వరిలో వివిధ సాగు పద్ధతులు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
మనరాష్ట్రంలో వరి పంటను కాలువల కింద, చెరువుల కింద, బోరు బావుల కింద పండిస్తున్నారు. 1. నీటి సాగు పద్ధతి (పొలంలో నీరు నిల్వ ఉంచి పండించే పద్ధతి), 2. దమ్ములో విత్తు పద్ధతి, 3. మెట్ట సాగు పద్ధతి, 4. పరిమిత నీటి సాగు పద్ధతి, 5. శ్రీ పద్ధతి లాంటివి రైతులు అలనుసరిస్తున్నారు.
నీటి సాగు పద్ధతి
నీటి సాగు పద్ధతిలో నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి. నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా పెరుగుతుంది. ముదురు ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది.నాటుపైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశముంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్‌లో చ.మీ.కు 33 మూనలు, రబీలో 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ బాటలు తీయటం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని కొంత వరకు అదుపుచేయవచ్చు.
దమ్ములో విత్తు పద్ధతి
దమ్ములో విత్తనం వెదజల్లడం గానీ వరసలలో విత్తడం గానీ చేస్తారు. దీనిని చల్లు పద్ధతి లేదా అలుకుడు పద్ధతి అని అంటారు. ఈ పద్ధతిలో నారుమడి తయారీ, నారు పోయడం, నారు తీయడం, నాట్లు లేకపోవడం వలన శ్రమ, కూలీల ఖర్చు తగ్గుతాయి. నాట్ల పద్ధతిలో కన్నా 10-15 రోజుల ముందుగానే పైరు కోతకు వస్తుంది. సాగు నీరు ఆదా అవడమే కాకుండా పైరు నీటి ఎద్దడికి బాగా తట్టుకుంటుంది.
నేరుగా దమ్ములో వెదజల్లి పండించటానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులు
వివిధ ప్రాంతాల్లో నాటటానికి అనువైన పరి వంగడాలే చాలా వరకు నేరుగా వెదజల్లి పండించటానికి కూడా అనుకూలం. కాండం గట్టిగా ఉండి, పడిపోని రకాలను ఎంపిక చేసుకోవాలి. పొలంలో మురుగునీరు పోవడానికి బోదెలు ఏర్పాటు చేసుకోవాలి. పొలాన్ని 15 రోజుల ముందుగా దమ్ముచేసి తరువాత విత్తడానికి 4 రోజుల ముందు మరొకసారి దమ్ముచేసి సమానంగా చదువుచేసి, మట్టి పేరుకున్న తర్వాత ప్రతి 2 మీ.లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. మొలకెత్తిన విత్తనాన్ని (ముక్కు బయటకు రాగానే), పొలంలో పలుచటి నీటి పొర ఉంచి సమానంగా వెదజల్లాలి లేదా 8 సాళ్ళ పరికరంతో నీరు పూర్తిగా తీసివేసి కూడా విత్తవచ్చు. మొక్కల మొదటి ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు (సుమారు 7-10 రోజుల వరకు) పంటకు ఆరుతడులు అవసరం.
మెట్ట సాగు పద్ధతి
ప్రతి జిల్లాలోనూ వరి పంటను కొద్దోగొప్పో వర్షాధారంతో పండిస్తారు. సాధారణంగా భూసారం తక్కువ, తేలిక నేలల్లో మెట్ట సాగు చేస్తున్నారు. జూన్, జులై నెలల్లో వర్షాలు పడిన వెంటనే నేలను లోతుగా దున్ని బాగా చివికిన పశువుల ఎరువు లేదా కంపోస్టును దుక్కిలో వేయాలి. అఖరిసారిగా దున్ని నేలను సమతలం చేయాలి. మెట్ట సాగులో ఎకరానికి గొర్రుతో విత్తడానికి 35 కిలోలు, వెదజల్లడానికి 40 కిలోల విత్తనం కావాలి. వర్షపు నీరు వీలైనంత ఎక్కువగా నేలలో ఇంకేటట్టు 15 రోజులకొకసారి వరుసల మధ్య అంతరకృషి చేయాలి. కలుపు మొక్కలు ఎక్కువగా రావడం వల్ల దిగుబడి తగ్గిపోకుండా ఉండటానికి సరైన సమయంలో కలుపు యాజమాన్యం చేయాలి. మెట్ట వరి సాగులో స్వల్పకాలిక వంగడాలు వేస్తాం కాబట్టి అవి వర్షాకాలంలోనే కోతకు వస్తాయి.
