విషపూరితం కాని పద్ధతులేవైనా ఆమోదయోగ్యమే
అత్యధిక ఇంధనాలను వాడి ఫ్యాక్టరీలలో తయారు చేసే రసాయన ఎరువులు, విష పూరిత రసాయన కీటక నాశనులు ఇప్పటికే పర్యావరణంపై, అన్ని జీవ జాతుల ఆరోగ్యంపై చూపిస్తున్న దుష్ప్రభావాలను మనం అనుభవిస్తున్నాం. రసాయన ఎరువులను రైతులకు అందించడానికి దేశ బడ్జెట్లో అత్యధిక నిధులను కేటాయించడాన్ని కూడా మనం చూస్తున్నాం. పైగా ఈ రసాయన ఎరువుల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండడం, రైతులపై భారాన్ని మోపడం, సకాలంలో ఎరువులు అంధక ,రైతులు రోడ్లపై ఆందోళనలు చేయడం కూడా గమనిస్తున్నాం. కీటక నాశనులు, కలుపు మందుల పేరుతో విచ్చలవిడిగా విషం వెదజల్లడం కూడా అందరికీ అనుభవమే.
ఈ నేపధ్యంలో విష పూరిత రసాయన ఎరువులు, కీటక నాశనులను వదిలించుకోవడం తక్షణం జరగాల్సిన పని. ప్రపంచవ్యాపితంగా ఈ కార్యక్రమంలో అనేక మంది వ్యక్తులు, అనేక సంస్థలు, కొన్ని చోట్ల ప్రభుత్వాలు కూడా నిమగ్నమై ఉన్నారు. తమకు తోచిన పద్ధతులలో విషాలను వదిలించుకునే, ప్రత్యామ్నాయ పద్ధతులను ముందుకు తెస్తున్నారు. వాటికి అనేక పేర్లు కూడా పెడుతున్నారు. తమ ప్రాంతాలలో రైతుల అనుభవాలు, తమకు అందుబాటులో ఉన్న సహజ వనరులు, తమ ఆర్ధిక స్థోమత ఆధారంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ప్రయోగ దశ దాటి క్షేత్రాలలో ఆచరణాత్మక కార్యక్రమాలుగా కూడా మారుతున్నాయి. అటవీ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, పురుగు విషాలు వాడని వ్యవసాయం (ఎన్.పి.ఎం.), సుస్థిర వ్యవసాయం – ఇవన్నీ సాధారణంగా మనకు వినిపించే పేర్లు.
వీటన్నిటిలోనూ రెండు ప్రధాన లక్ష్యాలు సాధారణంగా ఉన్నాయి. 1. విషపూరిత రసాయనాలను వదిలేయడం 2. సేంద్రియ పద్ధతులలో భూసారాన్ని పెంపొందించుకోవడం, పంటలకు నష్టం చేసే వివిధ తెగుళ్లను, కీటకాలను జీవ రసాయనాలతో నివారించడం.
ఈ క్రమంలో కొంత మంది వ్యక్తులు, కొన్ని సంస్థలు వాళ్ళు ప్రచారం చేసే అంశాలను బట్టి ప్రాచుర్యం పొందుతుంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందుతుంటారు. సాధారణంగా రైతులు వాళ్ళు చెప్పే వాటిని అనుసరిస్తుంటారు. ప్రభుత్వాలు కూడా వాటిని స్వీకరించి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంటాయి.
