మార్చి మాసంలో వ్యవసాయ పనులు
1. వరి
- రబీ వరిలో తెగుళ్ళ నివారణ (సమగ్ర సస్యరక్షణ) అగ్గి తెగులు, పొడ తెగులు, ఆకు ఎండు తెగులు, పొట్టకుళ్ళు తెగులు
- వీలైనంత వరకు తెగుళ్లను తట్టుకోగ వరి రకాలను ఎంపిక చేసుకోవాలి.
- తెగులు సోకని వరి పైరు నుండి విత్తనాలను ఎంచుకోవాలి.
- విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధిని పాటించాలి.
- గత పంట అవశేషాలను భూమిలో కలియదున్నాలి.
- వేసవి దుక్కులు చేయటం వలన గత పంటలోని తెగుళ్ల బీజాలు చాలా వరకు నిర్మూలించబడతాయి.
- ఎప్పటికప్పుడు పొలంలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవటం వలన తెగుళ్ళు వ్యాపించవు.
- పొలానికి మురుగు నీరు పోవు సదుపాయం కల్పించడం వలన, తెగుళ్ళ వ్యాప్తిని కొంత వరకు అరికట్టవచ్చు.
- వాతావరణ పరిస్థితులు, వరి రకాలు తెగుళ్ళ అభివృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవసరాన్ని బట్టి ఈ క్రింద సూచించిన ద్రావణాలను వరి పైరుపై పది రోజుల వ్యవధిలో 2-3 సార్లు పంట బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి.
ఎ) పశువుల పేడ + మూత్రం + ఇంగువ ద్రావణం (లేదా)
బి) పుల్లని మజ్జిగ + ఇంగువ ద్రావణం (లేదా)
సి) శోంఠిపాల కషాయం (లేదా)
డి) మారేడు ఆకుల కషాయం
- సూచన: పైన సూచించిన ద్రావణాలను రైతు మార్చి మార్చి వాడటం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.
ప్రధాన పొలంలో దుక్కిలో జీవన ఎరువులైన సూడోమోనాస్, అజోస్పెర్లిం మొ॥ వాడటం వల్ల కూడా తెగుళ్ళను కొంత వరకు నివారించవచ్చు.
2. మొక్క జొన్న:
- రబీ మొక్క జొన్నలో కలుపు నివారించుట
- సేంద్రియ ఎరువు వేసి నీటిని కట్టుట.
- రసం పీల్చే పురుగు ఆశించిన ఎడల సస్యరక్షణ చర్యలు చేపట్టుట.
3. వేరుశనగ
- పొగాకు లద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు
- జొన్న, సజ్జ లాంటి పంటలను వేరుశనగ పంట చుట్టూ రక్షక పంటగా 2-3 సాళ్ళలో వేయటం వలన పురుగు వలసనను నివారించవచ్చు.
- ఎరపంటగా 100 ఆముదము మొక్కలను పొలంలో వేసి, లద్దె పురుగు పెట్టిన గ్రుడ్ల సముదాయాలను నాశనం చేయాలి. జల్లెడాకులను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని నాశనం చేయాలి.
- రెక్కల పురుగు ఉనికిని వాటి ఉధృతిని అంచనా వేసేందుకు ఎకరాకు 5 లింగాకర్షణ బుట్టలను అమర్చాలి.
- పిల్ల పురుగును నివారించుటకు 5 శాతం వేప ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి.
- పురుగును తినే పక్షులను ఆకర్షించటానికి ఎకరాకు 10 పక్షి స్థావరాలను అమర్చాలి.
- ఎస్.ఎన్.పి.వి. అనే వైరస్ ద్రావణాన్ని ఎకరాకు 250 ఎల్.ఇ.ని 100 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. ఈ రోగం వచ్చిన పురుగు కొమ్మకు వేలాడి చనిపోతాయి.