పరిమితమైన నీటి సాగు పద్ధతి
మొదట మెట్ట సాగు, చెరువుకు నీరు వచ్చిన తర్వాత నీటి సాగుగా వరి పండించే పద్ధతిని పరిమిత నీటి సాగు లేదా మెట్ట-నీటి సాగు అనవచ్చు. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఈశాన్య రుతుపవన ప్రభావం వలన అధిక వర్షం కురిసే ప్రాంతంలో ఈ పద్ధతి అమలులో ఉంది. ఈ రకమైన సాగులో విత్తనాన్ని గొర్రుతో విత్తుతారు. విత్తేటప్పుడు నేల పై పొర 8-10 సెం.మీ. లోతు వరకూ తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేనిచో విత్తనం మొలకెత్తక ఖాళీలు వస్తాయి. వరి విత్తనాలకంటే ముందుగా కలుపు విత్తనాలు వస్తాయి కాబట్టి విత్తన 15 రోజుల నుంచి 15 రోజులకు ఒకసారి వరుసల మధ్య దంతి తోలాలి. వరుసలలో మొక్కల మధ్య కలుపు మొక్కలను తీసివేయాలి.
వరిలో శ్రీ పద్ధతి
‘శ్రీ’ అనేది వరిలో ఒక రకం విత్తనం/ వంగడం కాదు. ఇదొక సాగు పద్ధతి మాత్రమే. ‘శ్రీ’ పద్ధతిలో ఏ వరి రకాన్నైనా సాగు చేయవచ్చు.
వరి మొక్కకు ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకుని ఎక్కువ దిగుబడి నివ్వాలంటే…
- ప్రతీ మొక్కకు పిలకల సంఖ్య ఎక్కువగా ఉండాలి.
- మొత్తం పిలకల్లో వెన్ను వచ్చే పిలకలు ఎక్కువగా ఉండాలి.
- వరి వెన్ను/ కంకి పొడవుగా, ఎక్కువ గింజలతో ఉండాలి.
- గింజ బరువు ఎక్కువగా ఉండాలి.
- వేళ్ళు ఆరోగ్యంగా బాగా విస్తరించి ఉండాలి.
ఎక్కువ దిగుబడి సాధించడానికి శ్రీ పద్ధతిలో దోహదపడే అంశాలు
1. తక్కువ విత్తనం
2. లేత మొక్కలు నాటటం
3. దూర దూరంగా నాటటం
4. తక్కువ నీరు
5 కలుపును నేలలోకి కలిపివేయడం
6 సేంద్రియ ఎరువుల వాడకం
శ్రీ పద్ధతిలో వరి సాగుకు మడులను బాగా చదును చేసి మురుగునీరు లేదా ఎక్కువగా ఉన్న నీరు పోయే కాలువలను తీసుకోవాలి.
శ్రీ పద్ధతిలో వరి సాగుకు భూమిని సేంద్రీయ ఎరువులతో సారవంతం చేయడం వలన మంచి ఫలితాలుంటాయి. సేంద్రియ పదార్థం సూక్ష్మజీవులకు ఆహారం కాబట్టి సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెంది మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలు అందుబాటులోకి తెస్తాయి. కాబట్టి సూక్ష్మజీవులు ఉన్నప్పుడు మొక్కలు ఆరోగ్యంగా పెరిగి చీడ పీడలను తట్టుకుని ఎక్కువ దిగుబడినిస్తాయి. భూసారాన్ని పెంచడం కోసం చెరువు మట్టి వేయడం, పెంట పోగు ఎరువు, వానపాముల ఎరువు, పచ్చిరొట్టపైరు, పశుజీవాలను మందకట్టడం, దభోల్కర్ పద్ధతి, పచ్చి ఆకులను తొక్కడం లాంటివి చేయాలి. పంట వేయుటకు ముందు జీవామృతం, అమృతజలం, పంచగవ్య లాంటి సేంద్రియ ద్రవ ఎరువులను పంట కాలంలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
నారు పెంచడం
శ్రీ పద్ధతిలో 8-15 రోజుల (2 లేదా 3 ఆకుల మొక్క) నారు నాటాలి కాబట్టి నారుమడి తయారీలో, నారు పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎకరా పొలంలో నాటడానికి రెండు కిలోల విత్తనం సరిపోతుంది. దానికి 44 చదరపు గజాల నారుమడి కావాలి. వీలునుబట్టి ఒక పెద్దమడి కానీ లేదా చిన్న మడులుగా కానీ ఎత్తైన నారు మడులు వేసుకోవాలి. నారుమడి చుట్టూ కాలువ తీయాలి.
