వావిలాకు
వావిలాకు
వావిలి ఆకులు వైద్య పరంగా ఉపయోగపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. వావిలాకు కషాయం కీటక నాశనిగా ఇటీవల కాలంలో రైతులు వాడుతున్నారు. వావిలాకులలో ఉన్న ”కాస్టిసిన్” అనే రసాయనం క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. వావిలాకులలో ”కాస్టిసిన్’తో పాటు ఇతర ముఖ్యమైన రసాయనాలు (క్రైసోఫినాల్, ఐసోఓరియంటిన్ మొ||) కూడా వున్నాయి. సంస్కృతంలో వావిలిని ”నిర్గుండి” అంటారు. అంటే వ్యాధులనుంచి రక్షణ కల్పించేది అని అర్థం.
వావిలి గుబురుగా పెరిగే (2 -4 మీటర్ల ఎత్తు) చిన్న వృక్షం. ముఖ్యంగా అన్ని రకములైన భూములలో వావిలి తేలికగా పెరుగుతుంది. పూలు తెలుపు లేదా లేత ఊదారంగులో ఉంటాయి. కొమ్మలకు ఆకులు 5 విభాగాలుగా ఉంటాయి. ఆకులు ఘాటైన వాసనతో ఉంటాయి.
5 కిలోల వావిలాకులను 10 లీటర్ల నీటి కుండలో వేసి సుమారు అరగంట వరకు బాగా మరగ కాయాలి. తయారైన ద్రావణం ముదురు బూడిద రంగులో ఉంటుంది. ద్రావణాన్ని ఒక రాత్రంతా (సుమారు 12 గంటలు) బాగా చల్లార్చి, ఒక పలుచని బట్టలో వడకట్టి, దానిలో సుమారు 100 గ్రాముల సబ్బుపొడి వేసి బాగా కలపాలి. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం పొలంలో పంటపై పిచికారీ చేయాలి.
వావిలాకు కషాయం రసం పీల్చే పురుగులైన, పేను బంక, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు మొదలైన వాటిపై మరియు చిన్న చిన్న లార్వాలపైన సమర్ధవంతంగా పనిచేస్తుంది. పంట కాలంలో సుమారు 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. వృక్ష సంబంధ రసాయనాలను (కషాయాలు) పంటలపై సాయంత్రం పూట పిచికారీ చెయ్యటం వల్ల పురుగుల ఉధృతిని సమర్ధవంతంగా అదుపు చెయ్యగల్గుతాం.
Tag:వావిలాకు