ఆయా స్వచ్చంధ సంస్థలు, వ్యక్తులు, సాధారణ రైతులు తమ పరిధిలో, తమ శక్తి మేరకు చేసే ఇటువంటి ప్రయత్నాలను వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు శిక్షణా కేంద్రాలు, వ్యవసాయ శాస్త్ర వేత్తలు పరిశీలించి, వాటిని లోతుగా అధ్యయనం చేసి, అందులోని శాస్త్రీయ అంశాలను ఒక చోటికి క్రోడీకరించి సరైన జ్ఞానాన్ని రైతులందరికీ అందుబాటులోకి తీసుకు రావాలి. అప్పడు ఎక్కువ మంది రైతులు ఆ పద్ధతులను నేర్చుకోవడానికి అవకాశం వుంటుంది. వ్యవసాయ విశ్వ విద్యాలయం రూపొందించే వ్యవసాయ పంచాంగంలో కూడా వాటిని చేర్చడానికి అవకాశం వుంటుంది. వ్యవసాయ శాఖ రైతులతో పని చేసేటప్పుడు ఈ విషయాలను ప్రచారం చేసి ప్రోత్సహించడానికి వీలవుతుంది. ఎందుకంటే వ్యవసాయ విశ్వ విద్యాలయం, తాను రూపొందించే వ్యవసాయ పంచాంగంలో వీటిని చేరిస్తే తప్ప, వ్యవసాయ శాఖ వాటిని రైతులలో ప్రచారం చేయదు.
కానీ విషాదం ఏమిటంటే, వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, రసాయన ఎరువులను, పురుగు విషాలను ప్రోత్సహించినట్లుగా, సేంద్రియ వ్యవసాయంపై స్వయంగా పరిశోధనలు చేయడం లేదు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే సంస్థలతో కల్సి పని చేయడం లేదు. దాని వల్ల సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే భారాన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలపై, వ్యక్తులపై పడుతున్నది. కొన్ని రాష్ట్రాలలో కొంత మంది నిజాయితీ కలిగిన, రైతుల పట్ల బాధ్యత కలిగిన అధికారులు పూనుకుని సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు.
మిగిలిన చోట వ్యవసాయ శాఖలు, విద్యాలయాలు ఈ కృషికి దూరంగానే ఉంటున్నాయి. దాని వల్ల ఎక్కువ మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లడానికి ఆటంకం ఏర్పడుతున్నది. చాలా సందర్భాలలో విష రసాయనాలు అమ్మే కంపనీలు, డీలర్లు డబ్బుల ఆశ చూపి కొంత మంది ఉన్నత స్థాయి వ్యక్తులను, క్షేత్ర స్థాయి అధికారులను లోబరుచుకుని, తమ రసాయన ఎరువులకు, పురుగు విషాలకు మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. తద్వారా, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పర్యావరణాన్ని పాడు చేయడానికి కారణ మవుతున్నారు.
ఆహార వినియోగదారులుగా ప్రజలు, పౌర సమాజం ఈ విషయంలో కూడా జాగరూకులై, వ్యవసాయ శాఖ మీదా, వ్యవసాయ విశ్వ విద్యాలయాల మీదా ఒత్తిడి తెచ్చి, సేంద్రియ వ్యవసాయాన్ని ఆయా సంస్థలు కూడా ప్రోత్సహించేలా చూడగలిగితేనే సురక్షిత ఆహరం అందుతుంది.
ఇక సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే సంస్థల మధ్య కూడా కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భావోద్వేగాలను విడనాడి, వాటిని శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించుకోగలిగితే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. కేవలం మేము చెప్పాము కనుక ఇది సరైంది అనే పిడివాద ధోరణికి ఎవరు గురైనా, అది అంతిమంగా విష రసాయనాల మీద మనం చేసే పోరాటానికి దెబ్బ తగులుతుంది.
రైతులు సాధారణంగా మెరుగైన ఆదాయాన్ని కోరుకుంటారు. తమ పంట ఉత్పత్తి ఖర్చులు తగ్గాలని కోరుకుంటారు. భూసారం పెంచడానికి, సస్యరక్షణకు సరైన, ఖర్చు తక్కువ పరిష్కారాలు లభించాలని కోరుకుంటారు. తమ పంటల దిగుబడులు పడిపోకుండా ఉండాలని కోరుకుంటారు. తాము రోజంతా పడే శ్రమ తగ్గాలని కూడా కోరుకుంటారు.