మొక్క వేరు నేలలోకి తేలికగా చొచ్చుకొనిపోవడానికి పశువుల ఎరువు ఉపయోగపడుతుంది. అంతే గాక కుళ్ళిన ఎరువులో మొక్క పెరిగినప్పుడు రోగ నిరోధక శక్తి పెరిగి తరువాత కూడా మొత్తం పంట ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కొంతమంది రైతులు మ్యాట్ పద్ధతిలో నారుమడి పెంచి లేత నారును ప్రధాన పొలానికి తీసుకుని వెళ్ళడంలో ఉన్న సమస్యను అధిగమిస్తున్నారు.
కొంతమంది రైతులు కలిసి 2-3 నారుమడులు వారం లేదా 10 రోజుల వ్యవధితో వేసుకున్నట్లయితే నారుమడి 8-15 రోజుల మధ్య వచ్చినప్పుడు రైతులు నాటు వేసుకోవటానికి వాతావరణం అనుకూలించక పోయినా, పొలం సిద్ధంగా లేకపోయినా వేరే నారుమడిని వాడుకోగల్గుతారు. శ్రీ పద్ధతిలో కావలసిన విత్తనం, నారుమడికి కావలసిన ప్రదేశం తక్కువ కాబట్టి రైతులు ఈ విధంగా చేయవచ్చు. కొన్ని ప్రాంతాలలో వరిని నేరుగా విత్తే అలవాటు ఉంది. మొక్కకు మొక్కకు దూరం పాటిస్తూ ఈ విధానాన్ని శ్రీ పద్ధతిలోనూ అనుసరించవచ్చు.
ప్రధాన పొలం తయారీ:
ప్రధాన పొలం తయారీలో పొలం దున్నడం, దమ్ము చేయడం లాంటివి మామూలు పద్ధతుల్లానే చేసి పొలం చదునుగా ఉండేటట్లు చేసుకోవాలి. నాట్లు వేసేటప్పుడు నీళ్ళు అసలు ఉండకూడదు. ముఖ్యంగా బరువు నేలల్లో ఎండాకాలంలోనే పొడి దుక్కి దున్ని తయారుచేసుకుని నీరు పెట్టి, నాట్లు వేయడం వల్ల తరువాత వీడర్‌ను తేలికగా నడపవచ్చు. పైపైన దున్ని పొలం బాగు చేయడం వల్ల వీడర్ దిగబడదు. శ్రమ అనిపించదు. మడులు చిన్నగా, చదునుగా ఉంటే నీటి యాజమాన్యానికి అనువుగా ఉంటుంది. నీళ్ళు పెట్టడానికి, తీసేయడానికి అవసరమైతే కాలువలు తయారు చేసుకోవాలి. ఉదా:- చౌడు భూములు
నాట్లు వేయడం
నారుమడిలో విత్తనం మొలకెత్తిన తరువాత రెండు లేదా మూడు ఆకుల దశలో ప్రధాన పొలంలో నాట్లు పెట్టినచో పిలకల సంఖ్య ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. పిలకల గురించి మాట్లాడుతున్నప్పుడు ‘ఫిల్లోక్రాన్’ గురించి అర్థం చేసుకోవాలి. ఫిల్లోక్రాన్ అనేది ఒక ఆకు, వేరు వేయడానికి పట్టే సమయం. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఐదు రోజుల్లో ఒక ఫిల్లోక్రాన్ దశ ముగుస్తుంది. వరి మొక్క శాఖీయ దశ పూర్తిచేసుకుని చిరు పొట్ట తగిలే నాటికి 12 ఫిల్లోక్రాన్ దశలు పూర్తి చేస్తే మంచిది. కొత్త పిల రెండు ఫిల్లోక్రాన్ దశలు పూర్తిచేసుకుంటే అవి కూడా పిలకలు పెట్టడం మొదలుపెడుతుంది. అంటే కొత్త పిలకల సంఖ్య వేగంగా పెరుగుతుంది. సాధారణంగా రైతులు 30 రోజుల వరకు నారుమడిలోనే ఉంచడం వల్ల వరి మొక్క ఈ ఫిల్లోక్రాన్ దశలను కోల్పోయి ప్రధానపొలంలో నాటు పెట్టిన తర్వాత చాలా తక్కువ పిలకలు పెడుతుంది. కాబట్టి వరి మొక్క మూడవ ఆకు దశలలో ఉన్నప్పుడు ప్రధాన పొలంలో నాట్లు పెట్టడం వల్ల ఎక్కువ పిలకలు వస్తాయి.
