“వివిధ పంటలలో సస్యరక్షణ కార్యక్రమాలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం”
అక్టోబర్ చివరి వారంలో కురిసిన వర్షాల వలన బోరు బావులలో నీటి మట్టం పెరిగింది. చెరువులలో నీరు వచ్చి చేరింది. ఫలితంగా ఇంతకు ముందు సంవత్సరం కన్నా ‘రబీ’ పంటల సాగు ఆశాజనకంగా ఉంది. పత్తి మరియు కంది లాంటి దీర్ఘకాలిక పంటలు దాదాపుగా పూర్తి అయినవి. రాష్ట్రంలో రబీలో మొక్కజొన్న, మినుము, వేరుశనగ, సూర్యపువ్వు, కూరగాయలు మొదలగు పంటలు విత్తుకున్నారు. కోస్తా ప్రాంతంలో వరి తరువాత మినుము చల్లుకున్నారు. చాలా వరకు రబీ పంటలు 30-45 రోజులు (శాఖీయ) దశలో ఉన్నవి. మినుము, పెసర పూత దశలో, శనగలు కోతదశలో ఉన్నాయి. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీి, రాత్రి ఉష్ణోగ్రతలు (13-22 డిగ్రీల సెల్సియస్) చాలా తక్కువగా ఉన్నాయి. దీని ప్రభావం విత్తనం మొలకెత్తడం, మొక్క పెరుగుదలపై ఉంటుంది. కావున ఫిబ్రవరి చివరి వారం వరకు విత్తుకోవడానికి అనుకూలమైన ఉష్ణోగ్రత లేదు. ప్రస్తుత వాతావరణం రసం పీల్చే పురుగుల ఉధృతి పెరగడానికి మరియు తెగుళ్ళు సోకడానికి అనుకూలంగా ఉంది. కావున రైతులు రసం పీల్చే పురుగుల యాజమాన్యం చేపట్టాలి.
అన్ని రకాల పంటలలో 3శాతం వేపనూనె లేదా 5 శాతం వావిలాకు కషాయం లేదా 1 శాతం పొగాకు కషాయం పిచికారీ చేయాలి.
ఎకరాకు 10-15 జిగురు డబ్బాలు రైతులు పొలంలో ఏర్పాటు చేసుకోవాలి.
వయ్యారిభామ కలుపు మొక్కలు మిరప, కూరగాయలు, వేరుశనగ పైర్లకి దగ్గర లేకుండా జాగ్రత్త పడాలి.
వేరుశనగ:
ఆకు ముడత పురుగు:
ఆకు ముడత పురుగు ఉనికిని ఆలస్యంగా విత్తిన రబీ వేరుశనగ పంటలో గమనించాం. లేత ఆకుపచ్చగా వుండే చిన్న ముడత పురుగులు మొదట ఆకుల పై పొరలోనికి తొలుచుకుపోయి హరిత పదార్థాన్ని తినివేస్తాయి. తరువాత ప్రక్కనే ఉన్న ఆకులను మడచి వేస్తాయి.
నివారణ:
ఎకరానికి 20 చొప్పున లింగాకర్షక బుట్టలను (డెల్టా ట్రాప్స్) పొలంలో అమర్చాలి. ఒక చిన్న రేగు కంపను వుపయోగించి ఆకు ముడత పురుగు గూళ్ళను విడగొట్టాలి.
పొలంలో ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలను అమర్చాలి.తొలి దశలో పురుగుల నివారణకు 5 శాతం వేప కషాయం (లేదా) నీమాస్త్రం పంటపై పిచికారీ చేయాలి. (అవసరాన్ని బట్టి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పంటపై పిచికారీ చేసుకోవచ్చు.)
5 శాతం వావిలాకు కషాయం వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయటం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. (రైతుల అనుభవం)
వేరుశనగ తొలి పూతదశలో ఎకరాకు 200 కిలోల జిప్సమ్ను మొక్కలకు దగ్గరగా వేసి మట్టిలో కలియునట్లు చేసి ఎగదోయాలి. జిప్సమ్ వేయునపుడు తగినంత తేమ భూమిలో ఉండటం అవసరం. జిప్సమ్ వేసిన పొలాలలో ఆకు ముడత పురుగు ఉధృతి తక్కువగా వుండటం గమనించాం. (రచయిత అనుభవం)
ఆకుమచ్చ తెగులు:
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఆకుమచ్చ తెగులు మరియు కాండం కుళ్ళు వైరస్ తెగులు సోకుటకు అనుకూలం. నివారణ:
ఆకుమచ్చ తెగులుకు పశువుల పేడ + మూత్రం + ఇంగువ కషాయాన్ని పిచికారీ చేయాలి.
