సస్యరక్షణలో వృక్షసంబంధ కషాయాల తయారీ మరియు వినియోగంలో కొన్ని సూచనలు
పంటల సమగ్ర సస్యరక్షణలో వృక్షసంబంధ రసాయనాల ద్వారా, తక్కువ ఖర్చుతో, సహజ వనరులను వినియోగించి, వాతావరణ కాలుష్యం లేకుండా, చీడపీడలను అదుపుచేయవచ్చును. అందుబాటులో ఉన్న వివిధ ఆచరణ సాధ్యమైన ఎన్పిఎం పద్ధతులను ఉపయోగించి, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే సహజ సస్యరక్షణ పద్ధతులను అవలంభించి, అవసరమైనపుడు వివిధ సస్యరక్షణ కషాయాలనుపయోగించి ఇప్పటికే రైతులు అనేక పంటలలో సత్పలితాలు పొందుతున్నారు. ఆచరణ యోగ్యమైన ఎన్పిఎం పద్ధతులను ప్రతి యేటా ఉపయోగిస్తూ, క్రమేణా ‘‘కషాయాల’’ వినియోగాన్ని కూడా క్రమబద్ధం చేసిన ‘రైతు అనుభవాలు’ ఖమ్మం జిల్లా, పాల్వంచ మండలం, పునుకుల గ్రామంలో కానవస్తున్నాయి. వివిధ పంటలలో ఉపయోగించే సస్యరక్షణ కషాయాల తయారీ మరియు వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలను, సూచనలను ఈ క్రింది పేరాలలో వివరించటం జరిగింది.
1. పొగాకు కషాయం :
- పొగాకు కషాయం తయారు చేసేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
- పొగాకు కషాయం పిచికారి చేయునపుడు వంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
- పంట కాలంలో ఒకసారి మాత్రమే వాడాలి. లేని యెడల రైతుమిత్ర పురుగులు చనిపోయే ప్రమాదం వుంది.
- పొగాకులో ఘాటైన ‘నికోటిన్’ అనే మూలపదార్థం ఉండటం వలన పై జాగ్రత్తలు తీసుకోవాలి.
2. పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణం :
- ఈ ద్రావణం తయారు చేయునపుడు ఒంటికి నూనె రాసుకోవటం అవసరం.
- పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పంటలపై పిచికారి చేయునపుడు ఒంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
- పంట కాలంలో 1-2 సార్లు మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.
- తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
3. పశువుల పేడ – మూత్రం ద్రావణం :
- మిశ్రమాన్ని ప్రతిరోజు కర్రతో బాగా కలియపెట్టాలి.
- తయారైన ద్రావణానికి 150 గ్రా॥ సున్నం కలపాలి.
- పచ్చిమిర్చి, వెల్లుల్లిలో ఘాటైన వంటికి, కంటికి మంటను కలుగజేసే మూలపదార్థాలు ఉండటం వలన పై జాగ్రత్తలు తీసుకోవాలి.
4. వావిలాకు కషాయం :
- వావిలాకు కషాయం తయారు చేసినపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
- తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
- వావిలాకులో ఆవిరి అయ్యే ఘాటైన తైలాలు వుండటం వలన పై జాగ్రత్తలు తీసుకోవాలి.
5. వేప కషాయం :
- వేప కషాయాన్ని తయారు చేసిన వెంటనే పంటపై పిచికారి చేసుకోవాలి. నిల్వ ఉంచరాదు.
- నీడలో బాగా ఎండిన వేప గింజలను మాత్రమే కషాయం తయారు చేయడానికి ఉపయోగించాలి.
- వేప కషాయం తయారీలో సబ్బుపొడికి బదులుగా కుంకుడుకాయలను లేదా శీకాయ పొడిని 500 గ్రాములు వాడాలి.
- వేపలో అజార్డిరిక్టిన్ అనే నీటిలో కరిగే మూలపదార్థం వుంటుంది.
6. వేప నూనె :
- వేపనూనె నీటిలో కరగదు. అందువల్ల 100 గ్రాముల సబ్బుపొడిని ఒక లీటరు నీటిలో ద్రావణంగా చేసి వేపనూనెలో కలపాలి.
- వేపనూనె లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున 100 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకోవాలి.
- సస్యరక్షణ కషాయాల వల్ల లాభాలు :
- సహజ వనరులను ఉపయోగించుకొని రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చును.
- వాతావరణం కాలుష్యం అవ్వదు.
- ఖర్చు తక్కువ.
- పురుగులు తట్టుకొనే శక్తిని అభివృద్ధి చేయవు.
- మిత్రపురుగులకు ఎక్కువ హాని కలగదు.
- అన్ని రకాల పంటలలోనూ, నారుమడులలోను, పండ్ల వృక్షాలలోనూ పురుగుల నియంత్రణకు కషాయాలను వినియోగించవచ్చును.
- కషాయాలు మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంచి, మొక్కలు ఆరోగ్యవంతంగా వుండటానికి దోహదపడతాయి.
ఉ॥ పశువుల పేడ-మూత్రం ద్రావణం
కావున రైతాంగం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ, సహజవనరులను వినియోగించుకొంటూ, తద్వారా దిగుబడులు తగ్గకుండా, నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.