నారుమడి నుంచి నారును తీసిన తరువాత మొక్కకు ఎటువంటి అదురు, ‘షాక్’ తగులకుండా చూసుకోవాలి. వరి మొక్కను సాధారణంగా రైతులు నాట్లు వేసినప్పుడు మొక్క వేర్లు ‘ఏ’ అక్షర ఆకారంలో తిరుగుతుంది. అంటే వేళ్లు ఆకాశం వైపుకు చూస్తుంటాయి. దీని వల్ల మొక్క వేరు మళ్ళీ కిందకు దిగి, మొక్క నిలదొక్కు కోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వరి మొక్కలను పైపైన, వేళ్ళు ‘ఉ’ అక్షర ఆకారంలో ఉండేలా నాటాలి. ఇలా చేస్తే నారు తొందరగా నిలదొక్కుకుని ఆరోగ్యంగా పెరుగుతుంది. లేత నారు, ఒక్కొక్క మొక్క నాటడం శ్రీ పద్ధతి ప్రత్యేకత. నారు మడిలో నుంచి మొక్కను తీసుకువచ్చి ప్రధాన పొలంలో నాటేటప్పుడు మొక్కకు అదురు, షాక్ తగలకుండా చూసుకోవాలి. శ్రీ పద్ధతిలో నారు మొక్క చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి మందపాటి ఇనుపరేకును మడిలో అడుగు భాగానికి ( 3-4 ఆంగుళాల కిందినుంచి) చొప్పించి నారును మట్టితో పాటు పైకి లేపాలి. నారు పీకిన తరువాత సాధ్యమైనంత త్వరగా (వీలైతే అరగంట లోపల) నాటు వేస్తే మొక్క దెబ్బతినకుండా ఉంటుంది.
లేత నారును రైతులు అనేక కారణాల వల్ల సమయంలో నాట్లు వేయలేకపోవటాన్ని అధిగమించుటకు కొంతమంది రైతులు కలిసి వారం రోజుల వ్యవధిలో 3-4 నారుమడులు పెంచుట వలన ఒక నారుమడిలోని నారును సమయానికి వేయలేనప్పుడు వేరొక నారుమడిలోని నారును వాడుకోవటానికి వీలుంటుంది.
దారులు వదలడం
వరిలో ప్రతి రెండు మీటర్లకు దారులు వదలడం వరిచేలో గాలి బాగా పోసుకోవడానికి, పురుగులు, తెగుళ్ళ ఉధృతి తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే ముందు పొలమంతా నాటువేసి తరువాత రెండు మీటర్లకు ఒక తాడు కట్టి దానికి రెండు పక్కలా మొక్కలను తీసి మధ్యలో నాటుతారు. ఈ దారులు ఇతర అంతర కృషి పనులకు, పరిశీలనకు కూడా బాగా ఉపయోగపడుతుంది.
దూరదూరంగా నాటడం:
శ్రీ పద్ధతిలో వరుసకూ, వరుసకూ మధ్య, మొక్కకూ మొక్కకూ మధ్య కనీసం 10 అంగుళాల ఎడం ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్కొక్క కుదురుకి ఒకటి లేదా రెండు మొక్కలను మాత్రమే పెట్టాలి. మొక్కలను వరుసల్లో పెట్టడం, మొక్కల మధ్య ఎడం కోసం రైతులు చాలా రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఒకతాడుకు కావాల్సిన దూరంలో పుల్లలు కట్టి ఒక వరుస తరువాత ఒక వరుస వేస్తున్నారు. ఇలా కాకుండా 10/10 అంగుళాల దూరంలో నాట్లు వేయడానికి మార్కర్లు కూడా దొరుకుతున్నాయి. చాలా ప్రాంతాలలో రైతులు వారి వారి నేలలకు అనువైనటువంటి చాలా రకాల మార్కర్లు తయారుచేసుకుంటున్నారు.