- గోనె సంచి ముక్కను బెల్లం ద్రావణంలో తడిపి పొలంలో అక్కడక్కడ సాయంత్రం వేళలో అమర్చడం వలన లద్దెపురుగు రాత్రివేళ, గోనెసంచి ముక్క అడుగు భాగానికి చేరతాయి. ఈ విధంగా చేరిన లద్దె పురుగును సేకరించి నాశనం చేయటం వలన లద్దె పురుగు ఉధృతిని సమర్ధవంతంగా అరికట్టవచ్చు. (రైతుల అనుభవం)
- లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే పచ్చిమిర్చి + వెల్లుల్లి ద్రావణాన్ని గాని పంచపత్ర కషాయం గాని ఒకసారి పంటపై పిచికారీ చేయాలి.
4. కంది, పెసర, మినుము
- పంట కోతలు
- కోతనంతరం జాగ్రత్తలు
- విత్తనాన్ని జాగ్రత్త చేయటం
- నిల్వలో మెళకులు
- మార్కెట్కు పంపుట
5. మిరప
- పండు కాయలను నిల్వ చేసుకోవటం
- మార్కెట్కు పంపుట
6. కాయగూరలు
- ఆకుకూరల విత్తనాలను ఎంపిక చేసుకోవటం
- విత్తన శుద్ధి ‘బీజరక్ష’తో చేసుకోవటం
- విత్తనాలను విత్తుకోవటం
- అలం పంట తవ్వకాల నిల్వ, మార్కెటింగ్ చేయుట.
- ఉల్లిగడ్డ తవ్వకాల, నిల్వ మార్కెటింగ్ చేయుట.
- ఫిబ్రవరి నెలలో వేసిన తీగజాతి కూరగాయల పంటకు (పాదుకు) సేంద్రియ ఎరువు వేయటం. పాదుకు సుమారు 2-3 కిలోల సేంద్రియ ఎరువు వేయాలి.
- రసం పీల్చే పురుగు గమనించిన యడల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
7. పండ్లు
- అరటికి అంతరకృషి, సేంద్రియ ఎరువు వేయటం
- నిమ్మ, బత్తాయి, దానిమ్మలో ఎండు కొమ్ము కత్తిరించి ‘బోర్డాక్స్’ మిశ్రమము మొక్కలకు పూయాలి.
8. మామిడిపై సస్యరక్షణ (కాయపుచ్చు) నివారణ:
- ఈ పురుగు మామిడి కాయలు గోళీకాయ సైజులో ఉన్నప్పటి నుంచీ కోత దశ వరకూ ఆశిస్తుంది. పురుగు ఆశించిన కాయకు క్రింది భాగాన సొనతో కూడిన నల్లని మచ్చ ఏర్పడుతుంది. క్రమేపీ ఆ మచ్చ దగ్గర కాయ కుళ్ళుతుంది. కాయల చెట్టు నుండి రాలిపోవటం వాల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. గొంగళి పురుగు కాయ నుండి బయటకు వచ్చి సమీపంలో ఉన్న ఎండు పుల్లల్లో దూరి నిద్రావస్థ (కోశస్థ దశ)ను గడుపుతాయి.
- ఈ పురుగు నివారణకు, చెట్ల మీదనున్న ఎండు పుల్లను, రాలిన ఎండు పుల్లను, రాలిన కాయలను ఎప్పటికప్పుడు ఏరి తగబెట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల సుమారు 80 శాతం పురుగులను నివారించి తరువాత పంటకు కలిగే నష్టాన్ని చాలా వరకు అరికట్టవచ్చు.
- 5 శాతం వేప ద్రావణాన్ని మామిడి కాయల గోళాకాయ సైజుతో ఉన్నప్పటి నుంచి క్రమంగా 2-3 సార్లు 10 రోజుల వ్యవధిలో పంటపై (కాయలపై) పిచికారీ చేయుట ద్వారా పురుగు ఉధృతిని చాల వరకు నివారించవచ్చు.
- మామిడి తోటను శుభ్రంగా ఉంచటం కూడా ఈ పురుగు నియంత్రణకు తోడ్పడుతుంది.
Tag:వ్యవసాయ సూచనలు