రైతులకు లాభదాయకం – బంతి సాగు
బంతి సాగు
బంతి మన రాష్ట్రంలో వాణిజ్య పరంగా సాగు చేయబడుతూ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. విడి పువ్వులను దండ తయారీకి మరియు వివిధ సామాజిక పరమైన వేడుకలలో అలంకరణ కొరకు వినియోగిస్తారు. బహుళ ప్రయోజనాలు, తేలికైన సాగు విధానంతో పాటు మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉండటం వలన దీనిని సన్న, చిన్నకారు రైతులు సాగు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ.
వాతావరణం:
వాతావరణ పరిస్థితులని బట్టి బంతిని వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలంల్లో సాగు చేసుకోవచ్చు. బంతి 14-28 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద బాగా పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలో మొక్కలు పెరుగుదల తగ్గి తక్కువ పరిమాణం గల పువ్వుల ఉత్పత్తి అయ్యి దిగుబడి తగ్గుతుంది. నీడ ప్రదేశాలు, బంతి సాగుకు అనుకూలం కాదు. దీని వలన మొక్కులు శాఖీయ దశలోనే ఉండి పూలు సరిగ్గా పూయావు.
నేలలు:
బంతి అన్ని నేలల్లో సాగు చేసినప్పటికీ సారవంతమైన గరపనేలలు అత్యంత అనుకూలమైనవి. బరువు నేలల్లో కూడా మురుగు నీటి వసతి ఉన్నప్పుడు బంతిని సాగుచేయవచ్చును. ఉదజని సూచిక 7.0-7.5 మధ్యగల నేలలు అనుకూలమైనవి.
రకాలు :
సాగు చేసే రకాలలో ఆఫ్రికన్ బంతి రకాలు మరియు ఫ్రెంచి బంతి రకాలు ముఖ్యమైనవి. వాణిజ్య పరంగా ఆఫ్రికన్ బంతి రకాలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది.
ఆఫ్రికన్ బంతి:
ఇది ఏపుగా, ఎత్తుగా పెరిగే ధృడమైన మొక్కలు. వీటిలో వివిధ రంగు గల పెద్దపూల రకాలున్నాయి. పూసా నారింగ గైండా, పూసా బసంతి గైండా ఈ మధ్య విడుదలైన ఆర్కా బంగార (పసుపు) మరియు ఆర్కా అగ్ని (నారింజ) మంచి దిగుబడి నిస్తున్నాయి. అయితే ఇవి కాండం కత్తిరింపు ద్వారా మాత్రమే వ్యాప్తి చేసుకోవచ్చు. ఈ రకాలలో విత్తనం ఉండదు. ఇవికాక ప్రైవేటు సంస్థలు రూపొందించిన, హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి.
ఫ్రెంచి బంతి:
ఈ రకం మొక్కులు పొట్టిగా ఉండి ధృడంగా సింగిల్ లేక డబుల్ పువ్వులను కలిగి ఉండి ఆఫ్రికన్ బంతి రకాల కన్నా త్వరగా కోతకు వస్తాయి.
నారు పెంపకం:
వాణిజ్య పరంగా బంతిని విత్తనాల ద్వారా వ్యాప్తిచేస్తారు. ఎకరానికి సరిపడా నారు పెంచడానికి 800 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. మొకల శాతం బాగా ఉంటే ఎకరానికి 400-500 గ్రాముల విత్తనం సరిపోతుంది. నారు పెంచడానికి 15 సెం.మీ. ఎత్తు 1 మీ. వెడల్పు ఉన్న మడులను చేసుకుని, ఒక చదరపు మీటరు మడికి 8-10 కిలో చివికిన పశువుల ఎరువుతో మట్టి వేసి వెంటనే బాగా కలపాలి. చలికాలంలో మొలక త్వరగా రావడానికి నారు మడులలో ఎండి గడ్డిని వేసి కప్పాలి. మొలకలు కనిపించిన వెంటనే గడ్డిని తీసివేయాలి. హైబ్రీడ్ విత్తనాన్ని ట్రేలో నాటినట్లయితే బలమైన నారు మొక్కలను తయారు చేసుకోవచ్చు.
నాటుకునే సమయం:
బంతిని అన్ని కాలాల్లో సాగు చేపట్టినప్పటికీ, ఒకనెల తేడాలో జులై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకుంటే, మార్కెట్కు అక్టోబర్ – ఏప్రిల్ వరకు పువ్వులు సరఫరా చేయవచ్చు. ముఖ్యంగా పూలు పండుగ సీజనులో వచ్చేటట్టు మొక్కలను నాటుకుంటే రైతులు ఎక్కువ లబ్ది పొందుతారు. సుమారుగా పండుగ రోజుకి 60 రోజుల ముందుగా నాటుకోవాలి. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్లో నాటుకున్న పంటల నుండి మంచి నాణ్యమైన పువ్వులు మరియు విత్తనాలు కూడా పొందవచ్చు. ఆఫ్రికన్ రకాలు 60 x 45 సెం.మీ. దూరంలో ఫ్రెంచి రకాలు 20 x 20 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. 3 లేక 4 ఆకులు కలిగి 25 రోజు వయసున్న ధృడమైన బంతి నారు నాటడానికి అనుకూలం. నారు తీయడానికి ఒకరోజు ముందు నారుమడికి నీరు ఇచ్చినట్లయితే మొక్క వేర్లు దెబ్బతినకుండా ఉంటాయి. ఎఫ్-1 హైబ్రిడ్ 2 స్x 2 ఫీట్లు దూరంలో నాటవచ్చును. ఇలా నాటితే ఎకరాకు 7200 మొక్కులు సరిపోతాయి.
ఎరువులు :
ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.
నీటి యాజమాన్యం:
బంతి మొక్కలకు అన్నిదశల్లోనూ సరిపడినంత తేమ భూమిలో ఉండాలి. మొక్కలు ఏ దశలోనైనా నీటి ఎద్దడికి గురయినట్లయితే మొక్కల పెరుగుదల మరియు పూత దెబ్బతింటుంది. నేల స్వభావం, వాతావరణం బట్టి నీటి తడులు ఇచ్చుకోవాలి.
తలలు త్రుంచటం:
ఆఫ్రికన్ బంతి రకాలలో పెరుగుదల ఎక్కువగా వుండి చివరిగా పూల మొగ్గ ఏర్పడుతుంది. ఆ తర్వాతే ప్రక్క కొమ్ములు ఏర్పడతాయి. అందువల్ల మొక్కలను నాటిన 40 రోజులకే తలలు త్రుంచినట్లయితే అనేక ప్రక్క కొమ్ములు తొందరగా ఏర్పడి మొక్కలు మంచి ఆకారాన్ని సంతరించుకుని, ఎక్కువ మొతాదులో ఒకే పరిమాణంలో పూలు వస్తాయి. హైబ్రిడ్ రకాలలో 20 రోజులకే తలలు తుంచాలి.
పూలకోత:
బాగా విచ్చుకున్న బంతి పూలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయటం మంచిది. పువ్వులను కోసే ముందు నీరు ఇచ్చినట్లైతే పువ్వులు తాజాగా ఎక్కువగా కాలం నిల్వ ఉంటాయి. ఎప్పటికప్పుడు పూలు కోసినట్లయితే దిగుబడి పెరుగుతుంది. కోసిన తరువాత పువ్వులను తడిపిన గోనె లేదా వెదరు బుట్టలలో ఉంచి తడిగుడ్డను కప్పి మార్కెట్కు తరలించాలి.