కాండం కుళ్ళు వైరస్ తెగులు:
తెగుళ్ళ నివారణకు ముందు జాగ్రత్తగా పంట పొలం మరియు గట్లపై ఉన్న వయ్యారిభామ కలుపు మొక్కలను పీకి పొలానికి దూరంగా వేసి తగులబెట్టాలి.
నివారణ:
నివారణకు తెల్ల జిగురు పూసిన డబ్బాలు లేదా రేకులు ఎకరానికి 5 నుండి 6 డబ్బాలు అమర్చడం వల్ల నివారించవచ్చు.
పొగాకు లద్దె పురుగు గమనించినట్లైతే ఎకరానికి 15-20 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. మరియు ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చాలి. లద్దె పురుగులు ఉన్న జల్లెడ ఆకులను ఏరి వేసి నాశనం చేయాలి.
మిరప:
ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు బూడిద తెగులు సోకుటకు అనుకూలం.
ఆకు ముడత పురుగు లేక తామర పురుగు (త్రిప్స్)
చిన్న పురుగులు (ఢింబకాలు) మరియు పెద్ద పురుగులు లేత ఆకుల కణజాలాన్ని చీల్చి ఆకులలోని రసాన్ని పీల్చడం వలన ఆకులు వంకరలు తిరిగి పైకి ముడుచుకొని పోతాయి. ఇవి ఎక్కువగా ఆశించిన మొక్కలు బూడిద వర్ణమునకు మారతాయి. మొక్కలు గిడసబారి, పూత సరిగ్గా నిలువక పైరుకు ఎక్కువగా నష్టాన్ని కలిగించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. ఆకులపైన వెండి పూత లాంటి పదార్థాన్ని బట్టి పురుగు లక్షణాలను గమనించవచ్చు. ఆకు ముడత పురుగు మిరప పంటను అన్ని దశలలోనూ ఆశిస్తుంది. ఒక్కొక్కసారి ముదురు నారుమడిలో కూడా ఈ పురుగు ఉధృతిని గమనించవచ్చు.
నివారణ:
మిరప పంటకు తరుచుగా అంతర కృషి అవసరం. అంతరకృషి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను పెరికి వేయాలి. కలుపు మొక్కలలో ముఖ్యంగా వయ్యారిభామ, నానబాలు వంటి మొక్కలను పొలం గట్లపైన మరియు పొలంలో లేకుండా చూడాలి. ఈ మొక్కల పువ్వులలో తామరపురుగులు అభివృద్ధి చెందుతాయి.
పొలంలో ఎకరానికి 10-15 తెల్లని బోర్డులను, గ్రీసు లేదా ఆముదం పూసి పెట్టాలి. ఈ బోర్డులకు తామర పురుగులు అతుక్కుని పంటకు నష్టం కలగకుండా కాపాడుకోవచ్చు. ఈ బోర్డులను ఎప్పటికప్పుడు రైతులు గమనిస్తూ, పురుగు ఉధృతిని అంచనా వేసుకుంటూ, బోర్డులను గుడ్డతో తుడిచి, మరలా గ్రీసు లేదా ఆముదం పూయాలి. బోర్డులను పంట ప్రధాన పొలంలో నాటిన నాటి నుండి పంట చివరి వరకు ఉంచాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి.
వీటి నివారణకు 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం లేదా 1 శాతం వేప నూనెను పంటపై వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.
పశువుల పేడ + మూత్రం ద్రావణం లేదా జీవామృతాన్ని ప్రతి నెలా ఒకసారి మిరప పంటపై పిచికారీ చేయాలి.
ముడత తీవ్రత పొలంలో ఎక్కువగా ఉంటే ఒక సారి పొగాకు కషాయం లేదా అగ్ని అస్త్రం పిచికారీ చేసుకోవాలి.
సూచన:
అగ్నిఅస్త్రం లేదా పొగాకు కషాయం పంటపై పిచికారీ చేసిన 5 రోజుల వ్యవధిలో జీవామృతంగానీ, పశువుల పేడ + మూత్రం ద్రావణం గానీ పంటపై పిచికారీ చేస్తే పంట ఆరోగ్య వంతంగా ఉంటుంది. ఈ ద్రావణాలు పంటలకు రోగ నిరోధక శక్తిని కలిగించుటలో సహాయ పడతాయి. తెగుళ్ళ తీవ్రత నుంచి కూడా పంటలను కాపాడతాయి.