సేంద్రియ వ్యవసాయంతోనే సురక్షిత ఆహారం
”తిండి కలిగితే కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్”
అన్నాడు మహాకవి గురజాడ..
దేశంలో ఆహార పంటల ఉత్పత్తి పెరిగిందనీ, ప్రభుత్వాల దగ్గర ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయనీ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో కరువు కాటకాలు, ఆహార కొరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దగ్గర బియ్యం బఫర్ స్టాక్ 13.58 మిలియన్ టన్నులు ఉండాల్సి వుండగా, 2019 మార్చ్ 31 నాటికి దేశంలో 26. 39 మిలియన్ టన్నుల బఫర్ స్టాక్ ఉందని సి.ఎ.సి.పి. నివేదిక ప్రకటించింది. మరో వైపు 2018-2019 సంవత్సరంలో 36,700 కోట్ల విలువైన బియ్యాన్ని భారతదేశం ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసింది. ఈ లెక్కలన్నీ పరిశీలిస్తే, దేశంలో ఆహారధాన్యాల కొరత లేదనీ, అందరికీ అందుబాటులో ధాన్యాలు ఉన్నాయి కనుక ఆకలి లేదనీ మనకు అనిపిస్తుంది.
కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం 119 దేశాల పట్టికలో 113వ స్థానంలో ఉంది. శిశు మరణాల రేటు, పిల్లలు బలహీనంగా ఉండడం, ఎదుగుదల ఆగిపోవడం, పోషకాహార లోపం, ఊబకాయం తదితర అంశాలను పరిశీలించి ఇచ్చిన ఈ ర్యాంకింగ్స్‌లో భారతదేశం 100 పాయింట్లకు గాను 31.1 స్కోర్ పొందింది. దేశంలో మహిళలలో కూడా రక్త హీనత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యముగా గ్రామీణ మహిళలలో, ఆదివాసీ మహిళలలో, మధ్యతరగతి కుటుంబాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది. సరిపోయినంత ఆహారం లభించకపోవడం ఒక కారణం అయితే, తీసుకుంటున్న ఆహారంలో కూడా పోషక విలువలు లేకపోవడం మరో ప్రధాన కారణం. దేశంలో ఆహార పంటల ఉత్పత్తి (ముఖ్యంగా గోధుమలు, బియ్యం) పెరిగినా నూనె గింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల, పండ్ల ఉత్పత్తి, ఇంకా మన దేశ అవసరాలకు తగినట్లుగా లేవు. దాని వల్ల వాటికోసం దిగుమతుల మీద ఆధారపడవలసి వస్తున్నది. దేశ ప్రజలలో అత్యధికులకు ఇంకా తగినంత కొనుగోలు శక్తి లేకపోవడం కూడా ఆకలికి ప్రధాన కారణంగా ఉంది.
దేశ ఆహార భద్రతలో ఇదొక పార్శ్వమైతే, మరీ ఆందోళన కలిగించే విషయం ప్రజలు తీసుకుంటున్న ఆహారం సురక్షితమైనది కాకపోవడం. ఆహార ఉత్పత్తిలో, నిల్వలో, ప్రాసెసింగ్‌లో, మార్కెటింగ్‌లో అనుసరిస్తున్న పద్ధతులు ఆహారాన్ని కలుషితం చేస్తున్నాయి. విషపూరితం చేస్తున్నాయి. పర్యావరణాన్ని, మనుషుల, ఇతర జీవజాతుల ఆరోగ్యాలను క్షీణింప చేస్తున్నాయి . వయసు తో సంభంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా, వర్గాలతో సంభంధం లేకుండా, అందరూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. అకాల మృత్యువాత పడుతున్నారు. సహజ వనరులైన నీటి కుంటలు, చెరువులు, అడవులు, మొక్కలు అన్నే విషపూరిత మవుతున్నాయి.
ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోకుండా, ప్రతి దశలోనూ ఉన్న సమస్యలను, లోటుపాట్లను అవగాహన చేసుకోకుండా, ఆహార వినియోగదారులు సురక్షిత ఆహారాన్ని ఆశించడం అత్యాశే అవుతుంది. స్థానికంగా మన చుట్టూ ఉన్న చిన్న వ్యాపారుల నుండి కొనకుండా, సూపర్ మర్కెట్స్ నుండి ఆహారాన్ని కొనుగోలు చేసినంత మాత్రాన ఆహరం సురక్షితమైపోదు. అందమైన ప్యాకెట్లలో ప్యాక్ చేసినంత మాత్రాన సురక్షితమైపోదు. ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసినంత మాత్రాన, ఏసీ స్టోర్స్‌లో కొన్నంత మాత్రాన సురక్షితమైపోదు.
సురక్షిత ఆహారం అందడం అనేది ప్రతి దశ లోనూ ఆహార ఉత్పత్తిదారులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు నిజాయితీతో అన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించి మార్పుకు బాటలు వేయాల్సి వుంటుంది. ఆయా వర్గాల స్వయం ప్రకటనతో పాటు, ప్రభుత్వాల సమగ్రమైన పర్యవేక్షణ ఉంటె తప్ప ఆచరణలో ఇది సాధ్యం కాదు.
పంటలు ఉత్పత్తి చేసే రైతులు, పశు పోషకులు, అటవీ ఉత్పత్తులు సేకరించేవారు, మత్స్యకారులు ప్రధానంగా ఆహార ఉత్పత్తులను సమాజానికి అందిస్తారు. ఈ వర్గాల ప్రజల జీవితాలు అత్యంత దుర్భరంగా వున్నాయి. వారికి ఆదాయాలు అత్యంత తక్కువగా వున్నాయి. ఈ వృత్తులలో ఉన్న వారికి ప్రభుత్వాల నుండి తగినంత సహాయం అందడం లేదు. అందువల్ల ఈ వర్గాలు దశాబ్దాలుగా అత్యంత పేదరికంలో మగ్గిపోతున్నాయి. ఈ స్థితిలో తమ జీవితాలను మరింత మెరుగు పరుచుకోవాలంటే మరింత ఎక్కువ ఉత్పత్తి చేయాలి, మరిన్ని ఎక్కువ ఉత్పత్తులను సేకరించాలి అని ఈ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా మరింత ఆహార ఉత్పత్తులను పెంచి దేశానికి అందించాలని ఈ వర్గాలపై ఒత్తిడి పెంచుతున్నాయి.
ఈ స్థితిలో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ప్రభుత్వ అండదండలతోనే ”మరింత ఉత్పత్తి పెంచడం” లక్ష్యంగా హరిత విప్లవ నమూనాను దేశంపై రుద్దారు. రసాయనాలను, హైబ్రిడ్ విత్థనాలను, ఉత్పత్తిదారులకు అంటగడుతున్నారు. లాభాపేక్షతో విచ్చలవిడిగా రసాయన ఉత్పత్తులను, పర్యావరణానికి హాని చేసే యితర ఉత్పత్తులను రైతులకు, పశుపోషకులకు, మత్స్యకారులకు అంటగడుతున్నారు. నాసిరకం, కల్తీ ఉత్పత్తులను, అత్యధిక ధరలకు అమ్మి లాభాలు గడిస్తున్నారు.
రైతులు, పశుపోషకులు ఈ మాయలో పడి, అధిక ఉత్పత్తుల ఆశలో పడి పంటల, పాల, మాంసం, చేపల ఉత్పత్తిలో వీటిని వినియోగిస్తున్నారు. జన్యుమార్పిడి విత్థనాలను కూడా అదే విధంగా దేశంపై రుద్దారు. రసాయన ఎరువులను, పురుగు విషాలను, కలుపు విషాలను ఆలా గ్రామాలలోకీ, పంట పొలాలలోకీ, పశువుల కొట్టాలలోకీ, చేపల చెరువులలోకీ చేర్చారు.
