మిరప రకాలు
ముఖ్యమైన మిరప రకాలు
- బార్డ్స్ ఐ చిల్లీ (ధని)
ఇది ముఖ్యంగా మిజోరాం, మణిపూర్ ప్రాంతాల్లో పండిస్తారు. మిరప రకల్తవర్ణంలో ఉండి ఎక్కువ ఘాటును కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో కోతకు వస్తుంది. కలకత్తా మార్కెట్లో విరివిగా దొరుకుతుంది. ఇందులో క్యాప్సిసిన్ శాతం 0.58
2.బ్యాడగి
ఇది ముఖ్యంగా కర్ణాటకలోని దార్వాడ్ ప్రాంతంలోను, ఆంధ్రప్రదేశ్లోనూ పండిస్తున్నారు. కాయ ఎరుపు రంగులో ఉండి తక్కువ ఘాటును కలిగి వుంటుంది. ముఖ్యంగా ఇది జనవరి నుండి మే ప్రాంతంలో కోతకు వస్తుంది.
3. గుంటూరు సన్నం (S4 Type)
ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లభిస్తుంది. దీని తోలు మొద్దుగా ఉండి ఎక్కువ ఘాటుగా ఉంటుంది. డిసెంబర్ మాసం నుండి మే వరకు కోతకు వస్తుంది.
4. హిందూపూర్ – ఐ7
ఇది ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ ప్రాంతంలో పండిస్తారు. కాయ ఎరుపురంగులో ఉండి. విపరీతమైన ఘాటు వుంటుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు కోతకు వస్తుంది. క్యాప్సిసిన్ శాతం 0.24.
5. జ్వాల
ఇది ముఖ్యంగా గుజరాత్లోని ఖేడ, మెహసానా ప్రాంతాల్లో పండిస్తారు. విపరీతమైన ఘాటు, తక్కువ ఎరుపురంగు కలిగి వుంటుంది. చిన్నవిగా వుండి విత్తనాలు కలిసి వుంటాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ప్రాంతాల్లో కోతకు వస్తుంది. క్యాప్సిసిన్ శాతం 0.4.
6. కంథారి – తెలుపురకం
ఇది ముఖ్యంగా కేరళలోను మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. కాయ తెలుపురంగులో ఉండి విపరీతమైన ఘాటును కలిగి వుంటుంది. ముఖ్యంగా పెరటి తోటలలో ఎక్కువగా పండిస్తారు. సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది. క్యాప్సిసిన్ శాతం 0.504
7. కాశ్మీర్ మిర్చి
ఇది ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతాల్లో శీతాకాలంలో పండించే మిర్చి రకం. కాయ పొడవుగా వుండి దొడ్డుగా ఎక్కువ ఎరుపురంగులో వుంటుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు కోతకు వస్తుంది. క్యాప్సిసిన్ శాతం 0.325.
8. మద్రాస్ పరి
ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఎక్కువగా పండిస్తారు. ఎక్కువ ఎరుపురంగులో ఉండి ఘాటుగా ఉంటుంది. మార్చి నుండి మే లోపల కోతకు వస్తుంది. చెన్నై మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంది. క్యాప్సిసిన్ శాతం 0.206.
9. నాగపూర్ మిర్చి
ఇది మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఎక్కువగా పండిస్తారు. ఎరుపురంగులో వుండి ఘాటుగా వుంటుంది. జనవరి నుంచి మార్చి ప్రాంతంలో కోతకు వస్తుంది. మహారాష్ట్రలోని భీమాపూర్ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది.
10. నల్చెటి
ఇది మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఎక్కువగా పండిస్తారు. ఎరుపురంగులో వుండి విపరీతమైన ఘాటు కలిగి వుంటుంది. జనవరి నుంచి మార్చి ప్రాంతంలో కోతకు వస్తుంది. క్యాప్సిసిన్ శాతం 0.12. నాగపూర్ మార్కెట్లో దొరుకుతుంది.
11. రామ్నాడ్ ముండు
ఇది తమిళనాడులోని రామ్నాడ్ జిల్లాలో ఎక్కువగా పండిస్తారు. ఇది పసుపు వర్ణపు ఎరుపు రంగులో వుండి ఘాటుగా వుంటుంది. మార్చి నుంచి మే ప్రాంతంలో కోతకు వస్తుంది. తమిళనాడులో విరూధ్నగర మరియు రామ్నాడ్ జిల్లాల్లో దొరుకుతుంది. క్యాప్సిసిన్ శాతం 0.166.
12. సంగ్లీ సన్నమ్ (S4 Type)
ఇది మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఎక్కువగా పండిస్తారు. తక్కువ ఎరుపురంగులో వుండి ఘాటుగా వుంటుంది. సెప్టెంబర్ నుంచి నవంబర్ ప్రాంతంలో కోతకు వస్తుంది. ముంబాయి, కొల్హాపూర్ ప్రాంతాల్లో దొరుకుతుంది. క్యాప్సిసిన్ శాతం 0.215
13. S9 ముండూ
ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో పండిస్తారు. మిర్చి టమాటో ఎరుపురంగులో వుండి ఒక మోస్తరు ఘాటును కలిగి వుంటుంది. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ ప్రాంతంలో కోతకు వస్తుంది. అనంతపూర్ జిల్లాలో ఎక్కువగా దొరుకుతుంది.
14. తాడపల్లి పొడవురకం
ఇది ఆంధ్రప్రదేశ్లోని తాడపల్లి ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది. తోలు మందంగా వుండి తక్కువ ఘాటు కలిగి ఎరుపురంగులో వుంటుంది. జనవరి నుంచి ఏప్రిల్ ప్రాంతంలో కోతకు వస్తుంది. క్యాప్సిసిన్ శాతం 0.11.
15. టమాటో మిర్చి
ఇది ఆంధ్రప్రదేశ్లోని వరంగల్, ఖమ్మం, ఉభయగోదావరి జిల్లాల్లో పండిస్తారు. ముదురు ఎరుపురంగులో వుండి తక్కువ ఘాటును కలిగి వుంటుంది. డిసెంబర్ నుంచి మార్చి ప్రాంతంలో కోతకు వస్తుంది. క్యాప్సిసిన్ శాతం 0.17.