వరిలో ప్రతీ 2 మీటర్లకు దారులు వదలాలి. శ్రీ పద్ధతిలో మార్కర్‌తో గుర్తులు పెడుతున్నప్పుడు ప్రతీ 8 వరుసలకు 12-14 అంగుళాల దారి వదిలి మళ్ళీ మార్కర్లు లాగాలి. ఈ దారులు నాట్లు వేయడానికి మరియు ఇతర అంతర కృషి పనులకు వీలుగా ఉంటుంది. వరిచేలో గాలి బాగా పోసుకోవడానికి, పురుగులు, తెగుళ్ళ ఉధృతి తగ్గడానికి ఈ దారులు ఉపయోగపడతాయి. గట్లవెంట, దారుల వెంట మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ దారులు కొన్ని సందర్భాల్లో మురుగు నీరు / ఎక్కువైన నీరును తీసేందుకు కూడా ఉపయోగపడుతాయి.
వరి నారును ప్రధాన పొలంలో నాటడానికి ముందు 2 లీటర్ల ఆవుమూత్రం, 1 కిలో పశువుల పేడ, 1 కిలో మట్టి (గట్టు లేదా పుట్టమన్ను) 150 గ్రాముల ఇంగువ, 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. నారును ఆ ద్రావణంలో ముంచి నాటుకోవాలి.
కాలి బాటలు వదలటం
వరిని ఏ పద్ధతిలో పండించినా కనీసం ప్రతి రెండు మీటర్లకు దారులు వదలడం వలన వరిచేలో గాలి బాగా పోసుకోవడానికి పురుగులు, తెగుళ్ళ ఉధృతి తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. గట్ల వెంట, దారుల వెంట మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇతర అంతర కృషి పనుల పరిశీలనకు కూడా ఈ కాలిబాటలు వుపయోగపడతాయి. ముందు పొలం అంతా నాటు వేసిన తర్వాత 2 మీటర్లకు ఒక తాడు కట్టి దానికి రెండు పక్కలా మొక్కలను తీసి మధ్యలో నాటాలి.
నేరుగా విత్తడం
కొన్ని ప్రాంతాలలో వరిని నేరుగా విత్తే అలవాటు ఉంది. ఈ విధానాన్ని శ్రీ పద్ధతిలోనూ ఉపయోగించు కోవచ్చు. శ్రీ పద్థతిలో నాటు వేసేంత దూరంలో నేరుగా విత్తనం వేయవచ్చు. విత్తనానికి మట్టి పట్టించి, పెళ్ళలు (పైల్లెట్స్) చేసి విత్తే ప్రయోగాలు కొన్నిచోట్ల జరుగుతున్నాయి. గొట్టం ద్వారా విత్తనాన్ని కిందకి వదిలే ప్రయోగాలు శ్రమను తగ్గించటానికి ఉపయోగపడతాయి. నాటు నేరుగా విత్తడానికి మాదిరిగానే పొలం తయారు చేసి, మార్కర్లాగి ఉంచుకోవాలి. అంతకు మూడు రోజుల ముందే విత్తనం నానబెట్టి, మండె కట్టాలి. పూసిన విత్తనాన్ని మార్కర్ గీతలు కలిసిన చోట 1-3 వరకు జారవిడవవచ్చు. వెనక ఇంకొక మనిషి సేంద్రియ ఎరువుతో విత్తనాన్ని కప్పుకుంటూ వెళ్ళాలి.
పరికరాల బ్యాంకు
ఖర్చు పరంగా కానీ, అందుబాటు పరంగా కానీ వీడర్లు లేదా మార్కర్ల విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇదొక పరిష్కారం.. ఒక ఊరికో లేదా ఒక రైతు బృందానికో కొన్ని మార్కర్లు, వీడర్లు కలిపి పరికరాల బ్యాంకు ఉంటే, అవసరాన్ని బట్టి వాటిని వాడుకోవచ్చు.