వంగ సాగు పదతులు
వంగ
భారతదేశంలో ప్రాచీనకాలం నుండి పండించబడే కూరగాయలలో వంగ ప్రధానమైంది. ఈ పంటను అన్ని ఋతువులలోనూ పండించవచ్చు. పర్వత ప్రాంతాలలో వంగ పంటను వేసవిలో మాత్రమే పండిస్తారు.
మన దేశంలో రంగు, పరిమాణం, ఆకారాన్ని బట్టి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎన్నో విధాలైన వంగ రకాలు ఆయా ప్రాంతాలలో పండించ బడుతున్నాయి. మనదేశంలో ఒరిస్సా, బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వంగ విస్తారంగా పండించబడుతున్నది.
వాతావరణం:
వంగ ఉష్ణ మండలపు పంట, అధిక ఉష్ణోగ్రతలనూ, నీటి ఎద్దడినీ చాలా వరకు తట్టుకోగలదు. కొండప్రాంతాల్లో, చల్లటి వాతావరణంలో మొక్క పెరుగుదల తగ్గుతుంది. అధిక చలినీ, మంచునూ తట్టుకోలేదు.
నేలలు:
వంగ సాగుకు లోతైన, సారవంతమైన, మురుగు నీరు పోయే సౌకర్యంగల అన్ని రకాల నేలలూ అనుకూలమే. నేల ఉదజని సూచిక 5.5-6.5 ఉండే నేలలు అనుకూలం. బెట్టను మరియు చౌడును కొంత వరకు తట్టుకోగలదు.
వంగలో మంచి రకాలు
రకం పేరు: గులాబి
పంట కాలం: 140-160 రోజులు(ఖరీఫ్), 130 రోజులు (రబీ)
దిగుబడి: 130-140 క్వింటాళ్ళు / ఎకరానికి
- కోస్తా జిల్లాల్లో సాగుకు మిక్కిలి అనువైన రకం. మొక్క నిటారుగా, ఏపుగా పెరిగి కాండం, ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈనెల మొదలు లేత గులాబి రంగులో ఉంటుంది.
- కాయలు మధ్యస్తపు పొడవు (3-4 సెం.మీ) ఉంటాయి.
- కాయలు గుత్తులు, గుత్తులుగా కాసి ఆకర్షణీయమైన గులాబీ రంగుతో నిగనిగ లాడుతూ ఉంటాయి.
- ఈ రకానికి మార్కెట్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది.
- మొదటి కోత 45 రోజులలో మొదలై, దాదాపుగా 10 నుండి 12 కోతలు వస్తుంది.
రకం పేరు: పూసా పర్పుల్లాంగ్
పంట కాలం: 135-140 రోజులు(ఖరీఫ్)
దిగుబడి:120-160 క్వింటాళ్ళు / ఎకరానికి
- కాయలు పొడవుగా (25-30 సెం.మీ) ఉంటాయి.
- మొక్క నిటారుగా, ఏపుగా పెరుగుతుంది. కాండం, ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
- ఆకుల అంచులు కత్తిరించినట్లు ఉండి కొమ్మలు (25 నుండి 30 సెం.మీ) ఊదారంగులో మెరుస్తూ ఉంటాయి.
- కాయలు గుత్తులు, గుత్తులుగా కాసి ఆకర్షణీయమైన ఉదా రంగులో నవ నవ లాడుతూ ఉంటాయి.
- ఈ రకానికి మార్కెట్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది.
- మొదటి కోత 45 రోజులలో మొదలై, దాదాపుగా 10 నుండి 12 కోతలు వస్తుంది.
- ఈ రకం కాయలకు ముళ్ళుండవు.
రకం పేరు: భాగ్యమతి
పంట కాలం: 150-165 రోజులు (ఖరీఫ్), 140 రోజులు (రబీ)
దిగుబడి:120-140 క్వింటాళ్ళు / ఎకరానికి
- మొక్క కొమ్మలు నిలువుగా ఉండి దట్టంగా ఉంటాయి. లేత ఊదా రంగు కొమ్మలపై చివుర్లు కూడా ఊదా రంగులో ఉంటాయి.
- కాయలు ముళ్ళు లేకుండా ఉండి, గుత్తులుగా కాస్తాయి.
- ఒక గుత్తిలో 3-4 కాయలు కాస్తాయి.
- కాయలు ఊదా రంగులో ఉండి, అండాకారంలో ఉంటాయి.
