మెట్టభూముల్లో పండ్ల తోటల సాగు – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం
మెట్టభూముల్లో పండ్ల తోటల సాగు
మన రాష్ట్రంలో అధికశాతం వ్యవసాయ పొలాలు, వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల ఆహారోత్పత్తి ఒక నిర్ణీతస్థాయిలో ఉండటం లేదు. అంతేకాకుండా చాలా వరకు మెట్ట ప్రాంతాల్లో పై పొర కొట్టుకుపోయి నేల నిస్సారమవుతుంది. దానికితోడు గత కొద్ది కాలంగా మన రాష్ట్రంలో ఏర్పడే వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతు ఎక్కువగా పండ్లతోటల సాగు వైపు దృష్టిపెడుతున్నారు. ఎందుకంటే మిగతా పంటల కంటే పండ్ల తోటల సాగు తక్కువ నీటితో చేసుకోవచ్చు. అయితే ఈ వర్షాభావ పరిస్థితుల్లోనూ, మెట్టభూముల్లో పండ్లతోటలసాగు లాభదాయకమైనప్పటికీ అనువైన పండ్లజాతులను ఎంపిక చేసుకోవాలి. నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులను అవంభించాలి. ఆధునిక మెట్ట వ్యవసాయ సాగు పద్దతులను తప్పనిసరిగా చేపట్టాలి.
మెట్టభూముల్లో పండ్లజాతుల ఎంపిక :
మెట్టప్రాంతాల్లో ముఖ్యంగా రేగు, ఉసిరి, సీతాఫలం, జామ పండ్లజాతులను, కొద్దిపాటి సాగునీటి సౌకర్యం ఉంటే దానిమ్మ మరియు సపోటను సమర్ధవంతంగా సాగుచేసుకోవచ్చు.
రేగు తోట సాగు వివరాలు :
రేగులో ముఖ్యంగా గోల, సెబ్, కైథిలి, ఉమ్రాన్, మండియ వంటి రకాలను సాగుచేసుకోవచ్చు. వీటిని 6 x 6 మీ. దూరంలో అంటుమొక్కలను నాటుకోవాలి. నాటుకున్న తర్వాత వేరు మూలంపై వచ్చే చిగుళ్ళను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండం ఒక మీటరు ఎత్తు పెరిగే వరకు దానిపై వచ్చే కొమ్మలను తీసివేస్తూ ఒక మీటరు ఎత్తుపెరిగిన తర్వాత 4-5 కొమ్మలను నాలుగువైపులా పెరిగేటట్లు చూడాలి. ఇలా పెరిగిన చెట్లను ప్రతి సంవత్సరం మార్చి – ఏప్రిల్ నెలల్లో కత్తిరింపులు చేయాలి. కత్తిరింపు చేయకపోతే చెట్టు అడ్డదిడ్డంగా పెరగడమే కాకుండా దిగుబడి కూడా తగ్గుతుంది.
అలాగే నాటిన తర్వాత 2-3 సం॥ వరకు కుండపద్ధతి (పిచ్ఛర్ పద్ధతి)లో నీరు పెట్టాలి. వేరుశనగ, లేదా వరి పొట్టును 8 సెం.మీ. మందంతో చెట్టు పాదుల్లో వేయాలి. ఇలా చేయడం వలన ఆరు సంవత్సరాల వయస్సున్న చెట్టునుండి దాదాపు 40-50 కిలో పండ్ల దిగుబడిని పొందవచ్చు. పండ్లన్ని ఒకేసారి పక్వానికి రావు కాబట్టి 3-4 సార్లు కోయవలసి ఉంటుంది.
ఉసిరిలో మనకు అనుకూలమైన రకాలు ఏమిటి? :
ఉసిరిలో నరేంద్ర-7, నరేంద్ర-6, 10, చకియా, క్రిష్ణయ్య, కాంచన్ మొదలగు రకాలున్నాయి. ఉసిరిని నేల స్వభావాన్ని బట్టి 8 x 10 మీ. దూరంలో నాటుకోవాలి. ఉసిరిలో ఔషధగుణాలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఉసిరి సాగు చాలా లాభదాయకం. దానికి తోడు ఉసిరిని ఎలాంటి నేలల్లోనైనా (చౌడు నేలల్లో) సాగు చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న ఉసిరి చెట్టు నుండి 40-50 కిలోలు, 10 సంవత్సరాల వయస్సున్న చెట్టు 150-180 కిలోల పండ్ల దిగుబడినిస్తుంది.
సీతాఫలంలో మంచి రకాలు :
సీతాఫంలో బాలానగర్, ఐలాండ్జమ్, వాషింగ్టన్, అటిమో వంటి రకాలను 5 మీ. దూరంతో నాటుకోవాలి. దిగుబడి చెట్టుకు 70-80 కాయలను పొందవచ్చు.
