యుగంధరునికి జోహార్లు !
గోపిచంద్ నవల ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’, తండ్రి రాసిన వీలునామాను కొడుకులు చదవడంతో మొదలవుతుంది. ఆ వీలునామా ‘వందేళ్ల క్రిందట వున్నవారు ఇప్పుడు లేరు, ఇప్పుడు వున్నవారు వందేళ్ల తరువాత వుండరు’ అని ప్రారంభమవుతుంది. ఈ సాధారణ సూత్రానికి కొన్ని అసాధారణ మినహాయింపులు వుంటాయి. మొన్న తుది శ్వాస విడిచిన బి.ఎన్. యుగంధర్ గారు అటువంటి మినహాయింపు. నోట్ల కట్టల సంపాదన లెక్కలలో మాత్రమే మనుషులను గుర్తించే అర్బకులు, అంగుష్టమాత్రులకు ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత ‘సత్యా నాదేళ్ళ’ తండ్రి కావచ్చు. కానీ నా ప్రకారం బి.ఎన్. యుగంధర్ కుమారుడు సత్య. తనయునికంటే ఆయన ఎన్నో రెట్లు ఉన్నతుడు, మహోన్నతుడు. సి.ఇ.ఓ.గా సత్య పేరు బయటకు రాగానే, ఇక మీకు తెలుసుకదా మన మీడియా ఆయన తండ్రి గూర్చి (లోపాయికారిగా ‘కులం’ గూర్చి) వాకబు చేసింది. జూబ్లీహిల్స్‌లో ఒక సాధారణ ఇంటిలో ఆయన వుంటున్నారని కనిపెట్టి ఆ వీధిలో మోహరించింది. యుగంధర్ గారు తలుపు బిడాయించుకొని కూర్చున్నారు. ఆయనకు ఓపిక నశించింది, మీడియా అధినేతలకు ఫోన్ చేసి ఇంటిముందు ఖాళీ చేస్తారా లేదా అని హెచ్చరించారు. ఒక అమెరికన్ బహుళజాతి కంపెనీకి తన కుమారుడు సి.ఇ.ఓ. అవ్వడం పట్ల తాను సంతోషగా వున్నారా?
మొదటి పరిచయం
మనం ఏ రంగం పట్ల ఆసక్తిని కలిగి వున్నమో మనకు తెలియకుండా మన కళ్ళు దానికోసం వెతుకుతూ వుంటాయి. చాలా మంచి గ్రంధాలయం వున్న ఒక ఎన్.జి.వో. కార్యాలయానికి నేను వెళ్లినప్పుడు – చాలా కాలం క్రిందటి సంగతి- ఆక్కడ అరలలో వున్న పుస్తకాల టైటిల్స్‌లో నికూaఅస =వటశీతీఎరకు అనే పుస్తకంపై నా చూపులు ఆగి నిలిచాయి. అది ఒక పుస్తకం కాదు, పలు వాల్యుమ్స్లో ఒకటి. ఒకొక్క రాష్ట్రానికి ఒకటి. నా వేళ్ళు ఎ.పి. వాల్యుమ్ను వెతికిపట్టుకున్నాయి. దాని సంకలనకర్త బి.ఎన్. యుగంధర్ గారు. ఆయన ముస్సోరిలోని ఐ.ఎ.ఎస్.ల శిక్షణ కేంద్రానికి అధిపతిగా కూడా చేశారు. ఆ సమయంలో ట్రైనీ ఐ.ఎ.ఎస్.లూ, అప్పటికే పోస్టింగ్స్ పొంది భూమి సమస్యపై ఆసక్తితో పనిచేస్తున్న ఐ.ఎ.ఎస్.లను పోగేసి వారితో సమాచార సేకరణ, వ్యాసాలు రాయించారు. ఈ రోజు వై.ఎస్. జగన్ రాకతో మళ్ళీ ‘లైమ్ లైట్’లోకి వచ్చిన డా|| పి.వి. రమేశ్, ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు సబ్ – కలెక్టరుగా రాసిన వ్యాసం కూడా అందులో వుంది. ఆ పుస్తకాలకు ముందు మాట రాసింది ఆర్.ఎస్. శంకరన్ గారు మరో ‘లెజెండ్రి’. ఆ పుస్తకం నాలాంటి దాహర్తికి ఒక మంచి నీటి కడవ. అది ఆయన పేరుతో మొదటి పరిచయం.నాలాగే భూమి సమస్య పై ఆసక్తి, అనురక్తి కలిగి అటు అధ్యయనం, ఇటు క్షేత్రస్థాయి పనితో పరిచయం వున్న మిత్రుడు రవి, నేను కలసి – మా మొదటి ముఖ పరిచయం – వారిని కలిసాం. ఆ రోజు నుండి మేము ఇరువురం ఆయన అభిమానం చూరగొన్న యువ మిత్రులుగా మారాం.
