులిపురుగులను, వేరుపురుగును నివారించవచ్చు.
నాటే దూరం:
టమాట పంటను వరుసలలో కానీ లేదా బోదెలలో కానీ నాటుకోవాలి. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ దూరం వుండేలాగా మరియు మొక్కకు మొక్కకు మధ్య 40 సెం.మీ. 45 సెం. మీ దూరం ఉండేలాగా నాటుకోవాలి. వేసవిలో 45 x 30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి.
అంతరకృషి:
- నాటిన 25-30 రోజులలో దంతెను నడిపించిగానీ, చేతితోగానీ కలుపు మొక్కలను తీసివేయాలి. మట్టిని బోదెలకు ఎగదోసి సరిచేయాలి.
- ఆకుల అడుగు భాగాలను గమనిస్తూ, గుడ్ల సముదాయాల్ని, చిన్న పురుగులుండే జల్లెడాకులను (టమాట మరియు ఆముదాలపై) సేకరించి నాశనం చేయాలి.
నీటి యాజమాన్యం:
- భూమిలో తేమను బట్టి 7-10 రోజుల వ్యవధిలో నీరు పెట్టాలి.
- వేసవిలో ప్రతి 5-6 రోజులకు ఒకసారి తడి అవసరం ఉంటుంది.
టమాట సాగులో చేయవలసిన పనులు:
- ఆఖరి దుక్కిలో ఎకరానికి 1-2 క్వింటాళ్ళ వేపపిండి తప్పనిసరిగా వేసుకోవాలి.
- టమాట నారును 2 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో పశువుల పేడ, 1 కిలో మట్టి (గట్టు లేదా పుట్టమట్టి), 10 లీటర్ల నీటిలో కలిపి, ద్రావణంలో నారును 15-20 నిమిషాలు ముంచి నాటుకోవాలి.
- పంట చుట్టూ రక్షక పంటగా జన్న లేదా సజ్జ పంటను రెండు వరుసల్లో సాళ్ళుగా విత్తుకోవాలి.
- ప్రధాన పంటలో మధ్య మధ్యలో ఎకరానికి 50 ఆముదం మరియు బంతి మొక్కలు వేసుకోవాలి. దీనిపై ఆశించిన పురుగులను వెంటనే తొలగించాలి. లేనిచో పురుగులు టమాటకు నష్టం చేస్తాయి.
- కొన్ని రకాలకు కర్రతో ఊతమివ్వాలి.
సస్యరక్షణ
పురుగులు:
కాయతొలుచు పురుగు, పచ్చదోమ, పొగాకు లద్దె పురుగు, తెల్ల దోమ,
తెగుళ్ళు:
నారుకుళ్ళు తెగులు, వడలిపోవు తెగులు, ఆకుమాడు తెగులు, వెర్రికుళ్ళు వైరస్ తెగులు, టమాట మచ్చలు మాడు వైరస్ తెగులు
పురుగుల నివారణ:
- పచ్చపురుగు లేదా పొగాకు లద్దె పురుగు, రెక్కల పురుగుల ఉనికిని వాటి ఉధృతిని అంచనా వేసేందుకు ఎకరాకు 5 లింగాకర్షక బుట్టలను పొలంలో అమర్చాలి.
- పంట మొలకెత్తిన వెంటనే ఎకరానికి 15-20 జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలు అమర్చుకోవాలి. దీని వల్ల తెల్లదోమను అరికట్టవచ్చు.
- పంట నాటిన 30 రోజుల వ్యవధిలో రసం పీల్చే పురుగుల నివారణకు 5 శాతం వేపకషాయం లేదా నీమాస్త్రం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి.
- పచ్చపురుగు మరియు లద్దెపురుగు నివారణకు పచ్చిమిర్చి వెల్లుల్లి లేదా బ్రహ్మాస్త్రం పిచికారీ చేసుకోవాలి.
- పచ్చపురుగు మరియు లద్దె పురుగు నివారణకు వైరస్ ద్రావణాన్ని ఎకరాకు 250 ఎల్.ఇ. 100 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి.
కాయతొలుచు పురుగు నివారణ:
- వేసవిలో లోతుగా దుక్కి చేయాలి. దీనివల్ల నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటపడతాయి. వీటిని పక్షులు ఏరి తింటాయి. కొన్ని ఎండ వేడిమికి చనిపోతాయి. కలుపు మొక్కల విత్తనాలు, శిలీంధ్రాలు ఎండవేడిమికి చనిపోతాయి. వర్షపు నీరు నేలలో బాగా ఇంకుతుంది.
- బంతిని ఎరపంటగా వాడుకోవాలి. ప్రతి 16 టమాటా వరుసలకు రెండు వరుసల బంతిని నాటుకోవాలి. టమాటాను నాటే 20 రోజులముందే బంతిని నాటుకోవాలి. దానివల్ల రెండు పంటలు ఒకేసారి పుష్పించటం వల్ల పురుగులు గుడ్లు పెట్టటానికి టమాట మొక్క కంటే బంతి మొక్కను ఎన్నుకుంటాయి. పురుగు ఉధృతిని తెలుసుకోవడానికి లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున అమర్చాలి.
- గుడ్లు చూసిన వెంటనే ట్రైకోగ్రామ ఖిలోనిస్ పరాన్న జీవిని ఎకరానికి 20,000 చొప్పున పొలములో వదలాలి. ఈ పరాన్నజీవి ”ట్రైకోకార్డుల” రూపంలో దొరుకుతాయి.
- 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి.
