మునగ – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వాతావరణం:
మునగ ఉష్టమండలపు పంట. వేడి, పొడి వాతావరణం బాగా అనుకూలం. అధిక చలిని, మంచును తట్టుకోలేదు. 20-25 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల ప్రాంతాలు అనుకూలం.
ప్రవర్థనం:
మునగను ఎక్కువగా విత్తనం ద్వారా మరియు లావుపాటి కొమ్మల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. సాధారణంగా బహువార్షిక మునగను 90-100 సెం.మీ. పొడవు. 5-8 సెం.మీ. మందం గల కొమ్మల ద్వారా, ఏకవార్షిక రకాలను విత్తనం ద్వారా వ్యాప్తి చేస్తారు.
నేలలు:
మునగ సాగుకు అన్ని నేలలు అనుకూలమే. కాకపోతే మంచి దిగుబడులను పొందడానికి సారవంతమైన ఎర్ర గరప నేలలు బాగా అనుకూలం. మురుగు నీరు పోయే సౌకర్యం గల నల్లరేగడి నేలలు కూడా అనుకూలం. కొద్దిపాటి సున్నం ఉన్న నేలల్లో కూడా మునగ నుంచి మంచి దిగుబడులను పొందవచ్చు.
విత్తన రకాలు :
రకం పేరు: పి.కె.యమ్-1
1. మొక్క 4-6 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
2 విత్తిన 160-170 రోజులకు పూతకు వస్తుంది.
3. కాయ పొడవు 65-70 సెం.మీ ఉంటుంది.
4. మొక్కకు 200 – 225 కాయల దిగుబడి వస్తుంది.
5. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న రకం.
6. ఎండిపోయిన కాయల నుండి విత్తనాలను సేకరించి, ఉపయోగించ వచ్చు.
రకం పేరు: జాఫ్నా
బహువార్షిక రకం. కాయలు 60-90 సెం.మీ. పొడవుతో గుజ్జు మెత్తగా రుచిగా ఉంటుంది.
విత్తన మోతాదు:
ఏకవార్షిక రకం: ఎకరానికి 250 గ్రా. విత్తనం సరిపోతుంది.
బహువార్షిక రకం: 640 కాండం ముక్కలు అవసరం.
విత్తన శుద్ధి:
విత్తనాలను బీజామృతంతో గానీ, బీజరక్షతో గానీ విత్తన శుద్ధిచేసి విత్తుకోవాలి.
ఎరువులు:
పొలాన్ని 3-4 సార్లు బాగా దుక్కిచేసి, ఆఖరి దుక్కిలో ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. లేదా ప్రతి గుంతకు 10 కి. పశువుల ఎరువుతో పాటు 250 గ్రాముల వేపపిండి వేసుకొని నీరు పారించాలి.
విత్తే విధానం:
మునగ విత్తనాన్ని నేరుగా పొలంలో విత్తుకోవచ్చు. లేదా నారుమడి వేసి నారును పొలంలో నాటుకోవచ్చు. ఈ రెండింటిలో నారును తయారు చేసుకొని పొలంలో నాటుకోవడమే మంచి పద్దతి.
ఒక్కో విత్తనాన్ని ఒక్కో పాలిథిన్ సంచిలో విత్తుకొని రోజు విడిచి రోజు నీరు పెడుతూ 30-40 రోజుల తర్వాత పొలంలో నాటుకోవచ్చు.
నాటేకాలం:
మునగను జూన్ నుండి ఆగస్టు మాసాలలో నాటుకోవడం లాభదాయకం. అంటే సుమారుగా ఫిబ్రవరి – మార్చి మాసాలలో కాయలు కోతకు వస్తాయి. కనుక ఫిబ్రవరి – మార్చికి 7-8 నెలల ముందుగా మొక్కలను నాటుకోవడం మంచిది.
నాటే దూరం:
నేలను చదును చేసి 2.5 మీ. ఎడంలో వరుసలను ఏర్పరుచుకొని, ఒక్కో వరుసలో 2.5 మీ. ఎడంలో 45x45x45 ఘనపు సెం.మీ. గుంతలు తీసి మొక్కలను నాటుకోవాలి. మొక్కలను నాటేటప్పుడు వేర్లకు ఏమాత్రం హాని కలిగించకుండా పాలిథీన్ సంచిని మాత్రమే తొలగించి, మట్టితో సహా మొక్కలను గుంతలలో నాటుకోవాలి.
అంతర పంటలు:
మునగలో అంతర పంటలుగా అలసంద, బెండ, వంగ, గోరుచిక్కుడు ఫ్రెంచి చిక్కుడు మరియు ఆకు కూరగాయలను కూడా వేసుకోవచ్చు.
