వేసవిలో కూరగాయల సాగు జాగ్రత్తలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో వుండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన కూరగాయలను, వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్దతులను చేపట్టి, ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సక్రమంగా వినియోగించుకుని కూరగాయలసాగుపై ప్రత్యేక శ్రద్దవహిస్తే అధికలాభాలు పొందుతారు.
వేసవిలో నారును నీడ క్రింద పెంచాలి. తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. నారుమళ్ళపై నైలాన్ వల ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్యను అధిగమించవచ్చు. మళ్ళలో మొత్తం విత్తనాన్ని ఒకేసారి విత్తకుండా విడతలుగా విత్తుకోవటం మంచిది. దీని వల్ల ఒక సమయంలో పండించిన కూరగాయ పంట దెబ్బతిన్నా లేదా పంటదిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ ధర పలికితే, ఇంకో సమయంలో విత్తిన పంట నుండి మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది.
పొలంలో అముదం, మొక్కజొన్న లాంటి పంటలను నీడనిచ్చే విధంగా ఉత్తర దక్షిణ దిశలో నాటుకోవాలి. లేదా రైతులు వీలైతే 35 శాతం షేడ్నెట్లను ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రతను తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చు.
వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత ఎక్కువ ఉండేటట్లు చూడాలి.
ఉదా: వర్షాకాలంలో 60I45 సెం.మీ. దూరంలో టమాట నాటుకుంటే, వేసవిలో 45I30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. 2.0I0.5 మీ. దూరంలో బీర విత్తుకోవాలి. వర్షాకాలం పంటకు ఎకరాకు 4 కిలోల బెండ విత్తనం వాడితే, వేసవి పంటకు 6 కిలోల విత్తనం వాడాలి.
వేసవిలో కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరి లాంటి పండ్ల తోటల్లో మొదటి 3-4 సంవత్సరాలు అంతర పంటలుగా బెండ, సొర, బీర, గుమ్మడి, దోస, ఫ్రెంచి చిక్కుడు, గోరుచిక్కుడు వంటి కూరగాయపంటలను సాగుచేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు.
నేలలోని తేమను సంరక్షించే చర్యలు చేపట్టాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు, వాటితోపాటు జీవన ఎరువులను వాడితే మంచి ఫలితం వుంటుంది. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేల గుల్లబారి, తేమను ఎక్కువ రోజులు పట్టివుంచి మొక్కకు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది. పాదుల్లో, రెండు వరుసల మధ్య వరిగడ్డి, వరి ఊక, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు లేదా పచ్చిరొట్ట ఎరువులను నేలపై పరిస్తే నేలలో తేమ సంరక్షించబడి మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో వుండటమేగాక కలుపు పెరుగుదలను అరికడుతుంది.
ఉన్న కొద్దిపాటి నీటిని బిందు (డ్రిప్) లేదా తుంపర్ల (స్ప్రింక్లర్) పద్ధతిలో ఇవ్వటం వల్ల కొద్ది నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయ పంటలను పండించవచ్చు. ఒక ఎకరాకు సరిపడా నీటితో డ్రిప్పు ద్వారా 2 1/2 ఎకరాలలో, తుంపర్ల పద్ధతిలో 1 1/2 – 2 ఎకరాలలో సాగుచేయవచ్చు. నీరు సక్రమంగా ఇవ్వటం వల్ల తుంపర్ల ద్వారా ఎండవేడి తగ్గి మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటలలో ఎండ తీవ్రత తగ్గించటానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళ నీటిని పిచికారీ చేయాలి. టమాటలోనూ, పుచ్చలోనూ నీటి యాజమాన్యం సరిగా లేకపోతే కాయపగుళ్ళు కనబడతాయి. కాయగూరలను, ఆకుకూరలను, చల్లటి పూట కోసి, తడిగోనె సంచి కప్పి మార్కెట్‌కి పంపాలి.