వరిలో విత్తనశుద్ధి
విత్తనశుద్ధి
ఎంపిక చేసిన విత్తనాలను విత్తేందుకు ముందు రకరకాల పద్ధతుల్లో విత్తనశుద్ధి చేసినచో పంటకాలంలో ఆశించే చీడపీడలను చాలావరకూ నివారించవచ్చు.
ఆవు మూత్రంతో విత్తనశుద్ధి:
విత్తనాల్ని ఆవు మూత్రంతో శుద్ధి చేయడం వల్ల మొక్కలలో రోగాలకు తట్టుకునే శక్తి పెరుగుతుంది. మొదట 500 మిల్లీలీటర్ల ఆవు మూత్రాన్ని ఒక పెద్ద పాత్రలో పోసి ఉంచాలి. అందులో 2.5 లీటర్ల నీరు కలపాలి. ఒక పాలు ఆవు మూత్రానికి ఐదు పాళ్ళ నీటి నిష్పత్తిని (1:5) జాగ్రత్తగా పాటించాలి. మోతాదు ఎక్కువైతే మొక్కల పెరుగుదల, ఉత్పాదకత దెబ్బతింటాయి.
విత్తనాన్ని గుడ్డలో మూట కట్టి, మూటను ఆవు మూత్రం ద్రావణంలో సుమారు అరగంటసేపు నాననివ్వాలి. ఆ తరువాత విత్తనాల్ని ఆరబెట్టి, విత్తాలి.
పశువుల పేడ, మూత్రంతో విత్తనశుద్ధి:
2 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో పశువులపేడ, 1 కిలో మట్టి (గుట్ట లేదా పుట్టమట్టి) కలిపి ద్రావణం తయారు చేసుకుని విత్తన శుద్ధి చేసి నీడలో ఒక గంట ఆరబెట్టి నారుమడిలో విత్తుకోవాలి.
వస కషాయం:
పురుగుల, రోగాల బెడదను తగ్గించడానికి విత్తనాల్ని వస కషాయంతో కూడా విత్తనశుద్ధి చేయవచ్చు. దీనికి 500 గ్రాముల వస దుంపల పొడి అవసరం. దీన్ని 2.5 లీటర్ల నీటిలో కలపాలి. ఇది ఒక ఎకరా పొలానికి అవసరమైన విత్తనాలకు సరిపోతుంది. విత్తనాల్ని గుడ్డలో మూట కట్టి, మూటను వస కషాయంలో అరగంట సేపు నాననిచ్చి, ఆ తరువాత ఆరబెట్టి విత్తాలి.
సూడో మోనాస్తో విత్తన శుద్ధి:
సూడోమోనాస్ అనేది ఒక శిలీంద్రం. ఈ జీవి పదార్థం వరిలో చాలా రోగ కారకాలను నిరోధిస్తుంది. వరి విత్తనాల్ని, విత్తే ముందు సూడోమోనాస్తో శుద్ధి చేయవచ్చు. ఒక లీటర్ చల్లార్చిన వరి గంజిలో 250 గ్రాముల సూడోమోనాస్ కలిపి ద్రావణం తయారు చేయాలి. ఒక ఎకరాలో విత్తడానికి తగినన్ని మొలకెత్తిన విత్తనాల్ని నేల మీద పరిచి, వాటి మీద సూడోమోనాస్ – గంజి ద్రావణాన్ని చిలకరించాలి. ద్రావణం విత్తనా లన్నింటికీ పట్టే విధంగా విత్తనాలను కలపాలి. ఆ తరువాత ఆ విత్తనాలు మడిలో విత్తాలి.