అంతరకృషి:
మొక్కలు 75 సెం.మీ. ఎత్తు పెరగగానే వాటి చివర్లు తుంచి వేస్తే ప్రక్క కొమ్మలు వచ్చి కాపు ఎక్కువగా వస్తుంది. ప్రక్క కొమ్మలు కూడా 2 అడుగులు లోపే తుంచి వస్తే మొక్కలు గుబురుగా పెరిగి ఎక్కువ పూత, కాత వచ్చే అవకాశముంది. ఫిబ్రవరి-మార్చిలో కాయలు కోసిన తర్వాత చెట్టును ఒక మీ. ఎత్తు వరకు కత్తిరించి, రెండో పంటకు పైన తెలిపిన మోతాదులో ఎరువు వేసి నీరు పెట్టాలి. ఏకవార్షిక రకాల నుండి ఈ విధంగా 3 సంవత్సరాల వరకు పంటను తీసుకోవచ్చు.
నీటి యాజమాన్యం:
నాటిన వెంటనే నీరు పెట్టాలి. నేల స్వభావాన్ని బట్టి 15-20 రోజులకు నీటి తడి ఇవ్వాలి. వర్షాకాలంలో సకాలంలో వర్షాలు పడితే మునగకు నీరు పెట్టక పోయినా దిగుబడిలో ఎటువంటి మార్పు ఉండదు. మునగ కొంత వరకు నీటి ఎద్దడిని తట్టుకోగలదు. కానీ పూత సమయాలలో నీటి పారుదలలో ఒడుదుడుకులుంటే పూత రాలిపోతుంది. పూత కాసే సమయాలలో 4-6 రోజుల ఒకసారి నీరు పెట్టుకుంటే మంచి దిగుబడులను పొందవచ్చు.
దిగుబడి :
ఏక వార్షిక రకాలలో (పి.కె.యమ్-1) ఒక చెట్టు నుండి సంవత్సరంలో 250 కాయల దిగుబడిని పొందవచ్చు. బహువార్షిక రకాల్లో మొదటి రెండు సంవత్సరాలు ఒక్కో చెట్టు నుండి 80-90 కాయలు ఆ తర్వాత నుండి 500-600 కాయలు సంవత్సరానికి పొందవచ్చు.
సస్యరక్షణ
పురుగుల నివారణ:
తామర పురుగులు:
ఇవి పంట చిగుళ్ళ నుండి రసం పీల్చడం వలన చిగురు గిడసబారిపోయి చిగుళ్ళు ఎండిపోతాయి. పూత, కాయ ఉండదు. నివారణకు వేపకషాయం లేదా నీమాస్త్రం 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
గొంగళి పురుగు:
ఈ పురుగు వర్షాలు పడిన తరువాత పంటను ఆశించి రాత్రి వేళలో ఆకులను విపరీతంగా తిని, పగటి వేళ కాండం మీద ఒకే చోట గుంపుగా చేరుతాయి. లేత ఆకులకు నష్టం ఎక్కువగా కలిగిస్తాయి. నివారణకు పగటిపూట పురుగులకు మంట పెట్టాలి. కాండం ఆకులకు మంట తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కాండం తొలుచు పురుగు:
ఈ పురుగును ఎక్కువగా పాత తోటలలో గమనించవచ్చు. లద్దె పురుగులు కాండంపై రంధ్రాలు చేసి లోపలికి తొలుచుకొని పోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే చెట్లు ఎండిపోతాయి. నివారణకు లద్దె పురుగు చేసిన రంధ్రాలలో ఇనుప చువ్వను చొప్పించి పురుగులను చంపేయాలి. పురుగు చేసిన రంధ్రాలలో వేప నూనె లేదా కిరోసిన్ ముంచిన దూదిని రంధ్రాలలో ఉంచి పైన తడి మట్టితో కప్పాలి.
తెగుళ్ళ నివారణ :
వేరుకుళ్ళు తెగులు:
ఈ తెగులు వర్షాకాలంలో మురుగు నీరు పోయే సౌకర్యం లేని భూముల్లో ఎక్కువగా ఆశిస్తుంది. దీని వలన వేర్లు కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంది. నివారణకు మొక్క మొదలు వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్టు మొదలులో ట్రైకోడర్మవిరిడీ కలిపిన పశువుల ఎరువును 5 కిలోల చొప్పున వేయాలి. మొక్క మొదళ్ళలో బోర్డోమిశ్రమం ద్రావణం పోయాలి.