శ్రీకాకుళం జిల్లా కలెక్టరు :
1967 అవిభాజ్య శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా ఆయన పనిచేశారు. ఆ సమయంలో ఆదివాసీ ప్రాంతాలలో నక్సలైట్ వుద్యమం మొదలయింది. కీలకమైన నాయకులు చనిపోయింది ఆయన కలెక్టరుగా వున్నప్పుడే. ఒకసారి – ఆయన మూడ్ చూసి – ఈ విషయం అడిగాను. ‘వారు ఏ స్టేట్‌కు వ్యతిరేకంగా పోరాడారో దానికి ప్రతినిధిగా ఇవతలవైపు వున్నారు నక్సలైట్ ఉద్యమంపై మీ అంచనా ఏమిటి’ అని అడిగాను. కొన్ని సెకండ్ల గంభీరమైన మౌనం తరువాత వాళ్లు ‘దేశ భక్తులు’ అన్నారు. ప్రసిద్ధి నక్సలైట్ నేతలలో ఒకరైన తామాడ గణపతి ఎన్కౌంటర్ ఎలా జరిగింది. కలెక్టరుగా తనకు వచ్చిన సమాచారం ప్రకారం – చెప్పారు. ఆర్.ఎస్.శంకరన్, తాను కలిసి జైళ్ళల్లో వున్న నక్సలైట్ నేతలను కలసి సంభాషించారు. వారి ఇరువురి మేధస్సులో నుండి రూపు తీసుకున్నదే, దేశంలో ఎక్కడ లేని 1/70 చట్టం. ఆదిభట్ల కైలాసం కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశానని, అది కైలాసానికి కోపం తెప్పించిందని చెప్పారు.
నక్సలైట్ ఉద్యమంపై మీ అనుభవాలను వీడియో రికార్డు చేస్తానని అడిగాను, ‘అలాగే చెయ్’ అంటూ అప్పటి ఎస్.పి. ఇక్కడే వున్నాడు నేను చెపుతాను వాడిది కూడా రికార్డు చెయ్ అన్నారు. నేను అవకాశాన్ని వాడుకో లేకపోయాను. స్టేట్ ప్రతినిధిగా వున్న తన అనుభవాలు భావి తరాలకు లేకుండా చేసినవాడినయ్యాను.