రైతులనుండి, ఇతర ఉత్పత్తిదారుల నుండి పంటలను, కూరగాయలను, పండ్లను, పాలను, చేపలను కొన్న ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, వ్యాపారులు ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసే క్రమంలో, నిల్వ చేసే క్రమంలో, రైపెనింగ్ చేసే సందర్భంలో మరింత కల్తీ చేస్తున్నారు. మరిన్ని రసాయనాలను వాడుతున్నారు. షెల్ఫ్ లైఫ్ పెంచే పేరున వాడుతున్న రసాయనాలు కూడా అత్యంత ప్రమాదకరమైనవి. తాజాగా కనిపించేందుకు వాడుతున్న రసాయనాలు కూడా విషపూరితమైనవే.
ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. సురక్షిత ఆహారం పొందాలంటే అన్ని దశలలోనూ జాగ్రత్తలు పాటించాలి. అన్ని చోట్లా విష రసాయనాలకు ఆహారాన్ని, ఇతర ఉత్పత్తులను దూరంగా ఉంచాలి. ఖచ్చితమైన, సురక్షితమైన, పర్యావరణ హితమైన పద్ధతులనే వినియోగించాలి.
ఇందులో మొదటిది. పంటల ఉత్పత్తిలో విష రసాయన పూరిత వ్యవసాయ పద్ధతులకు దూరంగా జరిగి, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం.
పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తిలోనూ ఇలాగే సురక్షిత పద్ధతులను అనుసరించడం జరగాలి.
స్థానిక వనరులతో సుస్థిర సేద్యం నినాదంతో 2004 మార్చ్ 4 న ఏర్పడిన సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ.) గత 15 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహా రాష్ట్ర, పంజాబ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలలో క్షేత్ర స్థాయిలో వేలాది మంది రైతులతో కలసి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నది. రసాయన పురుగు విషాలు, రసాయన ఎరువులు వాడకుండా, విషపూరిత కలుపు మందులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతులతో అన్ని రకాల పంటలను ఈ రైతులు ఉత్పత్తి చేస్తున్నారు.
ఇలా ఉత్పత్తి చేస్తున్న రైతులందరూ ప్రతి 5 గ్రామాల మధ్యలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా, సహకార సంఘాలుగా నిర్మాణమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇలా నిర్మాణమైన 20 సహకార సంఘాల భాగస్వామ్యంతో సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపనీ 2014లో ఏర్పడింది. ఈ కంపెనీ రైతుల స్వంత కంపనీ. ఇతరులు ఎవ్వరూ పెట్టుబడులు పెట్టడం కానీ, కంపెనీ యాజమాన్యంలో ఉండడం కానీ జరగదు. ఈ కంపెనీ కి రైతు సహకార సంఘాల ప్రతినిధులు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా ఉంటారు. మార్కెట్ నిర్వహణకు సి.ఇ.ఓ.తో సహా 15 మంది సిబ్బంది ఉంటారు. ఈ కంపెనీ హైదరాబాద్ నగరంలో సహజ ఆహారం పేరుతో 5 రిటైల్ స్టోర్స్‌ను నిర్వహిస్తున్నది. ఒక మొబైల్ స్టోర్ నిర్వహిస్తున్నది. వైజాగ్‌లో ఒక స్టోర్ నిర్వహిస్తున్నది.
ఈ వివరాలన్నీ, ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే ఇప్పటికే వివిధ సంస్థలు ఈ కృషిలో నిమగ్నమై వున్నాయని చెప్పడానికి. అది ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. ప్రభుత్వాలు కూడా ఇప్పుడిప్పుడే రైతులతో కల్సి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి పథకాలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి ప్రక్రియను వినియోగదారులు అర్థం చేసుకుని, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను మరింత ప్రోత్సహించగలిగితే ప్రజలందరికీ సురక్షిత ఆహారం అందుతుంది.
Tag:సురక్షిత ఆహారం