ఈ కోర్కెలన్నీ న్యాయమైనవి. సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించే సంస్థలు, వ్యక్తులు ఒక్క మంత్ర దండంతో వీటన్నిటినీ పరిష్కరించలేరు. అనేక విధాలుగా, రైతులకు సహకారం అందవలసి ఉంటుంది. రైతుల దగ్గర ఒక్క ఆవు ఉంటే వ్యవసాయంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని ఎవరైనా చెబితే అది మూఢ నమ్మకాలను ప్రోత్సహించడమే. లేదా సేంద్రియ పంటలకు లాభ సాటి ధరలు వస్తే మాత్రమే రైతుల సమస్యలు పరిష్కారమై పోవు. రైతులు ఎదుర్కుంటున్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని విడిగా వెతకాల్సి ఉంటుంది.
చాలా మంది చేతులలో సాగు భూములు లేవు. వాళ్ళు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు.
వాళ్ళు సేంద్రియ వ్యవసాయం వైపు ఎక్కువగా రావడం లేదు. కారణం, సాగుచేసేది వాళ్ళ స్వంత భూమి కాకపోవడం, ఎక్కువ రోజులు అదే భూమి, వాళ్ళ చేతుల్లో ఉంటుందన్న గ్యారంటీ లేకపోవడం, ప్రభుత్వ సబ్సిడీలు లేక భూ సారాన్ని పెంచడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం, మొదట, ఒకటి, రెండు సంవత్సరాలు సేంద్రియ వ్యవసాయం లో కొంత దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉండడం లాంటి కారణాల వల్ల ఈ రైతు సమూహం సేంద్రియ సాగు చేయడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం వ్యవసాయం చేసే రైతులకు సాగు భూమి ఒక హక్కుగా అందడం, లేదా తక్కువ ధరలకు కౌలుకు భూములు లభించడం జరగాలి. ఇది జరగనంత కాలం కౌలు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు రాలేరు.
చాలా మంది దగ్గర పశువులు లేకుండా పోయాయి. పశువులు మేయడానికి మేత, పశువులు తాగడానికి తగినన్ని నీళ్లు లేకుండా పోయాయి. పశువులు మేపడానికి గ్రామాలలో ఉమ్మడి భూములు కూడా లేకుండా పోయాయి. పశువులను మేపుకు రావడానికి కూడా మనుషులు దొరకడం లేదు. ఈ సమస్యలు పరిష్కరించడానికి తగిన ప్రణాళిక లేకపోతే సేంద్రియ వ్యవసాయం కష్టమే అవుతుంది. అడవి, పశు ఆధారిత గ్రామీణ సమాజాన్ని మనం పునరుద్ధరించ డానికి పూనుకోవాలి. ప్రభుత్వం ఆ వైపు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు మేకలను, గొర్రెలను ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఇవి కూడా అవే సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గ్రామాలలో చెట్లు నాటడం, మేత అందుబాటులో ఉండడం, వేసవిలో పశువులకు తగినన్ని నీళ్లు అందుబాటులో ఉండడం తదిత సహాయం అందించగలిగితే సమస్య పరిష్కారమవుతుంది.
పశువుల విషయానికి వస్తే ఆవులు, గేదెలు, ఎడ్లు, దున్నపోతులు, మేకలు, గొర్రెలు, పందులు, ఇళ్ళ దగ్గర కోళ్లు – ఏవైనా సేంద్రియ వ్యవసాయానికి కావలసిన మూత్రం, పేడ ద్వారా తగిన పోషకాలను సేంద్రియ వ్యవసాయానికి అందిస్తాయి. ఫారం కోళ్లకు యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు కనుక, వాటి పెంటను సేంద్రియ పెంటగా పంట పొలాలకు అందించకుండా ఉంటేనే మంచిది.