జామలో మన రాష్ట్రానికి అనుకూమైన రకాలు :
జామలో అనువైన రకాలు లక్నో-49, అలహాబాద్ సఫేద, సఫేద్జామ, కోహెర్సఫేద. వీటిని 6 x 7 మీ. దూరంలో నాటుకోవాలి. ప్రతి చెట్టు 1000-1200 కాయల దిగుబడినిస్తుంది.
దానిమ్మలో మన రాష్ట్రానికి అనుకూమైన రకాలు :
దానిమ్మలో మృదుల, భగువ, గణేష్, జోధ్పూర్రెడ్, జోలోర్సీడ్లెస్ వంటి రకాలను 5 మీ. దూరంలో నాటుకోవాలి. కాపు సమయంలో క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. నీటి ఎద్దడి ఏర్పడితే కాయలు పగులుతుంది. దానిమ్మలో ప్రతి సంవత్సరం ప్రతి చెట్టునుండి దాదాపు 100-150 కాయలను పొందవచ్చు.
సపోటలో అనుకూమైన రకాలు :
సపోటలో కాలిపత్తి, కీర్తిబర్తి, ఛత్రి, ద్వారపుడి, క్రికెట్బాల్ వంటి రకాలను 10 మీ. దూరంలో నాటుకోవచ్చు. సపోట తోటలో చీడపీడల సమస్య మిగతా వాటికంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి నీటి సౌకర్యం ఉన్నపుడు సపోటను సాగుచేసుకొంటే లాభదాయకం. 10 సంవత్సరాల వయస్సున్న చెట్టు సుమారు 1500-2000 కాయలనిస్తుంది.
పండ్లతోట సస్యరక్షణలో ఎరువుల వాడకం:
ఈ పండ్ల జాతులన్నింటికీ సేంద్రియ ఎరువులను వాడుకోవాలి. చీడ పీడలు ఆశిస్తే జీవసంబంధిత లేదా వృక్ష సంబంధిత మందులను వాడి నివారించుకోవాలి. ఇలా చేయడం వలన నీటి ఎద్దడిని తట్టుకోవడమే కాకుండా పండ్ల నాణ్యత బాగుండి పండ్లు త్వరగా చెడిపోకుండా ఉంటాయి. అంతేకాకుండా రసాయన అవశేషాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యరిత్యా చాలా మంచిది. ఎగుమతి అవకాశాలు కూడా చాలా బాగుంటాయి.
పండ్ల తోటలు నాటుకోవటానికి అవసరమైన విత్తనాలు :
పండ్ల జాతుల్లో అంటు మొక్కలు నాటుకోవడం మంచిది. ఎందుకంటే తొందరగా కాపుకు రావడమే కాకుండా మనకు కావలసిన రకం లక్షణాలను కలిగి వుంటాయి. ఈ అంటుమొక్కలను పండ్ల పరిశోధనా స్థానం, సంగారెడ్డి, మెదక్ నుండి పొందవచ్చు. ఇవి కాకుండా సాంప్రదాయకంగా మెట్టప్రాంతాల్లో లభించే నేరేడు, ఫాల్సా, బిలుసు, అంజూర వంటి పండ్ల జాతులను కూడా వేసుకోవచ్చు. వీటికి మార్కెట్లో పెద్దగా ధర భించకపోయినప్పటికీ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కుటుంబస్థాయిలోనూ, గ్రామస్థాయిలోనూ పోషక ఆహార భద్రతను పొందవచ్చు.
పండ్ల తోటలకు అవసరమైన నేలలు :
మెట్ట భూముల్లో నీరు ప్రధాన సమస్య కాబట్టి నీటి పరిరక్షణా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. సాధారణంగా ఈ భూములకు వాలు ఎక్కువగా ఉండి వర్షాకాలంలో పడే వానతాకిడికి నేల పైపొర కొట్టుకొనిపోయి సారవిహీనంగా ఉంటాయి. అందుచేత మెట్టభూముల్లోని భూసారం, నీటివనరులను కాపాడుకోవసిన బాధ్యత ఎంతో ఉంది. దీని కోసం వర్షాకాలంలో వచ్చే వాన నీటిని సాధ్యమైనంత వరకు నేలలో ఇంకేటట్లు చేయాలి. మట్టి, పోషక పదార్థాలు కొట్టుకొని పోకుండా కొన్ని మెలకువలు పాటించాలి. ముఖ్యంగా వాలుకు అడ్డంగా దున్నడం, స్థిరమైన వాలుగట్లు ఏర్పాటు చేయడం, వర్షపు నీటిని నిల్వ చేయుటకు పొలంలో 5 శాతం విస్తీర్ణంలో అక్కడక్కడ గుంతలు తీయటం చేయాలి. ఇలా తీసిన గుంతల్లో చేరిన నీటిని మనం అవసరమైనపుడు తోటకు పెట్టుకోవచ్చు.