- కాయ తొలుచు పురుగు, వెర్రి తల వేసే వైరస్ తెగుళ్ళను తట్టుకుంటుంది.
- కొంతవరకూ నీటి ఎద్దడిని తట్టుకునే గుణం కూడా ఉంది.
- ఎక్కువ ఎత్తైన ప్రదేశాలలో వర్షాధారం క్రింద సాగు చేయడానికి అనుకూలమైన రకం.
రకం పేరు: గ్రీన్ లాంగ్
పంట కాలం: 150 రోజులు (ఖరీఫ్), 130 రోజులు (రబీ)
దిగుబడి: ఎకరానికి 10 క్వింటాళ్ళు వరకు దిగుబడి వస్తుంది.
- మొక్క నిటారుగా ఉండి కొమ్మలు తక్కువగా ఉంటాయి.
- పువ్వు తెల్లగా ఉంటుంది.
- ఆకులపై నూగు ఎక్కువ.
- ఈ రకం కాయలు సన్నగా పొడవుగా (15-20 సె.మీ) ఉండి లేత ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి.
- ఖరీఫ్‌కు అనుకూలమైన రకం.
- మొదటి కోత 50 రోజులలో మొదలై, దాదాపు 8 నుండి 10 కోతలు వస్తుంది.
- కాయలో గింజల శాతం ఎక్కువ.
రకం పేరు: చమడపాలెం
పంట కాలం: 130 రోజులు (ఖరీఫ్), 120 రోజులు (రబీ)
దిగుబడి: 120 క్వింటాళ్ళు / ఎకరానికి
- దక్షిణ కోస్తా జిల్లాల్లో (నెల్లూరు, ప్రకాశం) సాగుకు అనువైన రకం.
- ఖరీఫ్, రబీ కాలాలలో సాగుకు అనుకూలం.
- కాయలు గుండ్రంగా ఉండి, క్రింది భాగం లావుగా ఉంటుంది.
- కాయలు గుత్తులు, గుత్తులుగా కాస్తాయి.
- కాయలు ఊదా రంగులో ఉంటాయి.
- 45 రోజులలో మొదటి కోత వస్తుంది.
రకం పేరు: శ్యామల
- కాయలు గుండ్రంగా, చిన్నవిగా, ముదురు ఊదా రంగులో నిగనిగలాడుతూ ఉంటాయి.
- పంటకాలం 130-150 రోజులు. మసాలా వంటకాలకు అనువైన రకం.
- ఎకరానికి దిగుబడి 6-6.5 టన్నులు.
రకం పేరు: గ్రీన్ రౌండ్
పంట కాలం: 120 రోజులు (ఖరీఫ్), 110 రోజులు (రబీ)
దిగుబడి: 10 క్వింటాళ్ళు / ఎకరానికి
- మొక్క పొట్టిగా (2-2.5 అడుగులు) ఉంటుంది.
- కొమ్మలు దగ్గర దగ్గరగా ఉండి, లేత ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి.
- కాయలు ఒక్కొక్కటిగా కాస్తాయి.
- కాయ గుండ్రంగా ఉండి తొడిమతో కప్పబడి ఉంటుంది.
- ఈ రకాన్ని మసాలా వంట కాలకు ఎక్కువగా ఉపయోగిస్తారు.
- మొదటి కోత 45 రోజులలో మొదలై, దాదాపుగా 8-10 కోతలు వస్తుంది.
విత్తన శుద్ధి:
వంగను విత్తేముందు, ఆ తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడే తో లేదా బీజరక్షతో విత్తనశుద్ధి చేయాలి.
నారుమడి తయారీ:
4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు కలిగిన నారుమడులను తయారు చేసుకోవాలి. ఒక ఎకరాకు సరిపడా నారును పెంచడానికి ఇలాంటివి 10 నారుమడులు అవసరమవుతాయి. మురుగునీరు పోయేందుకు నారుమడికీి నారుమడికీ మధ్య 50 సెం.మీ. వెడల్పుతో కాలువలు ఏర్పాటు చేయాలి. నారుమడిలో 40 కిలోల పశువుల ఎరువు వేయాలి.
విత్తనాన్ని 5 సెం.మీ. దూరం గల వరుసలలో పలుచగా విత్తాలి. విత్తిన వెంటనే శుభ్రమైన ఎండుగడ్డితో నారుమడిని కప్పాలి. మొలక వచ్చిన వెంటనే జాగ్రత్తగా ఎండుగడ్డిని తీసివేయాలి. దీనివల్ల మొలక త్వరగా వచ్చే అవకాశముంది.