- ఎకరానికి 250 ఎల్.ఇ. హెచ్.ఎన్.పి.వి. ద్రావణానికి కొద్దిగా నీలిరంగును కలిపి పిచికారీ చెయ్యాలి. దీనివల్ల పురుగులకు వ్యాధి సోకి చనిపోతాయి.
- పశువులపేడ – మూత్రం ద్రావణాన్ని పంటపై పిచికారి చేయటం వల్ల రెక్కల పురుగులు పంటపై గుడ్లుపెట్టవు, పంటకు వివిధ రకాలైన తెగుళ్ళ నుండి కొంతవరకు రక్షణ లభిస్తుంది. వంటకు కొంత నత్రజని లభిస్తుంది.
- మిరప – వెల్లుల్లి ద్రావణాన్ని పంటపై పిలిచారి చేయటం వల్ల పురుగులను నివారించవచ్చు.
- తప్పనిసరిగా వేసవి దుక్కులు చేయడం వల్ల పచ్చపురుగు మరియు లద్దెపురుగుల బెడద తగ్గుతుంది.
- పచ్చదోమ నివారణకు ఒకసారి పొగాకు కషాయం లేదా 5 శాతం వేపకషాయం లేదా నీమాస్త్రం పిచికారీ చేసుకోవాలి.
తెగుళ్ళ నివారణ:
- నారుకుళ్లు తెగులు నివారణకు నారుమడిలో 5 కిలోల వేపపిండిని వేసుకోవాలి.
- ఎత్తయిన నారుమడి తప్పనిసరిగా తయారు చేసుకోవాలి.
- ఆకుమాడు తెగులు వలన ఆకులు, కాండం మరియ కాయలపైన గోధుమరంగు మచ్చలు ఏర్పడి క్రమేణా మొక్క ఎండిపోతుంది. నివారణకు పులిసిన పుల్లటి మజ్జిగ (6 లీటర్ల మజ్జిగ – 100 లీటర్ల నీటిలో) లేదా పశువులపేడ, మూత్రం, ఇంగువ ద్రావణం లేదా పిచ్చితులసి కషాయం (5 కిలోలు – 100 లీటర్ల నీటిలో) పిచికారీ చేసుకోవాలి.
- వడలు తెగులు (బ్యాక్టీరియల్ విల్ట్) వలన ఆకులు పసుపురంగుకు మారి తొడిమతోసహా రాలిపోతాయి. నివారణకు మొక్క అడుగుభాగంలో 15-20 గ్రాముల వేపపిండి వేసుకోవాలి.
- వెర్రి తెగులు (వైరస్ తెగులు) వలన ఆకులు చిన్నవిగా మారి మొక్క గిడసబారి పోతుంది. ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెల్లదోమ నివారణకు 5 శాతం వేపకషాయం లేదా నీమాస్త్రం పిచికారీ చేసుకోవాలి. వెర్రి తెగులు ఆశించిన మొక్కలను తొలగించి నాశనం చేయాలి.
- టమాట మచ్చలమాడు వైరస్ (స్పాటెడ్ విల్ట్ వైరస్) వలన ఆకులపై పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు గోధుమరంగులోకి మారి ఆకులు ఎండిపోతాయి. మొక్కలు గిడసబారి పోతాయి. ఆకులు చిన్నగామారి ముడుచుకుని పోతాయి. తెగులు నివారణకు ఎకరానికి 6 లీటర్ల పచ్చి ఆవు పాలు 100 లీటర్ల నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి.
పంటకోత:
- నాటిన 65-70 రోజుల నుండి కోతకు వస్తుంది. ఆ తరువాత 45-60 రోజుల వరకు కాయలు వస్తాయి.
- దూర ప్రాంతాలకు పంపే కాయలను పచ్చగా వున్నపుడే కోసుకోవాలి.
- దగ్గర మార్కెట్కు పంపే కాయలు దోరగా వున్నప్పుడే కోసుకోవాలి.
- ప్రొసెసింగ్కు బాగా పండిన పళ్ళను కోయాలి.
పంటకోత అనంతరం జాగ్రత్తలు:
గ్రేడింగ్: కాయలు కోసిన తరువాత సాధారణంగా రైతులు గంపలలో కానీ, బుట్టలలో కానీ గ్రేడింగ్ చేయకుండా అమ్మడం వల్ల తక్కువ ధర పలికి నష్టం వస్తుంది. టమాట కాయలు కాసిన వెంటనే, కాయ పరిమాణాన్ని బట్టి వివిధ గ్రేడులుగా చేయాలి. భారతదేశములో టమాటాను ఈ క్రింది నాలుగు గ్రేడులుగా విభజించారు.
1) సూపర్ ఎ 2) సూపర్ 3) ఫ్యాన్సి 4) వ్యాపార గ్రేడు
ప్యాకింగ్ :
టమాట కాయలను గ్రేడింగు చేసిన తరువాత బుట్టలకు బదులుగా ప్లాస్టిక్ క్రేట్లలోగానీ, ప్లాస్టిక్ సంచులలోగానీ ప్యాక్ చేయాలి. టమాటాలను ప్లాస్టిక్ క్రేట్స్లలో ప్యాక్ చేసినట్లయితే దూర ప్రాంతాలకు రవాణా చేయుటకు అనుకూలంగా ఉంటుంది.
నిల్వ వుంచడం:
టమాట పండ్లను 130 సెంటీ గ్రేడ్లో 90% తేమతో ఎక్కువ రోజులు నిల్వ వుంచవచ్చు.