Institution builder
అంటే ఇటుకులు – సిమెంటు భవనాలను మంజూరు చేసినవాడని కాదు. మనుషులతో, అందునా పేదలు, నిస్సహాయులను సంఘటిత పర్చడం, వారిని శక్తీకరించడానికి కావలసిన వ్యవస్థలను వారితో నిర్మించడం తనకు చాలా ఇష్టమైన పని. మహిళల స్వయం సహాయక సంఘాలు (ఎస్.హెచ్.జి.), ఉపాధి హామీ పధకంలో ‘శ్రమ శక్తి సంఘాలు’ (ఎస్.ఎస్.ఎస్.) లాంటివి ఇందుకు మంచి ఉదాహరణలు. దోపిడీకి గురయ్యే ప్రజలకు కావలసింది నాయకులు ఙaఅస్త్రబaతీస కాదు, సహాయకులు, సహ ప్రయాణికులు. తమ విముక్తిని తాము సాధించుకొనే విధంగా వారు శక్తీకరణ చెందాలి, అందుకు వారికి సహయకులు, సహచరులు కావాలని నమ్మినాడు. శ్రమ శక్తి సంఘాలలోని గ్రామీణ ఉపాధి కార్మికులకు ఈ పద్దతిలో శిక్షణ ఇవ్వాలని ఆయన తపనపడ్డారు. తన ఇంటి పై భాగాన వున్న గ్రంధాలయానికి నన్ను తీసుకుపోయారు. అరల నిండా వందల కొద్దీ పుస్తకాలు, నివేదికలు. అందులో నుండి ‘ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి’ అనే విషయంపై వున్న కొన్ని పుస్తకాలు నాకు ఇచ్చారు. గ్రామీణ అభివృద్ధిశాఖతో ఈ పని చేయించడానికి తన పలుకుబడి ఉపయోగించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా, నేను, నా బృందం ఓ 1,500 మంది ఆదివాసీ యువ ఉపాధి కార్మికులకు శిక్షణ ఇవ్వగలిగాను, చంద్రునికి ఒక నూలుపోగులా !
ధనికులు – పేదలు :
మన సమాజంలో ధనిక, పేద, పెద్ద, చిన్న కులాల తారతమ్యాలు వున్నాయి. అయితే వీరు కలుసుకొని ఒకరి గూర్చి ఒకరు తెలుసుకొనే తోవలు/ మార్గాలు / అవకాశాలు వుండాలి. విద్యా ప్రైవేటీకరణ అటువంటి అవకాశం లేకుండా చేస్తుందని ఒకసారి అంటూ తన అనుభవాన్ని చెప్పారు. వారి తండ్రి గారు డి.ఎస్.పి., డి.ఎస్.పి. కొడుకు, ఆ డి.ఎస్.పి. కారు డ్రైవరు కొడుకు ఒకే బడిలో సహధ్యాయులు. ఈ స్నేహితులు ఒకరి ఇంటికి ఒకరు అదే స్నేహితుడు హోదాలో వస్తుపోతు వుండేవారు. కనుక నాకు మా డ్రైవరు జీవితం గూర్చి తెలిసిందని అన్నారు. ఈ ‘ఎంగేజ్మెంట్’ సమాజానికి చాలా అవసరం అని అన్నారు. ఇప్పుడు ఎల్.కె.జి. నుండే ఈ దూరం మొదలవుతుందని ఇది సమాజానికి చాల ప్రమాదకరమని చెప్పారు.
ఆ తరువాత ఫోన్ :
యుగంధర్ గారితో మనకు ఒక అంశంలో విభేదం వస్తే ఆయన మనతో చాలా గట్టిగా వాదిస్తారు (కోపం ఆయన ప్రథమ బలహీనత). మీకు ఆ సాయంత్రం లేదా రెండవ రోజు ఫోన్ వస్తుంది. మీ వాదనలో బలం వుంటే దానిని అంగీకరించడానికి, తాను ఆ సమయంలో సరిగ్గా గుర్తించలేదని మీతో చెప్పడానికి ఆయనకు ఏ అహాలు అడ్డురావు. ప్రణాళిక సంఘం సభ్యునిగా వున్నప్పుడు నేను ఢిల్లి వెళ్ళి కలిసాను. నాన్ – షెడ్యూల్ ఆదివాసీలను షెడ్యూల్ ఏరియాలో కలిపే ప్రతిపాదనలు – 1977 నాటివి ప్రస్తావిస్తే అవి అమలుకావని వాదించారు. ఆ ఏ.సి. గది, తీవ్ర స్వరాలతో జరిగిన మా వాదనతో వేడెక్కింది. ఆయన సిబ్బంది బిత్తరపోయారు. నేను తన ముందు పెట్టిన అంతటి ముఖ్యమైన అంశంపై తాను సరైన రీతిలో స్పదించ లేకపోయానని సారీ చెప్పారు, ఆ తరువాత. ఆ తదుపరి తన పరిధిలో కొంత ప్రయత్నం కూడా చేశారు.