30-35 రోజులలో 15 సెం.మీ. ఎత్తులో, 3-4 ఆకులు కలిగిన నారు నాటడానికి వీలుగా తయారవుతుంది.
కలుపు నివారణ:
విత్తేముందు నారుమడులను నల్లని పాలథీన్ ఫిల్మ్‌తో మల్చింగ్ చేసి చాలా వరకు నారుమడిలో కలుపును నివారించవచ్చు. వేరు పురుగులను, నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళను నివారించవచ్చు.
ఎరువుల యాజమాన్యం:
ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి.
విత్తన మోతాదు:
ఎకరానికి సూటిరకాలైతే 260 గ్రాములు, సంకర రకాలైతే 120 గ్రాముల విత్తనంతో పెంచిన నారు నాటడానికి సరిపోతుంది.
నాటేకాలం:
సాధారణంగా వంగను ఏడాది పొడవునా సాగుచేయవచ్చు. వర్షాకాలం పంటగా జూన్-జులై, శీతాకాలం పంటగా అక్టోబరు-నవంబరు, వేసవి పంటగా ఫిబ్రవరి-మార్చిలో విత్తుకొని నాటుకోవాలి.
ప్రధాన పొలం తయారీ:
పొలాన్ని నాలుగైదు సార్లు దున్ని బాగా చదునుచేయాలి. వర్షాకాలం పంటను బోదెలు, కాలువల పద్దతిలో, వేసవి, శీతాకాలం పంటను చదునైన మళ్ళలో నాటుకోవాలి.
- రకాలను బట్టి బోదెలను 75 సెం.మీ. లేదా 50 సెం.మీ. దూరంలో ఉండేలా తయారు చేసుకోవాలి.
- పొలంలో నాటే ముందు బాగా నీటిని పారించి, 30-35 రోజుల వయస్సు గల నారును బోదెలపై నాటుకోవాలి.
- నాటిన వారం రోజుల లోపు, మొక్కలు చనిపోయిన, ఖాళీగా ఉన్న పాదులలో పై నాటును వేయాలి.
నాటే దూరం:
గుబురుగా పెరిగే రకాలను 75 x 50 సెం.మీ, పొడవుగా నిటారుగా పెరిగే రకాలను 50 x 50 సెం.మీ. ఎడంలో నాటుకోవాలి.
అంతరకృషి:
పైపాటు ఎరువులు వేసే ప్రతిసారీ గొప్పుతవ్వి మొక్కల మొదళ్ళపైకి మట్టిని ఎగదోస్తే పంట బాగా పెరుగుతుంది. 2-3 సార్లు అంతరకృషి చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.
నీటి యాజమాన్యం:
వంగ నారు నాటేముందు లేదా నాటిన తరువాత నీటి తడి ఇవ్వాలి. నేలలో తేమనుబట్టి 7-10 రోజులకొకసారి, అదే వేసవిలో అయితే 4 రోజుల కొకసారి తడిపెట్టాలి. మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో చలిని తట్టుకోవటానికి ఎక్కువసార్లు తడి ఇవ్వాల్సిన అవసరముంటుంది. పూత, కాపు దశలలో ఎప్పుడూ నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే పూత రాలిపోయే ప్రమాదముంది. బరువైన నల్లరేగడి నేలల్లో తప్పనిసరిగా మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి. వేసవిలో కాయకోతకు ఒకటి రెండు రోజుల ముందు తప్పనిసరిగా తడినివ్వాలి. లేదంటే కాయలో చేదు ఎక్కువవుతుంది.
వంగ సాగులో చేయాల్సిన పనులు
- వేసవి దుక్కులు తప్పనిసరిగా చేపట్టాలి. ఖరీఫ్ పంట తర్వాత రబీ కొరకు నేలను లోతుగా దున్ని ఎండ బాగా పడే విధంగా చూసుకోవాలి.
- ఎకరానికి 1-2 క్వింటాళ్ళ వేప పిండి తప్పనిసరిగా వేసుకోవాలి. దీని వల్ల భూమిలో ఉన్న నులిపురుగులు చనిపోతాయి.