ఆవు లేకపోతే ప్రకృతి వ్యవసాయం చేయలేము అనే అభిప్రాయం కొంత మందికి ఉంది. కానీ గేదె, ఆవు తదితర పశువుల పేడ, మూత్రంతో చేసిన జీవామృతం, పంచగవ్య, అమృత జలం లాంటి పోషక ద్రవ ఎరువులలో భూసారాన్ని పెంచే సూక్ష్మ జీవుల సంఖ్యలో పెద్ద తేడా లేదు (సి.ఎస్.ఎ. అధ్యయనం). అందువల్ల ఏ పశువు ఆ రైతుకు అందుబాటులో ఉంటే ఆ పశువు మూత్రాన్ని, పేడను వాడుకోవచ్చు. కాకపోతే పశువులు కొనుక్కునే వాళ్ళు వర్షాధార ప్రాంతాలలో ఆవును కొనుక్కోవడం మేలు. కారణం ఆవు చర్మం మందంగా ఉండి ఎండను తట్టుకుంటాయి. గేదె చర్మం పలచగా ఉండి ఎండను తట్టుకోలేక, నీళ్ళలో, బురదలో ఉండడానికి ప్రయత్నిస్తాయి. కానీ వర్షాధార ప్రాంతాలలో నీటి కొరత ఉంటుంది కాబట్టి, గేదె కంటే ఆవును పోషించుకోవడం సులభం. ఈ విషయాలు ఏవీ చెప్పకుండా, కేవలం ఆవుకు ఒక పవిత్రత ఆపాదించి, మిగిలిన పశువులను తిరస్కరించడం భావ్యం కాదు. పశువులకు మనం ఏ ఆహారాన్ని అందిస్తున్నామన్న దానిని బట్టి ద్రవ ఎరువుల సూక్ష్మ జీవుల సంఖ్యలో తేడా వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఘన ఎరువులలో చెరువు మట్టి, వర్మీ కంపోస్ట్, చెరుకు ఫ్యాక్టరీల నుండి వెలువడే ప్రెస్ మడ్, లాంటివి కూడా భూసారం పెంపుదలకు ఉపయోగ పడతాయి. భూసారం పెంచడానికి రైతులు ప్రతి సంవత్సరం కనీసం 4 టన్నుల బయోమాస్‌ను పొలాలకు అందించవలసి ఉంటుంది. ఇది లేకుండా కేవలం ద్రవ ఎరువులతోనే పంటకు పోషకాలు అందుతాయని అనుకోలేము. వర్మీకంపోస్ట్ చేడ్డది కాదు. వర్మీ కంపోస్ట్‌లో మనుషులకు హాని కల్గించే భారలోహాలు ఉండవు. దేశీ, విదేశీ వానపాములు ఏవీ కూడా భారలోహాలను
ఉత్పత్తి చేయవు. కాకపోతే మనం వర్మీ కంపోస్ట్ చేయడానికి ఉపయోగించే మూల పదార్ధంలో భార లోహాలు వుంటే, అవి కంపోస్ట్ ఎరువులోకి వచ్చే అవకాశం వుంది.
ఉదాహరణకు బోయిన్పల్లి మార్కెట్లో అమ్మే కూరగాయలను లాబ్ టెస్ట్ చేయిస్తే అందులో భార లోహాలు ఉన్నట్లు నివేదిక వచ్చింది. అంటే ఆ కూరగాయలను పండించే భూమిలో కానీ, దానికి అందించిన నీటిలో గానీ భార లోహాలు ఉండి ఉంటాయి. ఈ కూరగాయలతో కంపోస్ట్ తయారు చేస్తే, ఆ ఎరువులో భారలోహాలు వస్తాయి. ఆ విషయాన్ని చెప్పకుండా వర్మీ కంపోస్ట్ మంచిది కాదని చెప్పడం అశాస్త్రీయం.