ఒక తరం ఐ.ఎ.ఎస్.లు :
ఐ.ఎ.ఎస్. అనే మూడు అక్షరాలు ఇచ్చే హోదా, పెత్తనం, కారు, బంగ్లా కోసం వారు అందులో చేరినవారు కారు. రాజ్యాంగంలోని మూడు భాగాలు వారిని ప్రభావితం చేశాయని – వారి మాటలను బట్టి – నేను గుర్తించాను. అవి 1. రాజ్యాంగం పీఠిక 2. ప్రాధమిక హక్కులు 3. ఆదేశిక సూత్రాలు. బి.ఆర్.శర్మ, ఎస్.ఆర్.శంకరన్, కె.బి.సక్సేనా, బి.ఎస్. యుగంధర్, ఇ.ఎ.ఎస్. శర్మ నాకు తెలిసిన కొన్ని పేర్లు. వారు ఈ దేశానికి, అందులోనూ నోరువాయ లేని వారికోసం తమ జీవితాలను అంకితం చేశారు, చాలా, చాలా నిశ్సబద్ధంగా. వారి సన్నిధిలో మనం ఒక్క నిమిషం వున్న చాలు అది మనపై ఒక జీవితకాలం ప్రభావం నెరుపుతుంది.
ఆ తరం ఐ.ఎ.ఎస్.లకు, ఈ తరం ఐ.ఎ.ఎస్.లలో వారసులు వున్నారా? వున్నారు, ఒక కోటి మంది కాశ్మీరీ ప్రజలకు రాజ్యాంగం లేకుండా చేసినప్పుడు ఇద్దరు యువ ఐ.ఎ.ఎస్.లు రాజీనామాలు సమర్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ఎ.పి. సోషల్ ఆడిట్ (జి.వో.ఎ.పి. గ్రామీణ అభివృద్ధి శాఖ) వ్యవస్థాపక బోర్డు / కార్యవర్గ సభ్యునిగా నేను వారితో పాటు వున్నాను. క్షేత్రస్థాయి నుండి వచ్చిన వారీగా మా అభిప్రాయాలను శ్రద్ధగా వినేవారు, విలువ ఇచ్చేవారు. వ్యక్తిగా అవి నాకు చాలా గర్వకారణమైన జ్ఞాపకాలు.
బి.ఎన్. యుగంధర్ గారు సబ్- కలెక్టరు నుండి (జాతీయ) కార్యదర్శి వరకు అనేక పదవులు నిర్వహించారు. ఒక తరం యువ ఐ.ఎ.ఎస్. లను తీర్చిదిద్దారు. జాతీయ స్థాయిలో డి.ఆర్.డి.ఎ. వ్యవస్థల ఏర్పాటుకు రూపకర్త. ప్రణాళిక సంఘం సభ్యుడు. ఇప్పుడు కేంద్రంలో వున్న రెడ్డి సుబ్రమణ్యం గారు ఒక సమావేశంలో ఆయనను తండ్రివంటి వాడని సంబోధిచడం నేను విన్నాను. నాలాంటి, రవిలాంటి వారందరికీ ఆయన తండ్రివంటి వాడు, ఒక source of inspiration. మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఓ. తండ్రి కావచ్చు, కానీ తన సంపాదనతో కట్టుకున్న ఇంటిలో – అది మధ్య తరగతి స్థాయి ఇల్లు – భార్యతో జీవించారు. ఆమె చనిపోయిన తరువాత, తాను పౌర జీవితం నుండి నిష్క్రమించారు. ఎవరిని రానివ్వటం లేదని, ఎవరితోనూ మాట్లాడటం లేదని రవి చెప్పాడు. నాకు తెలిసి ఒక్క బి. రాజశేఖర్ (ఇప్పుడు విద్యాశాఖ కార్యదర్శి) గారిని మాత్రమే లోపలికి అనుమతించారని విన్నాను. ఆ విధంగా రాజశేఖర్ అదృష్టవంతుడని చెప్పాలి.
బి.ఎన్. యుగంధర్ ఒక దేశ భక్తుడు వారికి అశ్రునయనాలతో నా శ్రద్ధాంజలి.
– పి.ఎస్. అజయ్ కుమార్