విత్తులో విత్తై – పద్మ వంగపల్లి
సాలమ్మ అనే మహిళా రైతు అనంతపురం జిల్లా తలపుల మండలం ఒదుల పల్లి పంచాయితి గొల్ల పల్లి తాండ నివాసి. ఈమె భర్త 15 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఈమెకి 10 మంది సంతానం 4 కుమారులు 6 మంది కూతుర్లు. భర్త చనిపోయిన తరువాత చిన్న కొడుకు దగ్గర, జీవనం కొనసాగిస్తూ వుండేది.
సాలమ్మ నిరంతరం కష్టజీవి. పొలం పనులు చేస్తూ జీవనం గడిపేది. వయస్సు పెరిగే కొద్దీ, బైటి పనులకు వెళ్ళడం ఆపేసింది కానీ సాలమ్మ ఊరికే ఉండలేక, ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని మడులుగా చేసి, టమోటా, వంకాయ, మిరప, కాకర, గోరు చిక్కుడు, సొర మొదలయిన వివిధ కూరగాయలు కొత్తిమీర, తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలు సాగు చేయడం మొదలు పెట్టింది. ఇంటి వద్ద ఉన్న కొంచం నీటిని ఉపయోగిస్తూ కూరగాయలు ఆకుకూరలు సాగు చేయడం ఆమెకు వ్యాపకమే కాదు, ఒక ఆదాయ మార్గం కూడా. సాలమ్మ తను పండించిన కూరగాయలు ఆకు కూరలు తన ఇంట్లో ఉపయోగించగా మిగిలిన వాటిని ఊరిలో వారికీ అమ్ముతూ కొంత డబ్బు సంపాదించుకునేది. అలా వచ్చిన డబ్బుతో మళ్ళీ విత్తనాలను కొని సాగు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. సాలమ్మ విత్తనం బయట నుండి కొనుగోలు చేసేది. అది కొన్ని సార్లు సరిగా మొలకవచ్చేవి కాదు ఇంకా చీడపీడల సమస్య కుడా ఎక్కువగా ఉండేది. అది గమనించిన గ్రామంలోని సుస్థిర వ్యవసాయకేంద్రం సభ్యులు సాలమ్మను కలిసి, తను సాగు చేసిన కురగాయల ద్వారా విత్తనం తయారు చేసుకునే విధానం గురించి తెలియ చేసి ఆమెకి కొంత విత్తనం సాయం చేయడం జరిగింది. చీడపీడల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి చెప్పడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ విధానంలో పెరటి తోటలు సాగు చేసే విధానం గురించి కూడా ఆమెకి పూర్తిగా వివరించి తెలియచేయడం జరిగింది. అప్పటి నుండి సాలమ్మ సుస్థిరవ్యవసాయ కేంద్రం వారి సలహాలను పాటిస్తూ కూరగాయలను సాగు చేస్తోంది. గతంలో కన్నా భిన్నంగా ఇప్పుడు తన విత్తనాలు తానే తయారు చేసుకుంటోంది. ఆరోగ్యకరమైన కూరగాయలు పండిస్తూ, గ్రామస్తులందరికీ వాటిని అమ్ముతూ, గతంలో కన్నా భిన్నంగా మెరుగైన ఆదాయం అందుకుంటోంది.