మునగ – పోషకాలగని – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం
మునగ – పోషకాలగని
ప్రపంచ వ్యాప్తంగా సాగు చేసే పంటలలో అధిక పోషకాలు కలిగిన పంట మునగ. ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాల్లో సాగు చేసుకోవడానికి అనువైనది. మునగలో మనకు కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎమైనో ఆసిడ్స్, బీటా కేరొటేన్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మునగ ఆకుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మునగ ఆకులను ఆకుకూర గానూ, మరియు ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని సూపులలోను లేదా ఇతర వంటకాల్లోనూ వాడుకోవచ్చు.మునగ ఆకుల్లో కమలా పండులో ఉండే విటమిన్ సి కంటే 7 రెట్లు, కేరెట్లో ఉండే విటమిన్ ఎ కంటే 4 రెట్లు, పాలలో ఉండే కాల్షియం కంటే 4 రెట్లు, అరటిలో ఉండే పొటాషియం కంటే 3 రెట్లు, పెరుగులో ఉండే ప్రోటీన్ల కంటే 2 రెట్లు అధికంగా పోషకాలు ఉంటాయి.
ఉపయోగాలు
పోషకాలు : మునగ ఆకులో విటమిన్ ఎ, సి మరియు బి కాంప్లెక్స్, ఇనుము, కాల్షియం, పొటాషియం, జింకు, ప్రోటీన్లు, 10 రకాల ఎమినో ఆసిడ్లు అధిక మోతాదులో వున్నాయి.ఇన్ని రకాల పోషకాలు ఒకే మొక్కలో అధిక మోతాదులో ఉండడం చాల అరుదు.
నీళ్ళు శుద్ధి పరిచే శక్తి: మునగ విత్తనాలకు నీటిని శుద్ధి చేసే గుణం ఉండటం వలన బాక్టీరియా వంటి సుక్ష్మ క్రిములతో పాటు మురికిని కూడా వడకడుతుంది.
వంట నూనె: మునగ విత్తనాలనుండి తీసిన నూనెను వంట నూనెగా కూడా వాడుకోవచ్చు. ఆలివ్ నూనెతో సమానమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ నూనెను సౌందర్య సాధనా ఉత్పత్తిలో కూడా వాడతారు.
ఔషధ గుణం: మునగ ఆకులు, విత్తనాలు మరియు పువ్వుల్లో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిలో రక్త హీనతను, డయేరియాను తగ్గించే క్షణాలు ఉన్నాయి. మునగను అనేక రకా చర్మ వ్యాధుల నివారిణిగా కూడా వాడతారు. చెక్కెర వ్యాధిని తగ్గించే గుణాలు దీనిలో పుష్కంగా ఉండటం వలన ఆ వ్యాధి ఉన్నవారు ప్రతి రోజూ ఆహారంలో తీసుకొంటే మంచిది.
అలాగే మునగను పశువులు మరియు చేపల ఆహారంగానూ, రంగుల తయారికి, పంటలపై వచ్చే రోగాల నివారణకు, నేల ఉత్పాదకతను పెంచేందుకు, పేపరు మరియు తాళ్ళ తయారీకి ఉపయోగిస్తారు.
గమనిక: మునగ వేర్లు లేదా వేర్ల నుండి తీసే రసాలు గర్భిణీ స్త్రీలకు ఇవ్వకూడదు.
మునగాకు పొడి తయారీ:
ఆకులో అధిక పోషకాలు ఉంటాయి కాబట్టి దీనిని పొడి చేసుకొని వివిధ రూపాల్లో వాడుకోవచ్చు. పొడి చేయటం చాల సులువు మరియు నిల్వ చేసుకోవటం తేలిక. ఈ పొడిని వండుకొనే పదార్దాల్లో చల్లుకోవటానికి లేదా టీ తయారీకి వాడుకోవచ్చు. మునగ చెట్టు నుండి ఆకులను సేకరించి నీడలో ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత చేత్తో నలిపి పొడి చేసుకొని గాలి చొరపడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
నీటిని శుద్ధి చేసుకోవటానికి మునగ గింజల పొడి తయారీ: ముదిరిన మరియు ఎండిన మునగ కాయల నుండి గింజలను సేకరించి దాని పై పొరను తీసేసి లోపల భాగమును దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని శుద్ధి చేసుకోవలసిన నీటిలో వేసి కలిపి ఉంచితే నీటిలోని మలినాలన్నీ అడుగుకు చేరుతాయి. వాటిని తొలగించి పై నీటిని తాగడానికి వాడుకోవాలి. నీటి స్వచ్ఛతను బట్టి లీటరుకు 30 నుండి 300 గ్రాముల పొడి అవసరం.ఈ పొడి భార లోహాలను పీల్చుకొని నీటి నుండి వేరుచేస్తుంది.
మునగ పువ్వులతో టీ తయారీ: బాగా మరిగిన నీటిలో మునగ పువ్వులను వేసి 5 నిముషాలు కదపకుండా ఉంచి దానిలో కావలసినంత తేనె లేదా పంచదార కలుపుకొని టీ లా సేవించవచ్చు.
Tag:మునగ