మన భూములు రసాయన ఎరువుల అత్యధిక వినియోగం వల్ల పూర్తిగా గట్టిపడిపోయాయి .రైతులు వాడిన భాస్వరం ఎరువులు భూమిలో ఉన్నా, అవి మొక్కకు అందుబాటులో లేని రూపంలో ఉండిపోయాయి. కాబట్టి జీవన ఎరువులను వాడితే, లేదా పంటల మార్పిడి చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. భూసార యాజమాన్యం సరిగా చేయగలిగితే దిగుబడులు పడిపోతాయనే సమస్య ఉండదు. కాకపోతే రసాయన పంటల భూమి నుండి, సేంద్రియ పంటల భూమికి మారడానికి 3 సంవత్సరాలు పడుతుందని అంటున్నామంటే దానికి కారణం, ఆ భూమిలో విష రసాయనాల అవశేషాలు పోవడానికి అంత సమయం పడుతుందని అర్థం. కొన్ని అవశేషాలు పూర్తిగా ఎప్పటికీ పోకపోవచ్చు. అయితే క్రమంగా తగ్గిపోతాయి.
ఇవన్నీ సాంకేతిక అంశాలుగా కనపడినా, ప్రధానంగా ఇవి భావజాల రంగానికి సంభంధించినవి. వీటి చుట్టూనే వాదనలు జరుగుతున్నాయి. ఈ వాదనలలో ప్రతి ఒక్కరు పట్టించుకోవాలసినది, మత విశ్వాసాలకు, మూడ నమ్మకాలకు దూరంగా ఉండి, వాస్తవాలు, సైన్సు ఆధారంగా నిర్ణయానికి రావడం.
రైతులు పురుగులను, తెగుళ్ళను నియంత్రించే విషయంలో కూడా స్థానిక వనరులపై ఆధార పడడం మంచిది. మన చుట్టూ ఉన్న అనేక రకాల మొక్కలలో కీటక నియంత్రణ, లక్షణాలు ఉన్న మొక్కలు ఉంటాయి. వాటిని ఎంపిక చేసుకుని, ఉపయోగించుకో గలిగితే సస్య రక్షణ పెద్ద కష్టం కాదు. సరిహద్దు పంటలు, అంతర పంటలు వేసుకోవడం, కొన్ని తెగుళ్ళను తట్టుకోగలిగే విత్తనాలను వాడుకోవడం చేయాలి. విష రసాయనాలు మానేయడం సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యమైన అంశం అయినా, అదొక్కటే సరిపోదు, భూసార యాజమాన్యం, సస్య రక్షణ, నీటి యాజమాన్యం, లాంటివన్నీ తగిన సమయంలో చేయాల్సి ఉంటుంది. కొంత మానవ శ్రమ అదనంగా అవసరమవుతుంది. ఈ శ్రమ ఎక్కువగా మహిళలు చేస్తున్నారు. ఒక రకంగా ఇది మహిళలపై అదనపు భారాన్ని మోపిన మాట వాస్తవం. మగ రైతులు కూడా ఈ శ్రమలో భాగస్వాములు కాగలిగితే ఖచ్చితంగా మహిళలకు కొంత వెసులుబాటు, సేంద్రియ వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం లభిస్తాయి.
రసాయన ఎరువులలో పాస్పేట్ ఎరువులకు ఎప్పుడైనా కొరత రావచ్చు. ధరలు మరింత పెరగవచ్చు. కానీ సేంద్రియ వ్యవసాయంతో ఈ కొరత తీరుతుంది. గ్రామంలో చెట్లను, పశువులను ఎప్పుడూ పెంచుకుంటూ పోవచ్చు. మనుషులకు పోషక ఆహారంగా పాలు, పొలాలకు పోషక ఎరువులుగా పేడ, మూత్రం, పుష్కలంగా లభిస్తాయి. పొలాలు సారవంతమవుతాయి. సురక్షిత ఆహరం పండుతుంది. మనుషుల, ఇతర జీవ జాతుల ఆరోగ్యాలు కుదుట పడతాయి.