- 2 లీటర్ల ఆవు మూత్రం,1 కిలో పశువుల పేడ, 1 కిలో మట్టి (గట్టు లేదా పుట్టమన్ను) 10 లీటర్ల నీటిలో కలిపి వంగ నారును ఆ ద్రావణంలో 15-20 నిముషాల పాటు ముంచి నాటుకోవాలి.
- నారు నాటిన 20 రోజుల తర్వాత జిగురు పూసిన పసుపు మరియు తెలుపురంగు డబ్బాలు ఎకరానికి 10-25 పెట్టాలి.
- అంతర పంటగా బంతి, ఉల్లి, వెల్లుల్లి వేసుకోవాలి.
- ఎకరానికి 20 వేల ట్రైకోగ్రామా బదనికలను విడుదల చేయాలి.
సస్యరక్షణ
పురుగులు
అక్షింతల పురుగు, మొవ్వు మరియు కాయతొలుచు పురుగు, పిండి పురుగు, రసంపీల్చు పురుగులు (పేనుబంక, పచ్చదోమ, ఎర్రనల్లి), నులి పురుగులు వంగ పంటను ఆశిస్తాయి.
తెగుళ్ళు
ఆకుమాడుతెగులు, వెర్రి తెగులు, మోజాయిక్ వైరస్ తెగులు
పురుగుల నివారణ:
- మొవ్వు మరియు కాయతొలుచు పురుగు నివారణకు నీమాస్త్రం లేదా అగ్ని అస్త్రం పిచికారీ చేసుకోవాలి.
- పొలంలో రసంపీల్చేపురుగులు, అక్షింతల పురుగులు, పిండి పురుగుల నివారణ కొరకు ప్రతి 20 రోజులకు ఒకసారి తప్పనిసరిగా 5 శాతం వేప కషాయం (5 కిలోల వేపపిండి, 100 లీటర్ల నీటిలో) పంటకాలంలో సుమారు 5-8 సార్లు పిచికారీ చేసుకోవాలి.
- మొవ్వు మరియు కాయతొలుచు పురుగు నివారణకు మాస్ట్రాపింగ్ (లింగాకర్షక బుట్టలు) ఎకరానికి 40 అమర్చుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలతో ఈ పురుగును సమర్థంగా అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలను పంట నాటిన 30 రోజుల నుండి 150 రోజుల వరకు పొలంలో ఉంచాలి.
- మొవ్వు మరియు కాయతొలుచు పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి ఒక అంగుళం క్రిందకు త్రుంచి నాశనం చేయాలి. అదే విధంగా పురుగు ఆశించి నష్టం చేసిన కాయలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
- నులిపురుగుల (నెమటోడ్స్) నివారణకు పొలంలో ఎకరాకు 100-200 బంతి మొక్కలను పెంచాలి. దుక్కిలో 200 కిలోల వేపపిండి (వేప చెక్క) వేసి కలియ దున్నాలి. నులిపురుగు బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పంట మార్పిడి చేయాలి.
- ఎర్రనల్లి నివారణకు పొగాకు కషాయం లేదా నీమాస్త్రం 1-2 సార్లు పంట కాలంలో పిచికారీ చేసుకోవాలి.
తెగుళ్ళ నివారణ:
- శిలీంధ్ర సంబందిత తెగుళ్ళ నివారణ కొరకు పశువులపేడ, మూత్రం, ఇంగువ ద్రావణం 3-4 సార్లు తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి.
- ఆకుమాడు మరియు కాయకుళ్ళు తెగుళ్ళ నివారణకు పులిసిన పుల్లటి మజ్జిగ (ఆరు లీటర్ల మజ్జిగ వందలీటర్ల నీటిలో) లేదా పశువులపేడ, మూత్రం, ఇంగువ ద్రావణం లేదా పిచ్చితులసి కషాయం (ఐదుకిలోలు వందలీటర్ల నీటిలో) పిచికారీ చేసుకోవాలి.
- వెర్రి తెగులు (వైరస్ వల్ల వస్తుంది). పచ్చదోమ ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపిస్తుంది. పచ్చదోమ నివారణకు జిగురు పూసిన పసుపురంగు డబ్బాలు ఎకరానికి 15-20 పెట్టాలి. లేదా నీమాస్త్రం పిచికారీ చేసుకోవాలి. అధికంగా తెల్ల దోమ ఉన్నప్పుడు పొగాకు కషాయం కూడా ఉపయోగించవచ్చు.