సేంద్రియ ఎరువులు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
గొర్రెల పెంట ఎరువు:
రైతులు వేసవి సమయంలో పొలాలలో పంటలు లేనప్పుడు గొర్రెల మందను పొలాలలో కట్టి వేయడం అనాదిగా వస్తున్న పద్ధతి. ఇది భూసారాన్ని పెంచడానికి ఒక సులువైన పద్ధతి. గొర్రెలు విసర్జించిన పెంట, మూత్రాలలో మొక్కలకు కావలసిన అన్ని పోషక పదార్థాలు కొద్ది శాతంలో లభిస్తాయి. అంతేకాకుండా గొర్రెలు అనేక రకాల ఆకులను తిని విసర్జించడం వలన గొర్రెల పెంట ఎరువు పంటల రోగ నిరోధకశక్తిని పెంచే అవకాశం ఉంది. గొర్రెల మంద పొలం విడిచిన తర్వాత పెంట ఎరువును పొలంలో సమంగా చల్లి చేనును కలియదున్నాలి. దీని వల్ల సత్వర ఫలితాలు లభిస్తాయి.
కోళ్ళ పెంట ఎరువు:
మన రాష్ట్రంలో కోళ్ళ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతోంది. కోళ్ళ పెంట ఎరువులో 1.5 శాతం నత్రజని, 1.5 శాతం భాస్వరం, 0.5-0.8 శాతం పొటాష్ మరియు కొద్ది మోతాదులో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. కోళ్ళ పెంట ఎరువును సేకరించిన తరువాత 30-60 రోజుల వరకూ కుప్పలలో నిల్వ ఉంచి వాడుకోవడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. దీని వలన కోళ్ళ పెంట ఎరువు పోషక విలువలు కూడా పెరుగుతాయి.
గోబర్ గ్యాస్ ప్లాంట్ ఎరువు:
ఇటీవల కాలంలో రైతులు ఇళ్ళ వద్ద గోబర్ గ్యాస్ ప్లాంట్లను ప్రభుత్వ సహాయంతో నెలకొల్పుతున్నారు. దీని నిర్వహణకు పశువుల పేడ అవసరం. ఇందులో వాడే పశువుల పేడ పూర్తిగా వినియోగపడి చిక్కటి ద్రావణం (స్లర్రీ) రూపంలో బయటకు వస్తుంది. దీనిని రైతులు బాగా ఎండబెట్టి పొడి రూపంలో సేంద్రియ ఎరువుగా వాడతారు. దీనిలో 1.5 శాతం నత్రజని, 1.5 శాతం భాస్వరం, 1 శాతం పొటాష్ మరియు సూక్ష్మ పోషక మూల పదార్ధాలు ఉంటాయి. ఈ సేంద్రియ ఎరువును అన్ని పంటలలోనూ, నారుమళ్ళలోనూ మరియు పండ్ల తోటలలోనూ వాడుకోవచ్చు.