పోషకాల యాజమాన్యం :
రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి పశువు ఎరువు, వర్మీకంపోస్టు మొదలగు సేంద్రియ ఎరువు వాడకం పెంచడం వలన నేల భౌతిక స్థితి మెరుగుపడి వర్షపునీటిని గ్రహించి నిలుపుకునే శక్తి పెరుగుతుంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువుగా తోటమధ్య ఖాళీ ప్రదేశంలో జీలుగ, జనుము, పిల్లిపెసర, మినుము, గోరుచిక్కుడు, ఉలవ, అలసంద వంటి పంటలను వర్షాకాలంలో వేసి దున్నడం వలన భూసారం పెరగడమే కాకుండా కొన్ని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పెరిగి నేలకు పోషకాలు గ్రహించే శక్తి పెరుగుతుంది. అలాగే ఇసుకతో కూడిన నేలలైతే కొంచెం బంకమన్నును చెట్లపాదల్లల్లో వేయడం వలన వేసవిలో నీటిఎద్దడిని కొంత వరకు తట్టుకుంటాయి.
వేసవిలో నీటిఎద్దడి సమస్యలు – జాగ్రత్తలు :
ప్రత్యేకించి వేసవిలో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మరిన్ని జాగ్రత్తలు, మెలకులు పాటించాలి. అవి
కుండలతో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి (పిచ్ఛర్ పద్ధతి):
చెట్టుపాదలులో నలువైపులా మొదలుకు దూరంగా పీచువేర్లు ఉండే ప్రాంతంలో 20 లీటర్ల కెపాసిటీగల మట్టి కుండకు చిన్న రంధ్రం చేసి నేలలో పాతిపెట్టాలి. ఈ రంధ్రం ద్వారా భూమిలోకి నీరు కారి పీచువేర్లకు అందుతుంది. ఇలా చేయడం వన తక్కువ నీటితో చెట్లను పెంచుకోవచ్చు.
మల్చింగ్:
వయస్సును బట్టి చెట్టుకు 30-40 కిలో వేరుశనగ పొట్టుగానీ, వరిపొట్టుగానీ పాదులలో సమంగా పరచడం వలన నీరు త్వరగా ఆవిరికాదు కలుపు మొక్కలు రావు. నేల ఉష్ణోగ్రత కూడ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఈ పొట్టు కొంత కాలానికి క్రుంగిపోయి మట్టిలో కలిసి అల్యూమినియంగా మారి నేలకు నీటిని ప్పీల్చుకునే శక్తిని, పోషకాలను గ్రహించే శక్తిని పెంచుతుంది. తేమను నిలుపుకొనే గుణం కూడా పెరుగుతుంది. మేలుచేసే సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. ఈ విధంగా మల్చింగు చేయడం వలన 10 రోజులకు పెట్టవసిన నీటిని 20 రోజులకు పెట్టవచ్చు.
పాదుల్లో పైపొర మట్టిని గుల్ల చేయడం :
పారతో లేదా గుంటకతో చెట్టుపాదులో పై పొర మట్టిని క్రింది మట్టిని విడదీసినపుడు నేలలో నేటి నాళాలు తెగి వాటిపై పలుచగా మట్టి కప్పబడడం వలన నీరు ఆవిరియ్యే ఆస్కారం అంతగా ఉండదు. నీటితడి ఇచ్చిన రెండు రోజుల తర్వాత పాదుల్లో పైపొరమట్టిని ఒక అంగుళం వరకు తెంపితే తెగిన మట్టిపొర నాళాలకు మూతలాగా పనిచేసి పాదులో తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
డబుల్ రింగుపద్ధతిలో నీరు పెడ్డడం :
చెట్టు మొదలు చుట్టూ 60 సెం.మీ. దూరంలో మొదటి గట్టును, చెట్టు కొమ్మ నీడ చివరి ప్రాంతంలో రెండవ గట్టును వేయాలి. నీరు చెట్టు మొదలుకు పోనివ్వకుండా ఈ రెండు గట్ల మధ్యలో పారించాలి. ఈ ప్రాంతంలో పీచువేర్లు ఎక్కువగా ఉండి నీటిని పీల్చుకుంటాయి. ఈ పద్దతిలో ఒక తడికి సుమారు 60 లీటర్ల నీటిని ఆదాచేసుకోవచ్చు. అంతేకాకుండా పారే నీటి ద్వారా సంక్రమించే వేరుకుళ్ళు, పుట్టగొడుగు తెగులు, బంక తెగులు వంటి ప్రమాదకరమైన తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు.