వడిసి పట్టిన వాన నీటితో వ్యవసాయం – డా॥ జి.వి. రామాంజనేయులు
వడిసి పట్టిన వాన నీటితో వ్యవసాయం
తరచూ కరువు బారిన పడి పంటలు నష్టపోతున్న రైతులను, తాగటానికి గుక్కెడు నీళ్ళు లేక కిలోమీటర్ల దూరం నడిచి నీళ్ళు నెత్తిన మోసుకొని వచ్చే మహిళను ప్రతి ఎండాకాలం మనం చూస్తుంటాం. అదే సమయంలో వర్షాలు పడినప్పుడు పంటచేలు మునిగిపోయి పంట నష్టపోవటమూ చూస్తున్నాం. వాన కోసం ఋతుపవనాల మీద ఆధార పడిన మన లాంటి దేశంలో వాన పడినప్పుడు నీటిని జాగ్రత్తగా సేకరించి, దాచుకొని, అవసరం అయినప్పుడు వాడుకునే పద్ధతులు చాలా అవసరం. ఎన్నో వందల సంవత్సరాలుగా మన దేశంలో చెరువు, కుంటలు లాంటివి ఇందుకోసం ఏర్పాటు చేసుకొని సమర్ధవంతంగా నడుపు కొంటున్న అనుభవాలు వున్నాయి. అయితే కాల క్రమేపీ బోరు బావులు, ఆనకట్టు, తద్వారా కాల్వ ద్వారా నీళ్ళకు అలవాటు పడటంతో ఇవన్నీకూడా పనికి రాకుండా పోయాయి.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వీటిని మర పునరుద్దరణ చేయాల్సిన అవసరం వుంది. ప్రతి 1 మి.మీ. వర్షపాతానికి హెక్టారుకి సుమారుగా 10,000 లీటర్ల నీరు చేరుతుంది. అంటే 500 మీ.మీ. వర్షం పడే ప్రాంతాలలో కూడా హెక్టారుకి 50 లక్షల లీటర్ల (ఎకరానికి 20 లక్షల లీటర్ల) నీరు చేరుతుంది. ఇందులో భూమిలోకి ఇంకిన భాగం కాక మిగిలింది బయటికి పారి మురికి గుంటలలో కలవటమో, ఆవిరి కావటమో జరుగుతోంది. ఇందులో మూడొంతుల కాపాడుకోగలిగితే ఒక పంట చాలా సులభంగా పండించుకోవచ్చు.
భూమి గట్టి పడిపోవటంతో భూమిలోకి నీరు ఇంకటం తగ్గిపోతుంది. ఇందుకు ప్రధాన కారణాలు
- భూమిలో సేంద్రియ పదార్ధం తగ్గిపోవటం,
- తరచూ ట్రాక్టర్‌తో దున్నటం వలన అడుగున గట్టి పొర (పాన్) ఏర్పడటం
- పంట కోత యంత్రాల బరువుతో నేల గట్టిపడటం.
- రసాయనిక ఎరువులు అధిక వినియోగంతో, వాటిలోని ఫిల్లెర్ మెటీరియల్‌తో భూమిలోని స్మూక్ష రంధ్రాలు, దారులు మూసుకు పోవటం.
వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగం, భారీ యంత్రాల వినియోగం తగ్గించుకోవటం, సేంద్రియ పదార్థాల వినియోగం పెంచుకోవటంతో భూమిలో నీరు ఇంకే గుణం పెంచుకోవచ్చు. అలాగే, ఆధునిక వ్యవసాయంతో పంటల సరళిలో వచ్చిన మార్పులతో ఎక్కువ నీటి వినియోగం వుండే పంటల వైపు, పద్ధతుల వైపు రైతులు మళ్లుతున్నారు. ఉదాహరణకి ప్రస్తుత పద్దతిలో వరి, పత్తి, చెరుకు లాంటి పంటల ఉత్పత్తికి ఎకరానికి సుమారు 60 లక్షల లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన సంవత్సరానికి సుమారుగా 500 మి.మీ. వర్షం పడే ప్రాంతాలలో ఎకరానికి 20 లక్షల లీటర్ల నీరు సంవత్సరానికి వర్షం ద్వారా వస్తుంది అనుకుంటే అందుకు మూడు రెట్లు ఒక పంట కాలంలో మనం ఖర్చు చేస్తున్నాం. అంటే ఒక ఎకరం వరి పండించటానికి ఆ ఎకరం పొలంలో గత మూడు సంవత్సరాలు పడిన వర్షాన్ని ఒకే పంట కాలంలో వాడుకుంటున్నాం, లేకపోతే మూడు ఎకరాలలో పడిన వాన నీటిని ఒక ఎకరంలో పంట పండించుకోవటానికి వాడుకుంటున్నాం. ఇలా ఐదు సంవత్సరాలు రెండు పంటల చొప్పున తీసుకుంటే ముప్పై సంవత్సరాలు వర్షం వాడేసి నట్టే. లేక పోతే చుట్టుపక్కల ముప్పై ఎకరాలు వర్షం వాడేసినట్టే. అందుకే పంట ప్రణాళికలను, పండించే పద్దతులను ఎప్పుడూ స్థానిక వర్షపాతం, భూమి తత్త్వం, వాన నీటి సంరక్షణ ఆధారంగానే చేసుకోవాలి. దీనినే ‘వాటర్ బడ్జెట్’ అంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సగటు వర్ష పాతం తీసుకుంటే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 1,094 మి.మీ., తెలంగాణా జిల్లాలో 961 మి.మీ. అలాగే రాయలసీమ ప్రాంతంలో 680 మి.మీ. ఇందులో చాలా భాగం ప్రతి పొలంలో మనం సంరక్షించుకోవచ్చు.
ఇందుకోసం ప్రధానంగా చేయాల్సింది.
- ఎక్కడ పడిన వర్షం అక్కడే ఇంకటానికి వీలుగా పొలంలో బోదెలుగా చిన్న అడ్డుకట్టు వేసుకోవటం
- పొలంలో పలం వున్న ప్రాంతంలో సుమారు అడుగు వెడ్పల్పు, ఐదు అడుగుల పొడుగు, ఒక ఆడుగు లోతు ట్రెంచ్‌లు చేసుకోవటం.
- సగం నీరు భూమిలో ఇంకుతుంది అనుకుంటే బయటకు పారే నీటిని సంరక్షించుకోవటానికి చిన్ననీటి కుంటలను (ఫారం పాండ్)లను తవ్వుకోవటం.
- పారే నీటిని ఆపుకొని సంరక్షించుకోవటం కోసం అడ్డుకట్టలు కట్టుకోవటం.
- వాలుకు అడ్డంగా దున్నుకోవటం, గట్లు వేసుకోవటం, పక్కనే ట్రెంచ్‌లు చేసుకోవటం.
- భూమిలో సేంద్రియ పదార్థం పెంచుకోవటం కోసం ఎకరానికి కనీసం 4 టన్నుల జీవ పదార్దాలు వేసుకోవటం.
- ఈదురు గాలులు, వేడి గాలులో పెరిగే నీటి ఆవిరిని తగ్గించుకోవటం కోసం పొలంలో గట్ల మీద చెట్లు నాటుకోవటం.
Tag:వాన నీరు