వానపాముల ఎరువు (వర్మీకంపోస్టు) – సుస్థిర వ్యవసాయ కేంద్రం
మానవుడు వ్యవసాయం మొదలుపెట్టక ముందు నుంచీ నేల క్రమం తప్పకుండా దున్నబడేది…వానపాములతోనే నేలలో సొరంగాలు చేస్తూ నేలపైని ఆకులు, అలములను నేలలో కలుపుతూ వానపాములు నేలలను గుల్లగా చేస్తాయి. అందువల్ల వర్షం నీరు బాగా ఇంకుతుంది. వేర్లు మరింత లోతుకు చొరబడతాయి. వానపాములు నేలలోని సేంద్రియ పదార్ధాలను తింటూ విసర్జించటం వల్ల వాటి శరీరంలో అనేక రకాలైన సూక్ష్మజీవుల చర్య వల్ల వానపాముల ఎరువుకు మంచి సారం కలుగుతుంది.
అయితే రసాయన ఎరువులు వాడటం వల్ల ఆ రసాయనాల గాఢతకు తట్టుకోలేక వానపాములు చనిపోతున్నాయి. ఇటీవలి కాలంలో వాటి ఉపయోగాన్ని తెలుసుకొని వానపాములను పెంచి ఎరువును తయారుచేస్తున్నారు. అలాంటి రెండు పద్ధతులను ఇక్కడ వివరిస్తున్నాం. ముందు ముందు వానపాములు మన నేలల్లో విస్తృతంగా పెరిగేలా మన నేలలను సంరక్షించుకోవాలి.
వానపాముల ఎరువు తయారీ
(ఎకోసైన్స్ రీసెర్చి ఫౌండేషన్ వారి అనుభవాలు)
కంపోస్టును త్వరగా తయారు చేసుకోవడానికి వానపాములను పెంట కుప్పలలో పెంచాలి. పంట వ్యర్ధాలు/ చెత్త బాగా చివికిన తరువాత వాన పాములు వాటిని త్వరితంగా ఎరువుగా మార్చివేస్తాయి.
కంపోస్టు తయారీలో వేడి దశ పూర్తయి, పెంట పోగు చల్లబడిన తర్వాత వానపాములను విడిచి పెట్టాలి. దీనికి స్వదేశీ వానపాములు వాడటం శ్రేయస్కరం (పెరియోనిక్స్, లాంపిటో వంటివి).
వీటిని ఎత్తు మడి లేదా తొట్టి లేదా కుంటలో పెంచవచ్చు.
1. తొట్టిలో అడుగు పొరగా ఇటుక ముక్కలు, ఇసుక వంటివి వేయాలి.
2. దానిపై మెత్తని మట్టిపరచి 100 వాన పాములను విడిచిపెట్టాలి.
3. తడిగా ఉన్న పశువుల ఎరువు/పేడ అక్కడక్కడ ముద్దలుగా పెట్టాలి.
4. దానిపై చివికిన దిబ్బ ఎరువు 0.7 మీటర్ల ఎత్తు వరకు వేసుకోవాలి.
5. దానిపై గోనె సంచులు పరచి, తడుపుతూ ఉండాలి.
6. చీమలు, ఇతర పరాన్న భుక్కుల నుండి రక్షణ కల్పించాలి.
రెండు టాంకుల పద్ధతి:
ఇది రోజుకు 150-200 గ్రాముల వ్యర్ధాలు ఉత్పత్తయ్యే కుటుంబానికి సరిపోతుంది. ఖాళీలు వదులుతూ అడ్డుగోడ కట్టుకోవాలి.
1. ఇందులో 1 వ ట్యాంకులో పెంట నింపడం మొదలు పెట్టి అది నిండిపోగానే, పాలిధీన్ కాగితాన్ని కప్పాలి. రెండవ ట్యాంకులో చెత్త నింపుతూ పోవాలి.
2. 15-20 రోజుల తర్వాత దీన్ని తొలగించి ఒక రోజు చల్లబడనిచ్చి, 150-200 వాన పాములు వదలాలి. రెండవ ట్యాంకు నిండగానే 15-20 రోజులు పాలిథీన్ కాగితాన్ని కప్పి తీసివేయాలి.
3. వర్మి కంపోస్ట్టు 45-60 రోజుల్లో తయారవుతుంది. రెండవ టాంకులోనికి వానపాములు వలస పోతాయి.
Tag:Telugu, ఎరువు తయారీ