మిరప సాగులో తెగుళ్ళ యాజమాన్యం – సుస్థిర వ్యవసాయ కేంద్రం
నారుకుళ్ళు తెగులు:
- నారు మడిలో లేత మొక్కలు గుంపులుగుంపులుగా చనిపోతాయి.
నారుకుళ్ళు నివారణ:
- విత్తనాలను విత్తన శుద్ధి చేసి ఎత్తైన నారుమడులలో నారును పెంచాలి. నారు మొలకెత్తిన తరువాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి నారుమడి తడిసేలా పిచికారీ చేయాలి.
- బాక్టీరియా ఆకుమచ్చ తెగులు మరియు కోనఫోరా కొమ్మకుళ్ళు తెగులు :
- వాతావరణం మబ్బుగా ఉండి ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఈ తెగులు పంటను ఆశిస్తుంది. ఆకులమీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, పండుబారి ఆకులు రాలిపోతాయి.
- కొనఫోరా కొమ్మకుళ్ళు తెగులు ఆశించిన మొక్కల లేత చిగుళ్ళు మాడిపోతాయి. కణుపుల వద్ద కుళ్ళు ఏర్పడి కొమ్మలు విరిగిపోతాయి.
నివారణ:
- కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు మరియు 1 గ్రాము స్ట్రెప్టో సైక్లిన్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు తెగులు:
- కొమ్మలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా కొమ్మలు ఎండిపోతాయి. కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళిపోతాయి.
నివారణ:
- కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
- పుల్ల మజ్జిగ + ఇంగువ ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
ఎండు తెగులు:
- మొక్కలు వడలిపోయి, పూత, పిందె, ఆకులు రాలిపోతాయి.
నివారణ:
- ట్రైకోడర్మావిరిడి 4 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
- ప్రధాన పొలంలో 2 కిలోల ట్రైకోడర్మావిరిడి 25 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఆఖరి దుక్కిలో కలిపి కలియ దున్నాలి.
బూడిద తెగులు:
- ఆకులపై తెల్లటి బూడిద రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి.
నివారణ:
- నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
- పుల్ల మజ్జిగ + ఇంగువ ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
వైరస్ తెగులు:
- మొక్కలు గిడసబారి పోతాయి. ఆకులు చిన్నవిగా మారి దుత్తులుగా ఏర్పడి ఎండిపోతాయి. పూత, పిందె ఏర్పడదు.
నివారణ:
- వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
- రసం పీల్చే పురుగులను నివారించాలి.
- విత్తనాలను ఆవుపాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
Tag:తెగుళ్ళ యాజమాన్యం, నివారణ, మిరప సాగు