సుస్థిర వ్యవసాయ యోధుడు నమ్మాళ్వార్ స్ఫూర్తి చిరకాలం నిలుస్తుంది – ఆశాలత
ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతులే మానవాళి మనుగడకు అత్యవసరమైన మార్గమని గట్టిగా నమ్మి, ప్రచారం చేయటమేగాక, స్వయంగా ఆచరించి చూపిన వుద్యమకారుడు గోవిందస్వామి నమ్మాళ్వార్. ”గడ్డి పరకతో విప్లవం” సాధించవచ్చన్న జపాను తత్వవేత్త, రైతు మసనోబు పుకువోకాతో ఉత్తేజితుడైన నమ్మాళ్వార్త న జీవితంలో దానిని ఆచరించి చూపటానికి కంకణం కట్టుకున్నాడు. 75 ఏళ్ళ వయసులో ఆయన డిసెంబరు 30వ తేదీన చనిపోయే రోజున కూడా తంజావూర్జి ల్లాలో అమెరికన్బ హుళజాతి కంపెనీకి ప్రభుత్వం అనుమతించిన మిథేన్ గ్యాస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒక నిరసనకు ప్రదర్శనకు నాయకత్వం వహించాడు.
ఆయన జీవితమే ప్రధాన స్రవంతి వ్యవసాయంపై ఒక తిరుగుబాటుగా చెప్పుకోవచ్చు. 1938లో తమిళనాడులోని తంజావూర్ జిల్లా ఎలంగాడులో పుట్టిన నమ్మాళ్వార్ 1963లో ఎగ్రికల్చర్ బిఎస్సి చదివి కోవిల్ పట్టిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో వ్యవసాయ అధికారిగా చేరాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుండీ అధికార పరిశోధనా వ్యవస్థతో ఘర్షణ పడ్డాడు. రసాయన ఎరువులు, పురుగు మందులను ప్రోత్సహించటాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. హరిత విప్లవం ప్రవేశపెట్టినప్పుడు ఆయన తిరుగుబాటు పరాకాష్టకు చేరుకుంది. హైబ్రిడ్ విత్తనాలు, వాటితో పాటు ప్యాకేజిగా వాడమని చెప్పే రసాయన ఎరువులు, పురుగు మందులు చిన్న రైతులకు హాని చేస్తాయనీ, వాటిని కొనే స్తోమత పేద రైతులకు లేదనీ, అవి భూమిని నాశనం చేస్తాయనీ వాదించాడు. వ్యవసాయ పరిశోధనా దృష్టి కోణంలో మార్పు రావాలనీ పట్టుబట్టాడు. ఆయన అభిప్రాయాలకు వ్యవసాయశాఖలో విలువ ఇవ్వక పోవటంతో ఇక అక్కడ పని చెయ్యలేక 1969లో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి వచ్చాడు.
నోబెల్ బహుమతి గ్రహీత దొమినిక్ పైర్ స్థాపించిన ”ఐలాండ్ పీస్” అనే సంస్థలో వ్యవసాయ శాస్త్రవేత్తగా చేరి, సుస్థిర వ్యవసాయ పద్ధతులలో ప్రయోగాలు చెయ్యటం మొదలు పెట్టాడు. పశువుల పేడ, మూత్రం, శనగపిండి, బెల్లం వంటి వాటితో పంటల పెరుగుదలకు, తెగుళ్ళ నివారణకు దోహదపడే ”జీవామృతం, పంచగవ్య” కషాయాలను తయారు చేసి వుపయోగించటాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. రసాయన ఎరువులంటే భూమిలోని జీవశక్తిని చంపేసే ఉప్పు తప్ప మరేమీ కాదని, రైతులు తమ పొలాల చుట్టూ పరిసరాలలో దొరికే మొక్కలతోనే జీవన ఎరువులు, కీటకనాశని మందులు చేసుకోవచ్చని వాళ్ళకు సులభంగా అర్థమయ్యేటట్లు చేసి చూపించేవాడు. తాను నమ్మిన పద్ధతులను ప్రచారం చేయటానికి దేశం నలుమూలలకూ ప్రయాణించి రైతులకు శిక్షణనిచ్చాడు.
రైతులు తమ పొలంలోకి బయటి నుండి ఏమీ కొనకుండా, గతంలో లాగా తమ విత్తనాలను తామే తయారు చేసుకుని, పశువుల ఎరువుని వేసుకుని మార్కెట్‌పైన ఉత్పాదకాల కోసం ఆధారపడకుండా వ్యవసాయం చేసుకోవచ్చని నమ్మకం కలిగే విధంగా నచ్చచెప్పేవాడు.
మనుషులు, పశువులు, పంటలు – ఈ మూడింటి మధ్య పరస్పర పోషక వ్యవసాయ పద్దతులను విరివిగా ప్రచారం చేశాడు. ఒక పంట పండిస్తే దానిపై భాగం అంటే ధాన్యం మనుషులకు, మధ్య భాగం అంటే గడ్డి లేక చొప్ప పశువులకు, క్రింది భాగం అంటే వేళ్ళు భూమికి బలం చేకూర్చటానికి అనే సూత్రాన్ని బొమ్మవేసి నమ్మాళ్వార్ వివరించటం ఆయన శిక్షణలకు హాజరైన వారెవరూ మర్చిపోలేరు. అలాగే పంట పండిన తర్వాత విత్తనాలను తీసి దాచి వుంచటానికి ఎటువంటి విత్తనాలను తియ్యాలో ప్రాక్టికల్‌గా చేసి చూపించేవాడు. జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి పంటలలో, ంకులలో అటు చివర, ఇటు చివర తీసివేసి మధ్యలో వున్న విత్తనాలనే తీసి జాగ్రత్త చెయ్యాలని చిన్న చిన్న కిటుకులు నేర్పేవాడు.