ఆర్గానిక్ సర్టిఫికేట్ :
సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు తమ పంటలను మార్కెట్ చేసుకోవాలంటే వారి ప్లాట్లకు సర్టిఫికేషన్ ఉండాలి. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నదే అయినా ఎఫ్.ఎస్.ఎస్.ఐ. నియమాల ప్రకారం యిప్పుడు రైతులు తమ పంటలను సేంద్రియ పంటలుగా అమ్ముకోవాలని అంటే ఈ సర్టిఫికేట్ తీసుకోవడం జరగాలి. దీనిలో రెండు పద్ధతులు ఉన్నాయి.
1. ఒకటి దేశ వ్యాపితంగా సేంద్రియ పంటలను పండించే రైతులను వ్యక్తిగతంగా నమోదు చేసుకుని, వారి పొలాలను విజిట్ చేసి, అన్నీ నిర్దేశిత పద్ధతి ప్రకారం జరుగుతున్నాయని అనుకుంటే, వారికి ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. దానికి కొంత రుసుము వసూలు చేస్తారు. మూడు సంవత్సరాల (6 సీజన్లు) రేగ్యులర్ సమీక్ష తరవాత ఈ సర్టిఫికేట్ వస్తుంది.
2. రెండవది – పి.జి.ఎస్. (పార్టిసిపేటరీ గారంటీ సిస్టం) – ఇందులో ఒక గ్రామానికి చెందిన 5 గురు లేదా 10 మంది రైతులు ఒక గ్రూప్‌గా ఏర్పడి-తాము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లుగా ప్రకటించి – ఈ సర్టిఫికేట్ ఇచ్చే సంస్థ దగ్గర తమ గ్రూప్‌ను నమోదు చేసుకోవడం. ఆలా నమోదు చేసుకునే సంస్థలలో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ. ఫోన్- 8500 783300) ఒకటి. ఈ సంస్థ కూడా ఈ ప్రక్రియ కోసం కొంత రుసుము వసూలు చేస్తుంది. సంస్థ తరపున ఒక టీం గ్రూప్ సభ్యుల పొలాలను సందర్శిస్తుంది. గ్రూప్ సభ్యులందరూ సరైన పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని అనుకుంటే ఆ గ్రూప్‌కు ఒకటవ, రెండవ సంవత్సరాలలో పి.జి.ఎస్. గ్రీన్ అని సర్టిఫికేట్ జారీ చేస్తుంది. మూడవ సంవత్సరం కూడా పూర్తయ్యాక పి.జి.ఎస్. ఆర్గానిక్ అనే సర్టిఫికేట్ ఆ గ్రూప్‌కు ఇస్తారు. అప్పుడు ఆ గ్రూప్ సభ్యులు తాము పండించే సేంద్రియ పంటలను ఆర్గానిక్ పేరుతో అమ్ముకోవచ్చు. ఒక వేళ గ్రూప్ సభులు ఎవరైనా ఆర్గానిక్ పద్ధతులను పాటించనట్లు గుర్తిస్తే ఆ గ్రూప్ సర్టిఫికేట్ రద్దు అయిపోతుంది.
రైతులు సేంద్రియ పద్ధతులను పాటించడం, విషాలను వ్యవసాయం నుండి పారదోలడం, పంటల ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడం, మనందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ఒక బాధ్యతగా చేస్తున్నారు. వారికి అండగా నిలబడడం, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులనుండి, గ్రూప్‌ల నుండి, సహకార సంఘాల నుండి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేయడం వినియోగదారులుగా మనందరి బాధ్యత. ప్రభుత్వాలు సేంద్రియ రైతులకు సహాయం చేసే పధకాలను రూపొందించేలా ఒత్తిడి చేయడం కూడా మన బాధ్యత.