ఆయన రైతులకు శిక్షణ ఇస్తున్నప్పుడు ఎక్కువగా భూసారం, ఎరువుల వాడకం వంటి ప్రశ్నలే ఎదురయ్యేవి. సంవత్సరాల తరబడి రసాయన ఎరువులు వాడిన భూములలో మళ్ళీ యూరియా లాంటి ఎరువులు వెయ్యకపోతే పంట పండదనీ, పేడ ఎరువు మాత్రమే సరిపోదనీ రైతులు సందేహం వ్యక్తం చేసినప్పుడు నమ్మాళ్వార్ భూసారాన్ని సహజ పద్ధతిలో పెంచటానికి ఒక మార్గం సూచించేవాడు.
వర్షాకాలం ఆరంభంలో భూమిని దున్ని 20 రకాల చిరుధాన్యాల (5 ధాన్యపు రకాలు + 5 పప్పు రకాలు + 5 నూనె గింజల రకాలు + 5 పచ్చిరొట్ట రకాలు) విత్తనాలు కలిపి ఎకరానికి 10 కేజీల చొప్పున వెదజల్లి 45 రోజుల తర్వాత ఆ పంట పూత దశలో వాటిని భూమిలోకి కలియదున్నాలి. అవి కుళ్ళి ఎరువుగా మారిన తర్వాత కావలసిన పంట వేసుకుంటే భూమి గుల్లబారి, భూసారం పెరిగి దిగుబడి వస్తుంది. ఒక మూడు నెలల పాటు భూమికి విరామం ఇచ్చి ఈ పద్ధతిని పాటిస్తే భూమిలోశారగుణం తగ్గి సారం పెరుగుతుందని రైతులకు నమ్మాళ్వార్ నచ్చచెప్పేవాడు.
ఈ విధంగా అనేక రకాలుగా చిన్న రైతులు సులభంగా స్వయంగా చేసుకోగలిగిన పద్ధతులను శిక్షణల ద్వారా ప్రచారం చేశాడు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రైతులకు శిక్షణ అవసరమని అడిగితే కాదనకుండా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఎంత దూరమైనా ప్రయాణించి శిక్షణలు ఇచ్చేవాడు. కేవలం మాటల ద్వారా సిద్ధాంతాలు చెప్పటం కాక రైతుల పొలాలలో చేసి చూపించేవాడు. నమ్మాళ్వార్ తన ప్రచార ఉద్యమంతో ఎంతో మంది రైతులను, యువకులను సుస్థిర వ్యవసాయం చేసేటట్లు ప్రభావితం చేశాడు. భారతదేశంలో అనేక సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించే సంస్థలకు, సేంద్రియ రైతు సంఘాలకు, ఉద్యమాలకు ఉత్తేజంగా, వెన్నుదన్నుగా నిలిచాడు.
2008లో నమ్మాళ్వార్ తంజావూరు సమీపంలో 70 ఎకరాల (ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన) భూమిలో ”వనగం” అనే సుస్థిర వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపించి దానినే రైతుల శిక్షణా కేంద్రంగా మలిచాడు. ఆ క్షేత్రంలో అన్ని రకాల పంటలను, చెట్లను, పెంచుతూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ ప్రకృతి సహజమైన వ్యవసాయమంటే ఏమిటో చేసి చూపించాడు. దూరప్రాంతాల నుండి రైతులు ఆ క్షేత్రానికి తీర్థయాత్రలకు వెళ్ళినట్లు వెళ్ళి స్వయంగా చూసి నేర్చుకునేవారు.
దేశంలో 2002లో బీటీ పత్తిని ప్రవేశపెట్టినప్పుడు జన్యు మార్పిడి పంటలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. బీటీ వంకాయ ప్రవేశపెట్టటానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు స్వయంగా అనేక నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించాడు. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు కంపెనీలతో కుమ్మకై జన్యుమార్పిడి పంటలకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినప్పుడు వాటిని తీవ్రంగా విమర్శించి బహిర్గతం చేశాడు.
రైతులకు, భూమికి, పర్యావరణానికి నష్టం కలిగించే వ్యవసాయ విధానాలను, పద్దతులను ఆయన జాతీయ, అంతర్జాతీయ వేదికలపైన, సదస్సులలో తీవ్రంగా వ్యతిరేకించాడు.
ఆయన వ్యక్తిగా పసిపిల్లవాడి మనస్థత్వం గల ఒక కవి, కథకుడు, హాస్య ప్రియుడు. తన శిక్షణలలో రైతులకు యువకులకు పాటలు, కథలు, జోక్స్ ద్వారా ఉత్సాహపరుస్తూ విషయాలను ఆసక్తికరంగా వివరించే వాడు. అయితే సిద్ధాంతం విషయంలో దృఢంగా ఉండేవారు. ఆయనను ఎరిగినవారందరూ ఆప్యాయంగా ”ఆయ్యా” అని పిలిచేవారు. అందుకే ఆయన మరణించాడని తెలిసి ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన నుండి శిక్షణలు పొందిన వారు సుస్థిర వ్యవసాయ సేనానిని, ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్లు భావించారు.
నమ్మాళ్వార్ ఆయ్యకి జోహార్లు!